భద్రతలేని వ్యవసాయ మార్కెట్
ABN , Publish Date - Nov 15 , 2025 | 12:17 AM
ఎమ్మిగనూరు వ్యవసాయ మార్కెట్ వేరుశనగ విక్రయాలకు పెట్టింది పేరు.. జిల్లాలో ఉన్న ప్రధాన వ్యవసాయ మార్కెట్లతో పోటీ పడుతూ ప్రతి ఏడాది టార్గెట్‌ను మించి సెస్సు వసూలులో అగ్రస్థానంలో నిలుస్తోంది.
గతంలో చోరీలు.. తాజాగా అగ్నిప్రమాదం
ఆందోళన చెందుతున్న కమీషన ఏజెంట్లు, వ్యాపారులు
ఎమ్మిగనూరు, నవంబరు 14(ఆంధ్రజ్యోతి): ఎమ్మిగనూరు వ్యవసాయ మార్కెట్ వేరుశనగ విక్రయాలకు పెట్టింది పేరు.. జిల్లాలో ఉన్న ప్రధాన వ్యవసాయ మార్కెట్లతో పోటీ పడుతూ ప్రతి ఏడాది టార్గెట్‌ను మించి సెస్సు వసూలులో అగ్రస్థానంలో నిలుస్తోంది. ఈ మార్కెట్‌కు ఎమ్మిగనూరు, మంత్రాలయం, పత్తికొండ, కోడుమూరు నియోజకవర్గాలతో పాటు పక్క రాష్ర్టాలైన తెలంగాణ, కర్ణాటక ప్రాంతాల నుంచి పెద్దఎత్తున రైతులు వేరుశనగ, ఆముదాలు, మొక్కజొన్న తదితర పంట ఉత్పత్తులను అమ్మకానికి తీసుకొస్తారు. దీంతో ప్రతి ఏడాది కోట్లలో లావాదేవీలు జరుగుతాయి. ఇలాంటి వ్యవసాయ మార్కెట్‌లో గతంలో మార్కెట్‌లోని గోడౌన్లలో చోరీలు జరగగా.. ఇటీవల మార్కెట్ వెనుక భాగంలో ఉన్న గోడౌన్లలో ఖాళీసంచులు కాలి బూడిదయ్యాయి. సరుకుకు భద్రత కరువైందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఫ 80మంది కమీషన ఏజెంట్లు ః వ్యవసాయ మార్కెట్ కమిటీలో 80మంది కమీషన ఏజెంట్లు ఉండగా ఇందులో 60మంది దాకా పంట ఉత్పత్తులను క్రయవిక్రయాలు చేస్తున్నారు. మార్కెట్‌లో 84 గోడౌన్లు ఉండగా 15వరకు మరమ్మతులకు గురై నిరుపయోగంగా ఉన్నాయి. ప్రతినెల ఈ గోదాములనుంచి దాదాపు రూ. 1.60లక్షల ఆదాయం సమకూరుతోంది. అలాగే మార్కెట్ వెనుక భాగంలో 5000 మెట్రిక్ టన్నుల సరుకును నిలువచేసే భారీ గోదాము సైతం ఉంది. అలాగే కరోనా సమయం నుంచి మార్కెట్‌లో కూరకాయల హోల్‌సేల్ మార్కెట్ నడుస్తోంది. ఇందులో దాదాపు 30 మందికి పైగా చిన్న చితక వ్యాపారులు వ్యాపారాలు సాగిస్తున్నారు. వీరి నుంచి ఏడాదికి దాదాపు రూ. 30లక్షలకు పైగానే ఆదాయం సమకూరుతోంది.
ఫ రూ. 850 కోట్ల టర్నోవర్‌ః ఎమ్మిగనూరు వ్యవసాయ మార్కెట్‌లో గత ఏడాది దాదాపు రూ. 850కోట్ల పంట ఉత్పత్తుల క్రయ విక్రయాల టర్నోవర్ జరిగింది. దీంతో మార్కెట్‌కు దాదాపు రూ. 8.50కోట్ల సెస్సు వసూలైంది.
