Share News

Unruly Activities on Tirumala: ఇదేం గోల గోవిందా!

ABN , Publish Date - Sep 14 , 2025 | 03:24 AM

పవిత్రభావనతో స్వామివారిని దర్శించుకునే భక్తులకు పట్టెడన్నం పెట్టి సేదతీర్చే తిరుమల కొండపై ఆకయితాల ఆగడాలు అదుపు తప్పాయి...

Unruly Activities on Tirumala: ఇదేం గోల గోవిందా!

  • కొండకు మద్యంబాబుల బెడద

  • ఉచిత భోజనం, వసతి దొరకడంతోకొన్నేళ్లుగా ఇక్కడే తిష్ట వేసిన వైనం

  • పగలు ఏవేవో పనులతో కాలక్షేపం

  • రాత్రయితే అరాచక,అపచార చేష్టలు

  • తింటూ, తాగుతూ రోడ్లపై వీరంగం

  • షెడ్లు, యాత్రికుల వసతి సముదాయాలు, షాపింగ్‌ కాంప్లెక్స్‌ వీరి అడ్డాలు

  • గోవిందనామ స్మరణ జరిగేచోట ఇవేం ఆగడాలంటూ నొచ్చుకుంటున్న భక్తులు

(తిరుమల-ఆంధ్రజ్యోతి): పవిత్రభావనతో స్వామివారిని దర్శించుకునే భక్తులకు పట్టెడన్నం పెట్టి సేదతీర్చే తిరుమల కొండపై ఆకయితాల ఆగడాలు అదుపు తప్పాయి. ఉచిత భోజనం, వసతి దొరుకుతుండటంతో చాలామంది కొండపైనే తిష్టవేశారు. వారు పగలు నామాలు పెట్టడం, దేవుని పటాలు, బొమ్మలు విక్రయిస్తూ గడుపుతున్నారు. అందరూ కాదుగానీ, వీరిలో కొందరు రాత్రి అయితే మద్యం తాగి కొండపై హల్‌చల్‌ చేస్తున్నారు. నిత్యం గోవింద నామస్మరణ జరిగే ప్రాంతం తిరుమల కొండ. అలాంటి చోట అక్కడ తరచూ ఘర్షణలు జరుగుతూ, మద్యం మత్తులో కొందరు కేకలు వేస్తూ రోడ్లమీద తిరుగుతుండటం, భక్తులను భయభ్రాంతులకు గురిచేస్తోంది. కొండ పవిత్రతకు అపచారం తెచ్చిపెట్టే ఘటనలు ఇటీవల పెరిగిపోయాయి. గత గురువారం రాత్రి మద్యం మత్తులో హేమకుమార్‌ అనే హాకరు మరో మహిళా హాకర్‌ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించి చీపురు కర్రతో దెబ్బలు తిన్నాడు. అంతేకాదు, గత ఐదారేళ్లలో కొందరు వ్యక్తులు మద్యం, మాంసం, గంజాయి విక్రయిస్తూ, పట్టుబడిన సందర్బాలున్నాయి. ఇలాంటి వ్యక్తులు క్షేత్ర పవిత్రత, ప్రశాంతతను దెబ్బతీస్తున్నారు. ‘ఇదేం గోల గోవిందా’ అంటూ భక్తులు వాపోయే పరిస్థితి వచ్చింది.

ఇబ్బందిపడుతున్న భక్తులు

తిరుమల కొండకు వస్తున్నవారిలో కొంతమంది అక్కడే ఏవో పనులు చూసుకుంటున్నారు. సొంతూర్లలో అప్పులైపోయినా, ఏదైనా గొడవలైనా భక్తుల్లో కలిసిపోయి జీవించడానికి తిరుమల అనువుగా మారిపోయింది. దీంతో తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా కర్ణాటక, తమిళనాడు నుంచీ చాలా మంది తిరుమల కొండెక్కేస్తున్నారు. ఎక్కినవారు తిరిగి దిగడం లేదు. హాకర్లుగా కొంతమంది, భవన కార్మికులుగా మరికొందరు కొండను అడ్డాగా మార్చుకున్నారు. వీరిలో కొంతమంది తరచూ ఆలయ నిబంధనలను భంగపరుస్తున్నారు. మాంసం తీసుకుంటూ, మద్యం తాగుతూ కొందరు హడావుడి చేస్తే, గంజాయి మత్తులో మరికొందరు వీరంగం సృష్టిస్తున్నారు. తిరుమలలోని షెడ్లు, యాత్రికుల వసతి సముదాయాలు, షాపింగ్‌ కాంప్లెక్స్‌ ప్రాంతంలోని తాత్కాలిక షెడ్లు వీరి అడ్డాలు.


అపచారం..

  • ఈ ఏడాది జనవరి 17వ తేదీన తమిళనాడులోని తిరువళ్లూరుకు చెందిన 28 మందితో కూడిన అన్యమత బృందం తిరుమలలోని రాంభగీచ వద్ద కోడిగుడ్ల కూర, పులావ్‌ తినడం విమర్శలకు దారి తీసింది.

  • మార్చి 13వ తేదీన కర్ణాటకకు చెందిన ఓ యువకుడు మద్యం తాగి మాడవీధుల్లోని అర్చకనిలయం సమీపంలో ఉన్న గ్యాలరీల్లో హల్‌చల్‌ చేశారు. ఓ మహిళతో అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు పోలీసులకు కూడా మద్యం విక్రయిస్తానంటూ వీరంగం సృష్టించాడు.

  • మార్చి 17వ తేదీ అర్ధరాత్రి ఇద్దరు అన్నదమ్ములు మద్యం తాగి దారిన వెళ్లే ముగ్గురు కూలీలపై దాడి చేశారు. రోడ్డుపై బిగ్గరగా కేకలు వేస్తూ వచ్చివెళ్లే వాహనాలను అడ్డుకున్నారు. విజిలెన్స్‌ సిబ్బందికి కూడా వారిని అదుపుచేయడం సాధ్యం కాలేదు. మొబైల్‌ వాహనం అద్దాలను పగలగొట్టగా, ఓ విజిలెన్స్‌ అధికారి గాయపడ్డారు.

  • 2024 నవంబరులో ఘాట్‌రోడ్లలో ఖాళీ మద్యం సీసాలు, గుట్కా ప్యాకెట్లు కనిపించడం కలకలం సృష్టించింది.

  • 2024 ఆగస్టు 17వ తేదీన ఇద్దరు హాకర్లు గాజుబాటిళ్లతో ఒకరిపై ఒకరు పట్టపగలు నడిరోడ్డుపై దాడి చేసుకున్నారు. రక్తగాయాలతో పెద్దగా కేకలు వేసిన వారిని చూసి భక్తులు భయబ్రాంతులకు గురయ్యారు.

  • 2023 ఫిబ్రవరిలో షాపింగ్‌ కాంప్లెక్స్‌ వద్ద ఓ వ్యక్తి మద్యం తాగుతూ, మాంసం తింటూ పట్టుబడ్డాడు.

Updated Date - Sep 14 , 2025 | 03:24 AM