ఆగని మ్యూటేషన్ మాయ!
ABN , Publish Date - Dec 08 , 2025 | 01:09 AM
గుడివాడ పురపాలక సంఘంలో మ్యూటేషన్ దోపిడీ ఇంకా కొనసాగుతోంది. కొందరు అవినీతి అధికారులు మామూళ్లు ఇస్తే చాలు ఎవరి ఇంటి పన్ను పేరునైన మార్చేస్తున్నారు. దీంతో కోట్లాది రూపాయల ఆస్తులు అక్రమంగా రిజిసే్ట్రషన్‌లు జరిగిపోతున్నాయి. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో బయటపడిన రూ.60 లక్షల కుంభకోణంలో బాధ్యులైన వారిపై నేటికీ మున్సిపల్ ఉన్నతాధికారులు చర్యలు తీసుకోలేదు. దీన్ని ఆసరాగా చేసుకుని పలువురు అవినీతి అధికారులు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని విమర్శలు వస్తున్నాయి.
- గుడివాడ మున్సిపాల్టీ పేరుతో తాజాగా పేరు మార్పు సర్టిఫికెట్ జారీ
- తమ పరిధిలో జరగలేదంటున్న మున్సిపల్ కమిషనర్
- డీఎంఏలో జరిగిందంటూ దాటవేత
- ఆ తర్వాత తప్పు జరిగిందంటూ హడావిడిగా పాత పేరు కొనసాగిస్తూ ఉత్తర్వులు
- ఇంటి పన్ను పేరు మార్చి రూ.1.50 కోట్ల ఆస్తికి అక్రమ రిజిసే్ట్రషన్!
- గతంలో రూ.60 లక్షల మ్యూటేషన్ స్కాంలో చర్యలు నిల్
గుడివాడ పురపాలక సంఘంలో మ్యూటేషన్ దోపిడీ ఇంకా కొనసాగుతోంది. కొందరు అవినీతి అధికారులు మామూళ్లు ఇస్తే చాలు ఎవరి ఇంటి పన్ను పేరునైన మార్చేస్తున్నారు. దీంతో కోట్లాది రూపాయల ఆస్తులు అక్రమంగా రిజిసే్ట్రషన్‌లు జరిగిపోతున్నాయి. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో బయటపడిన రూ.60 లక్షల కుంభకోణంలో బాధ్యులైన వారిపై నేటికీ మున్సిపల్ ఉన్నతాధికారులు చర్యలు తీసుకోలేదు. దీన్ని ఆసరాగా చేసుకుని పలువురు అవినీతి అధికారులు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని విమర్శలు వస్తున్నాయి.
ఆంధ్రజ్యోతి - గుడివాడ:
మున్సిపాల్టీ పరిధిలో ఆస్తులు కొనుగోలు చేస్తే తప్పకుండా వారి పేర్ల మీద ఆస్తిపన్ను పేరును మార్చుకోవలసి ఉంది. దీని కోసం నిర్దిష్ట రుసుమును చెల్లించాలి. మున్సిపాల్టీ పరిధిలో మ్యూటేషన్ (ఆస్తి పేరు మార్పు) చేయాలంటే దరఖాస్తుదారుడు ప్రస్తుత ఆస్తి విలువలో ఒక శాతం మొత్తాన్ని ఖచ్చితంగా మున్సిపాల్టీకి చెల్లించాలి. దీనికి సంబంధిత వార్డు సచివాలయ ఆడ్మిన్, మున్సిపల్ రెవెన్యూ అధికారులు ఆమోదించి మున్సిపల్ కమిషనర్‌కు పంపాలి. చివరగా మున్సిపల్ కమిషనర్ లాగిన్ ద్వారా డిజిటల్ సంతకంతో మ్యూటేషన్(ఆస్తి పేరు మార్పు) జరుగుతుంది. ఇది పరిపాటిగా జరిగేదే. గత వైసీపీ హయాంలో భారీ స్థాయిలో ఎటువంటి మ్యూటేషన్ ఫీజులను చెల్లించకుండా ఆస్తి పేర్ల మార్పును విచ్చలవిడిగా చేశారని వినికిడి.
ఆస్తి పన్నుపేరు మార్చిందెవ్వరూ?
ఈ ఏడాది జూలై 14వ తేదీన మున్సిపల్ అసెస్మెంట్ నెంబర్లు 1068000993, 1068029649లకు ఉన్న యజమాని పేరు కాకుండా వేరే వ్యక్తి పేరున అక్రమంగా మార్చేశారు. సదరు అసెస్మెంట్‌ల తాలూకు 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఆస్తి పన్నును పాత యజమాని చెల్లించేశారు. ఇటీవల ఆస్తి పన్ను కట్టేందుకు వెళ్లిన పాత యజమాని షాక్ గురయ్యారు. తనకు తన అమ్మమ్మ రాసిన రిజిస్టర్డ్ వీలునామా ద్వారా సంక్రమించిన ఆస్తి తాలుకు అసెస్మెంట్ నెంబర్‌లు వేరే వ్యక్తి పేరున మార్చినట్లు గుర్తించారు. తనకు తెలియకుండా తన ఆస్తి వేరే వ్యక్తి పేరున ఎలా మారిందంటూ మున్సిపల్ అధికారులను నిలదీశారు. తమకేమి తెలియదని పేరు మార్పు తమ పరిధిలో జరగలేదంటూ అధికారులు ఎవరికి వారే తప్పించుకోసాగారు. డీఎంఏ కార్యాలయ పరిధిలో జరిగి ఉంటుందని మున్సిపల్ అధికారులు బుకాయించడం పలు అనుమానాలకు తావిస్తోంది.
