Share News

Weather Forecast: వాతావరణ గందరగోళం

ABN , Publish Date - Aug 09 , 2025 | 03:41 AM

రాష్ట్రంలో వర్షాలపై భారత వాతావరణ శాఖ ముందస్తుగా ప్రకటిస్తున్న అంచనాలు తప్పుతున్నాయి. లేదా కొంతమేర మాత్రమే వాస్తవికతకు దగ్గరగా ఉంటున్నాయి తప్ప బులెటిన్లలో పేర్కొన్నట్టుగా వర్షాలు కురవడం లేదు.

Weather Forecast: వాతావరణ గందరగోళం

  • వర్షాలపై చెప్పేదొకటి.. జరిగేది మరొకటి

  • తప్పుతున్న వాతావరణ శాఖ అంచనాలు

  • వాతావరణంలో అనూహ్య మార్పులే కారణం!

  • రాష్ట్రంలో వింత పరిస్థితి..ప్రజల్లో అయోమయం

ఆగస్టు 4న రాయలసీమలో అనేకచోట్ల, కోస్తాలో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని, ఆ 2 ప్రాంతాల్లో ఒకటి, రెండు చోట్ల భారీవర్షాలు పడతాయని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. తీరాచూస్తే.. రాయలసీమ, కోస్తాల్లో తక్కువ చోట్ల మాత్రమే వర్షాలు కురిశాయి.

ఆగస్టు 5న కోస్తా, రాయలసీమల్లో అనేకచోట్ల వర్షాలు కురుస్తాయని, సీమలో భారీ నుంచి అతిభారీ, ఉత్తర కోస్తాలో అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. కోస్తాలో 10-20 చోట్ల మాత్రమే వర్షాలు కురిశాయి.

(విశాఖపట్నం ఆంధ్రజ్యోతి)

రాష్ట్రంలో వర్షాలపై భారత వాతావరణ శాఖ ముందస్తుగా ప్రకటిస్తున్న అంచనాలు తప్పుతున్నాయి. లేదా కొంతమేర మాత్రమే వాస్తవికతకు దగ్గరగా ఉంటున్నాయి తప్ప బులెటిన్లలో పేర్కొన్నట్టుగా వర్షాలు కురవడం లేదు. ఈ ఏడాది జూన్‌, జూలై నెలల్లో రాష్ట్రంలో అనేక చోట్ల సాధారణం అంత కంటే ఎక్కువగా, కొన్ని జిల్లాల్లో మాత్రమే తక్కువగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తన అంచనాల్లో పేర్కొంది. అయితే అందుకు భిన్నమైన పరిస్థితి నెలకొంది. ఈ రెండు నెలల్లో 25 శాతం తక్కువ వర్షపాతం నమోదు కావడంతో.. ఖరీఫ్‌ పంటలకు బాగా నష్టం జరిగింది. దేశవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నా రాష్ట్రానికి వచ్చేసరికి పరిస్థితి మరోలా ఉంది. దీంతో వర్షాలు కురుస్తాయని ఇస్తున్న ముందస్తు అంచనాలపై రైతుల్లో అయోమయం నెలకొంటోంది. వర్షం పడుతుందని వాతావరణ శాఖ పేర్కొంటుంది.. కానీ మాడు పగిలే ఎండ కాస్తోంది. వేసవి మాదిరి వేడి వాతావరణం కొనసాగుతుంది. వాతావరణ శాఖ బులెటిన్‌ మేరకు గడిచిన వారం తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురిశాయి. అదే ఏపీకి వచ్చేసరికి బులెటిన్లకు భిన్నంగా తక్కువ వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణంలో చెప్పింది తూచా తప్పకుండా జరుగుతుందని నిక్కచ్చిగా చెప్పలేమని, వాతావరణంలో అనూహ్యమైన మార్పుల ప్రభావంతో చెప్పిన దానికి భిన్నంగా జరుగుతుందని నిపుణులు అంటున్నారు.


స్థానిక పరిస్థితులను పరిగణనలోకి..

దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు భారత వాతావరణ శాఖ రోజువారీ బులెటిన్లు రూపొందిస్తుంది. ఢిల్లీలోని ప్రధాన కార్యాలయం ఇచ్చిన వివరాలకు స్థానికంగా నెలకొన్న పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని అధికారులు రాష్ట్రాల వారీగా బులెటిన్లను తయారు చేస్తారు. ఏపీకి వచ్చేసరికి అమరావతిలో వాతావరణ కేంద్రం, విశాఖలో తుఫాన్‌ హెచ్చరిక కేంద్రం పనిచేస్తున్నాయి. రోజువారీ వాతావరణం వివరాలను అమరావతి కేంద్రం ఇస్తుండగా.. తుఫాన్‌లు, వాయుగుండాల సమయంలో తుఫాన్‌ హెచ్చరిక కేంద్రం బులెటిన్లు జారీచేస్తోంది. ఈ రెండు కార్యాలయాలు కలిసి పని చేస్తుంటాయి. అయితే చెప్పిన దానికి, వాస్తవంగా వర్షాలు కురిసిన దానికి మధ్య తేడా మాత్రం ఉంటోంది.


ఆధునిక సాంకేతికత ఉన్నా..

వర్షం పడుతుందని చెబితే ఎండ కాస్తుంది, ఎండ ఉంటుందంటే వర్షం కురుస్తుందని అప్పట్లో జోకులు వేసుకునేవారు. అదే నిజమని ఈ మధ్య తేలిపోయిందని రైతులు అంటున్నారు. వాస్తవానికి వాతావరణ శాఖలో ఆధునిక సాంకేతికతతో కూడిన రాడార్లు, ఉపగ్రహ ఛాయాచిత్రాల ఆధారంగా వర్షాలు, ఎండలు, గాలులు వంటి వాటిపై అంచనాలు తయారు చేస్తుంటారు. భారత వాతావరణ శాఖలో పనిచేసిన వారంతా ఎంతో అనుభవం ఉన్న నిపుణులే. అయినా నమ్మకం కలిగించడంలో విజయం సాధించడం లేదనే వాదన వినిపిస్తోంది. భారత వాతావరణ శాఖ ఇచ్చే బులెటిన్లలో 100 శాతం కచ్చితత్వం ఉంటుందని చెప్పలేమని రిటైర్డు వాతావరణ అధికారి కృష్ణభగవానుడు వ్యాఖ్యానించారు. కొన్నిసార్లు చెప్పింది జరుగుతుందని, ఒక్కొక్కసారి అంచనాలు తప్పుతాయన్నారు.


  • దక్షిణ కోస్తాపై ఉపరితల ఆవర్తనం

  • నేడు, రేపు భారీ వర్షసూచన.. 13న అల్పపీడనం

అమరావతి, విశాఖపట్నం, ఆగస్టు 8(ఆంధ్రజ్యోతి): దక్షిణ కోస్తా నుంచి ఉత్తర శ్రీలంక వరకు తమిళనాడు తీరం మీదుగా ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో శుక్రవారం కోస్తా, రాయలసీమల్లో ఎక్కువచోట్ల వర్షాలు కురిశాయి. ఒకటి, రెండుచోట్ల భారీవర్షాలు కురిశాయి. కొన్నిచోట్ల ఎండ తీవ్రత కొనసాగింది. రానున్న 24 గంటల్లో దక్షిణ కోస్తా, రాయలసీమల్లో అనేకచోట్ల, ఉత్తర కోస్తాలో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా భారీవర్షాలు కురుస్తాయని వెల్లడించింది. శనివారం ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్ని చోట్ల పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు, మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల సంస్థ తెలిపింది. ఆదివారం ఏలూరు, ఎన్టీఆర్‌, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు, మిగతా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని పేర్కొంది. ఇంకా ఈనెల 13న ఉత్తరకోస్తాకు సమీపంలో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనున్నదని, దాని ప్రభావంతో 13, 14 తేదీల్లో కోస్తాలో వర్షాలు పెరుగుతాయనివాతావరణశాఖ అంచనా వేసింది.

Updated Date - Aug 09 , 2025 | 03:42 AM