Heavy Rains: రాష్ట్రంలో వాతావరణ అనిశ్చితి
ABN , Publish Date - Nov 04 , 2025 | 05:15 AM
రాష్ట్రంలో అనిశ్చిత వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో మంగళవారం కోస్తా, రాయలసీమలోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు......
పెరిగిన ఉష్ణోగ్రతలు.. నేడు కోస్తా, సీమల్లో వర్షాలు
మయన్మార్‌లో స్థిరంగా అల్పపీడనం
అమరావతి, విశాఖపట్నం, నవంబరు 3(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో అనిశ్చిత వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో మంగళవారం కోస్తా, రాయలసీమలోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు పడతాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ముఖ్యంగా కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, అనంతపురం, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడా మోస్తరు వర్షాలు, మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని తెలిపింది. సోమవారం అనకాపల్లి జిల్లా గంధవరంలో 54, బుచ్చెయ్యపేటలో 29.75, రాజాంలో 28.5 మి.మీ.వర్షపాతం నమోదైంది.
పెరిగిన ఉష్ణోగ్రతలు
రాష్ట్రంలో ఈశాన్య రుతుపవనాలు బలహీనంగా ఉన్నాయి. సముద్రం నుంచి తేమగాలులు భూ ఉపరితలంపైకి రావడం లేదు. ఇంకా ఆకాశం నిర్మలంగా మారడంతో పగటిపూట ఎండతీవ్రత పెరిగి వేడి వాతావరణం నెలకొంది. సోమవారం పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే మూడు నుంచి ఐదు డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి. నెల్లూరులో 36.2 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.
అండమాన్‌లో అప్రమత్తం
తూర్పు మధ్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని మయన్మార్ తీరంలో అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. ఇది ఉత్తర వాయవ్యంగా పయనించి మంగళవారానికి మయన్మార్, బంగ్లాదేశ్ తీరాల వైపు వెళ్లనుందని విశాఖ వాతావరణ శాఖ తెలిపింది. ఈ క్రమంలో అల్పపీడనం బలపడుతుందని, దీంతో అండమాన్ దీవుల్లో సముద్రం అల్లకల్లోలంగా మారి భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. దీంతో అండమాన్‌లో అధికారులను అప్రమత్తం చేశామని పేర్కొన్నారు.