పన్ను పేరు మార్పు రశీదుతో అక్రమ రిజిసే్ట్రషన్
గుడివాడ మున్సిపాల్టీ నుంచి ఆన్‌లైన్ ద్వారా జారీ అయిన రెండు ఆస్తి పన్ను రశీదుల ద్వారా రూ.1.50 కోట్ల ఆస్తికి ఎసరు పెట్టారు. ఆస్తి పన్ను రశీదును ప్రామాణికంగా, కేవలం నోటి మాట ద్వారా తన ఆస్తిగా చెప్పి అక్రమంగా రిజిసే్ట్రషన్ కూడా జరిగిపోయింది. డాక్యుమెంట్ రైటర్ మాయ చేసి అక్రమంగా రిజిసే్ట్రషన్ కూడా చేయించేశారు. అసలు ఆస్తి వారసులు సబ్ రిజిసా్ట్రర్ కార్యాలయానికి వెళ్లి ఆరా తీయగా అక్రమ రిజిసే్ట్రషన్ వ్యవహారం బయటపడింది.
తప్పించుకుంటున్న అధికారులు
గుడివాడ సబ్ రిజిసా్ట్రర్ తమ కార్యాలయ పరిధిలో అక్రమ రిజిసే్ట్రషన్ జరిగిదంటూ వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన తప్పులేదంటూ తప్పించుకునే ప్రయత్నం చేశారు. వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి చేతులు దులుపుకున్నారు. ఆస్తి పన్ను రశీదుతోనే అక్రమ రిజిసే్ట్రషన్ జరిగిందని మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లారు. ఇంటి పన్ను పేరు అనధికారికంగా మారిందని గుర్తించామని, హడావిడిగా అక్టోబరు నెలలో పాత యజమాని పేరునే ఇంటి పన్ను కొనసాగిస్తున్నట్లు ఉత్తర్వులు ఇచ్చేశారు. ఇంటి పన్ను పేరు మార్పు వ్యవహారంలో కార్యాలయంలో అంతర్గత విచారణ చేపట్టలేదనే ఆరోపణలున్నాయి. అక్రమ రిజిసే్ట్రషన్ చేసుకున్న వ్యక్తిపై గానీ, సహకరించిన వారిపైన గానీ, ఇంటిపన్ను పేరు మార్చిన అధికారులపై గానీ చర్యలు తీసుకోలేదు. అసలు విచారణ ఒక్క అడుగు కూడా ముందుకు సాగలేదు. అనధికారికంగా ఇంటి పన్ను మార్చినట్లు గుడివాడ మున్సిపల్ కమిషనర్ సింహాద్రి మనోహర్ పేర్కొన్నారు. కానీ దీనికి కారకులెవ్వరనే విషయాన్ని బహిర్గతపరచడం లేదు. తమ కార్యాలయ పరిధిలో జరగలేదంటూ బుకాయిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇంటి పన్ను పేరు మార్పులు ఆయా మున్సిపాల్టీల పరిధిలోనే జరుగుతాయని, దీనికి డీఎంఏకు ఎటువంటి సంబంధం ఉండదని డీఎంఏ అధికారులు పేర్కొన్నారు.
డీఎంఏకు లేఖ రాశాం : కమిషనర్
అనధికారికంగా ఇంటి పన్ను పేరు మార్పు జరిగినట్లు గుర్తించామని, వెంటనే డీఎంఏ దృష్టికి తీసుకువెళ్లి పాత యాజమాని పేరునే ఇంటి పన్ను కొనసాగేలా ఉత్తర్వులు ఇవ్వడం జరిగిందని మున్సిపల్ కమిషనర్ సింహాద్రి మనోహర్ తెలిపారు. ఇక్కడ అనధికారిక పేరు మార్పు జరగలేదని, తప్పు ఎక్కడ జరిగిందో తేల్చాలంటూ రెండు పర్యాయాలు డీఎంఏకు లేఖ రాసినట్లు పేర్కొన్నారు. డీఎంఏ కార్యాలయం సీఆర్‌డీఏ కార్యాలయ పరిధిలోకి మారుస్తుండటంతో ఆలస్యమవుతుందని తెలిపారు.
చర్యలు తీసుకోవడంలో అలసత్వం!
గతంలో జరిగిన రూ.60 లక్షల మ్యూటేషన్ కుంభకోణంలో తాడిగడప మున్సిపల్ కమిషనర్‌ను విచారణ అఽధికారిగా నియమించగా, తూతూమంత్రంగా విచారణ చేపట్టి నివేదికను డీఎంఏ కార్యాలయానికి అప్పగించారు. కానీ నేటికి బాధ్యులపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో మరిన్ని అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపణలున్నాయి. తాడిగడప మున్సిపాల్టీ పరిధిలో కూడా భారీ స్థాయిలో మ్యూటేషన్ కుంభకోణం జరిగినట్లు తెలుస్తోంది. సదరు మున్సిపల్ కమిషనర్‌ను నాడు గుడివాడకు విచారణ అధికారిగా నియమించడం పట్ల ఆప్పట్లో పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఇప్పటికైనా మున్సిపల్ ఉన్నతాధికారులు పూర్తిస్థాయిలో విచారణ చేసి నిజనిజాలను బయట పెట్టాలని కోరుతున్నారు.