Power Equipment Supply: పోటీకి టాటా
ABN , Publish Date - Sep 07 , 2025 | 05:01 AM
కాంట్రాక్టు ఏదైనా పదిమంది పోటీ పడితేనే ధరలు తగ్గుతాయి. అర్థంలేని నిబంధనలు పెట్టి.. షరతుల చట్రం బిగిస్తూ పోతే చివరికి ఒకటిరెండు కంపెనీలకు మాత్రమే అర్హత లభిస్తుంది. విద్యుత్ పరికరాల సరఫరాలో....
విద్యుత్ పరికరాల సరఫరాలో ఇంకా పాత పద్ధతే
జగన్ హయాంలో అర్థంలేని ‘అర్హత’ నిబంధనలు
100శాతం సొంతంగా తయారు చేయాలనే షరతు
స్థానిక కంపెనీలతోపాటు, జాతీయ సంస్థలకూ శరాఘాతం
అనేక రాష్ట్రాలకు ట్రాన్స్‌ఫార్మర్లు సరఫరా చేస్తున్న కంపెనీలు
సొంత రాష్ట్రంలో టెండర్లకు మాత్రం అనర్హులు
పోటీలేకపోవడంతో అధిక ధరలు.. జనంపైనే అంతిమ భారం
(అమరావతి - ఆంధ్రజ్యోతి)
కాంట్రాక్టు ఏదైనా పదిమంది పోటీ పడితేనే ధరలు తగ్గుతాయి. అర్థంలేని నిబంధనలు పెట్టి.. షరతుల చట్రం బిగిస్తూ పోతే చివరికి ఒకటిరెండు కంపెనీలకు మాత్రమే అర్హత లభిస్తుంది. విద్యుత్ పరికరాల సరఫరాలో ఇప్పుడు ఇదే జరుగుతోంది. పోటీతత్వానికి చోటు లేకుండా... గత ప్రభుత్వం అమలు చేసిన ‘నిబంధన రాజ్యమే’ ఇప్పటికీ నడుస్తోంది. దీంతో... ట్రాన్స్‌ఫార్మర్లు, కెపాసిటర్ల వంటి విద్యుత్ పరికరాల కొనుగోలు భారం పెరిగిపోతోంది. ఇదంతా చివరికి... ట్రూ అప్ చార్జీల రూపంలో వినియోగదారులపైనే పడుతోంది. విద్యుత్తు పరికరాల సరఫరా టెండరు ఖరారుకు జగన్ ప్రభుత్వం మార్కులు వేసే విధానాన్ని తెచ్చింది. ప్రభుత్వ విద్యుత్తు సంస్థలకు పరికరాలను మూడేళ్ల పాటు సరఫరా చేసిన అనుభవం ఉండాలని స్పష్టం చేసింది. అన్నింటికంటే దారుణమైన షరతు మరొకటి విధించింది. అది... ఆ సంస్థలు విద్యుత్ పరికరాలను వందశాతం తామే తయారు చేసి ఉండాలి. ఒక్కటంటే ఒక్క విడి పరికరమూ బయటి నుంచి కొనుగోలు చేయరాదు. ఈ షరతుతో అర్హుల జాబితా అమాంతం పడిపోయింది. పలుజాతీయ సంస్థలే కాదు... రాష్ట్రంలో ఉన్న విద్యుత్ పరికరాల తయారీ సంస్థలకూ టెండర్లలో పాల్గొనే వీలులేని పరిస్థితి. రాష్ట్రంలో కెపాసిటర్లు, ట్రాన్స్‌ఫార్మర్లు తయారు చేసే సంస్థలు ఐదారు ఉన్నాయి. తెలంగాణతోపాటు యూపీ, ఛత్తీస్‌గఢ్, కర్ణాటక తదితర రాష్ట్రాల్లో టెండర్లలో పాల్గొంటూ... విద్యుత్ పరికరాలను సరఫరా చేస్తున్నాయి. కానీ... జగన్ సర్కారు పెట్టిన అర్థంలేని ‘అర్హత’ నిబంధనల కారణంగా సొంత రాష్ట్రంలో టెండర్లలో పాల్గొనే అవకాశం లేకుండా పోతోంది. జాతీయ స్థాయిలో పేరుపొందిన తయారీదారులు కూడా ఏపీలో అడుగు పెట్టలేకపోతున్నాయి. కూటమి ప్రభుత్వమైనా ఈ పద్ధతి మార్చాలని చిన్న, మధ్యతరహా పరిశ్రమల ప్రతినిధులు కోరుతున్నారు.
డిపాజిట్ ‘గల్లంతు’
టెండర్ దక్కించుకున్న సంస్థ చెల్లించాల్సిన బ్యాంకు గ్యారెంటీ విధానంలోనూ జగన్ సర్కారు చేసిన మార్పులపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. పరికరాలను సరఫరా చేసే సంస్థలు ఐదేళ్లపాటు గ్యారంటీ ఇవ్వాల్సి ఉంటుంది. ఐదేళ్లలో పరికరాలు పనిచేయకపోతే వాటి స్థానంలో కొత్తవి బిగించాలి. అలా చేయకపోతే... విద్యుత్తు సంస్థలపై భారం పడుతుంది. ఇలా జరగకుండా ఉండేందుకు... సరఫరాదారుపై బాధ్యత పెంచేందుకు వారి నుంచి పది శాతం బ్యాంకు గ్యారెంటీలను వసూలు చేస్తారు. అంటే.. వంద కోట్ల రూపాయల పరికరాలు సరఫరా చేస్తే, పదికోట్లు బ్యాంకు గ్యారెంటీ ఇవ్వాలి. ఐదేళ్ల గ్యారెంటీ కాలం గడిచిన తర్వాత మాత్రమే ఆ మొత్తాన్ని తిరిగి చెల్లిస్తారు. ఇంత పెద్దమొత్తంలో బ్యాంకు గ్యారెంటీగా ఇచ్చినప్పుడు పరికరాల నాణ్యతపై సరఫరాదారు తప్పనిసరిగా దృష్టి సారిస్తారు. కానీ... జగన్ జమానాలో జరిగిన కొనుగోళ్లకు దీనిని పట్టించుకోలేదు. విద్యుత్తు పరికరాల సరఫరాదారులు ఎన్ని వేల కోట్ల రూపాయల విలువజేసే పరికరాలు సరఫరా చేసినా.. కేవలం రూ.20 కోట్లు బ్యాంకు గ్యారెంటీగా ఇస్తే సరిపోతుందంటూ నాటి ప్రభుత్వం ఉత్తర్వు జారీ చేసింది. ‘వేలకోట్లు వచ్చేశాయి. 20 కోట్లు పోతే పోయాయి’ అని సరఫరాదారు తెగిస్తే చేసేదేమీ ఉండదు. ఈ నేపథ్యంలో... బ్యాంకు గ్యారెంటీ విషయంలోనూ కూటమి ప్రభుత్వం నిక్కచ్చిగా వ్యవహరించాల్సిన అవసరముందని విద్యుత్ రంగ నిపుణులు సూచిస్తున్నారు.