ఫ గతంలో చోరీలు.. తాజాగా అగ్ని ప్రమాదంః వ్యవసాయ మార్కెట్‌లో ఎంతో విలువైన పంట ఉత్పత్తులు తొమ్మిది నెలలపాటు క్రయవిక్రయాలు జరుగుతుంటాయి. రైతులతో పాటు వ్యాపారులు పంట ఉత్పత్తులను నిలువ చేస్తుంటారు. కమీషన ఏజెంట్లు సైతం సరుకుతో పాటు ఖాళీసంచులను గోదాముల్లో ఉంచుకుంటారు. ఇలాంటి మార్కెట్‌లో గత రెండేళ్ల క్రితం ముగ్గురు కమీషన ఏజంట్లకు చెందిన గోడౌన్లలో ఒకే రోజు చోరీలు జరిగాయి. గోడౌన్లలో నగదుతో పాటు వస్తువులను దుండగులు ఎత్తుకెళ్లారు. అలాగే ఏడాదిన్నర కిత్రం మూడు దుకాణాల్లో వేరుశనగ బస్తాలను గుర్తు తెలియని వ్యక్తులు మాయం చేశారు. గతం వారంలో ఓ దుకాణంలో వ్యాపారులు పెట్టిన ఆముదాల బస్తాలో దాదాపు 10కేజీల ఆముదాలను దుండగులు తస్కరించారు. ఇటీవల వెనుక ఉన్న గోడౌన్ల దగ్గర భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకొని ఖాళీ సంచుల వ్యాపారులు నిలువ చేసుకున్న రూ. 5లక్షల విలువ చేసే ఖాళీ సంచులు కాలిబూడిదయ్యాయి. మార్కెట్‌లో అగ్నిప్రమాదం చోటు చేసుకున్న విషయం మార్కెట్‌లో పనిచేస్తున్న సెక్యూరిటీ గార్డుల కన్నా ముందుగా సమీపంలో ఉన్న శిల్పాకాలనీ వాసులు గమనించి మార్కెట్ సిబ్బందిని అప్రమత్తం చేశారు. అప్పుడు సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. దీన్ని బట్టి చూస్తే మార్కెట్‌లో పనిచేస్తున్న సెక్యూరిటీ గార్డులు ఏమేరకు పహారా కాస్తున్నారో అర్థమవుతోంది. ఎంతసేపు మార్కెట్ గేట్ దగ్గర ఉంటున్నారే తప్ప మార్కెట్‌లో భద్రత గురించి పట్టించుకోవటం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతేగాక మార్కెట్‌లో భద్రతా చర్యల్లో భాగంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు గతకొన్ని రోజులుగా పనిచేయటం లేదు. దీనికి తోడు మార్కెట్‌లో కూరగాయల హోల్‌సేల్ వ్యాపారాలు జరుగుతుండటంతో.. మార్కెట్‌లోకి ఎవరు వస్తున్నదీ, ఎందుకు వస్తున్నదీ అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. దీని వల్లే మార్కెట్ భద్రత దెబ్బతింటోందని కమీషన ఏజెంట్లు, కొనుగోలుదారులు, రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా మార్కెట్ భద్రతపై కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు పేర్కొంటున్నారు.
ఫ 50 సీసీ కెమెరాలు, లైటింగ్ ఏర్పాటు చేస్తున్నాంః చంద్రమౌళి, మార్కెట్ ప్రత్యేక శ్రేణి కార్యదర్శి, ఎమ్మిగనూరు
మార్కెట్‌లో ఇటీవల జరిగిన అగ్నిప్రమాదంపై పోలీసులకు ఫిర్యాదు చేశాం. విచారణ చేసి చర్యలు తీసుకుంటారు. అలాగే మార్కెట్‌లో భద్రతా చర్యల్లో భాగంగా 50 సీసీ కెమాలు ఏర్పాటు చేసేందుకు టెండర్ పిలిచాం. అలాగే మార్కెట్ అంతటా లైటింగ్ ఏర్పాటు చేస్తాం. మూడు సెక్యూరిటీ గార్డులు ఖాళీగా ఉన్నయి. వాటిని కూడా భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం.