Share News

Liquor Identification Number: ప్రతి సీసాకూ ఓ నంబర్‌

ABN , Publish Date - Dec 23 , 2025 | 04:18 AM

నకిలీ మద్యం కట్టడికి ప్రభుత్వం వినూత్న విధానాన్ని ప్రవేశపెట్టనుంది. దేశంలోనే మొట్టమొదటి సారిగా మద్యం సీసాలకు ప్రత్యేక గుర్తింపు నెంబరు (లిక్కర్‌ ఐడెంటిఫికేషన్‌ నంబర్‌- లిన్‌) తీసుకురానుంది.

Liquor Identification Number: ప్రతి సీసాకూ ఓ నంబర్‌

  • బ్రాండ్‌, బ్యాచ్‌, తయారీ తేదీతో కూడిన 18 అంకెల గుర్తింపు సంఖ్య

  • నకిలీ మద్యం కట్టడికి వినూత్న విధానం

  • ఎక్సైజ్‌ శాఖ ప్రతిపాదనకు సీఎం ఓకే

  • బెల్టు షాపుల నియంత్రణకు హరియాణా మోడల్‌

  • ఎక్సైజ్‌ సమీక్షలో సూచనలు

అమరావతి, డిసెంబరు 22(ఆంధ్రజ్యోతి): నకిలీ మద్యం కట్టడికి ప్రభుత్వం వినూత్న విధానాన్ని ప్రవేశపెట్టనుంది. దేశంలోనే మొట్టమొదటి సారిగా మద్యం సీసాలకు ప్రత్యేక గుర్తింపు నెంబరు (లిక్కర్‌ ఐడెంటిఫికేషన్‌ నంబర్‌- లిన్‌) తీసుకురానుంది. ప్రస్తుతం ఒక్కో బ్యాచ్‌కు ఒక క్యూఆర్‌ కోడ్‌ విధానం అమల్లో ఉంది. ఒక బ్యాచ్‌ అంటే రెండు లక్షల సీసాల వరకు ఉత్పత్తి అవుతాయి. కొత్త విధానంలో ప్రతి సీసాకు ఒక ప్రత్యేక నంబరు ఇస్తారు. పైగా దీన్ని మొబైల్‌లో స్కాన్‌ చేసి చూడాల్సిన అవసరం లేదు. అందరికీ అర్థమయ్యేలా సీసాలపైనే ఆ నెంబరు కనిపిస్తుంది. ఆ నంబరుతో మరో సీసా కనిపిస్తే.. దాన్ని నకిలీ మద్యంగా గుర్తిస్తారు. బ్రాండ్‌, బ్యాచ్‌, తయారీ తేదీ, మిల్లీసెకన్ల సహా ఉత్పత్తి సమయంతో కలిపి మొత్తం 18 అంకెల సంఖ్య ఉంటుంది. ‘లిన్‌’పై ఎక్సైజ్‌ శాఖ చేసిన ప్రతిపాదనకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆమోదం తెలిపారు. సోమవారం సచివాలయంలో ఎక్సైజ్‌ శాఖపై జరిగిన సమీక్షలో సీఎం దీనిపై మాట్లాడారు. నకిలీ మద్యం నియంత్రణకు ‘లిన్‌’ను వీలైనంత త్వరగా తీసుకురావాలని ఆదేశించారు. ఇది సాధారణ ప్రజలు కూడా సులభంగా గుర్తించేలా ఉండాలన్నారు. అలాగే మద్యం షాపుల రేషనలైజేషన్‌పై దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు. ‘మద్యం విధానాన్ని వ్యాపారంలా చూడకుండా, ఆరోగ్యకరమైన వృద్ధి సాధించేలా చూడాలి. ఆదాయమే లక్ష్యంగా పాలసీలు ఉండకూడదు’ అని అన్నారు.


పెరిగిన మద్యం విక్రయాలు

2024 అక్టోబరు నుంచి ఈ ఏడాది అక్టోబరు వరకు రూ.8 వేల కోట్ల ఎక్సైజ్‌ ఆదాయం లక్ష్యంగా పెట్టుకోగా రూ.7,041 కోట్లు వచ్చిందని అధికారులు సీఎంకు వివరించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో మద్యం విక్రయాలు 4.52 శాతం పెరిగాయని తెలిపారు. డిసెంబరు నుంచి మార్చి నాటికి మద్యం ద్వారా వచ్చే మొత్తం రూ.8,422 కోట్లు ఉండొచ్చని అంచనా వేశామన్నారు. మొత్తంగా ఆర్థిక సంవత్సరంలో 3 శాతం వృద్ధి నమోదవుతుందన్నారు. తెలంగాణ కన్నా ఏపీలో తలసరి మద్యం వినియోగం తక్కువగా ఉందని.. తెలంగాణలో 4.74 లీటర్లు కాగా, ఏపీలో అది 2.77 లీటర్లు ఉందని వివరించారు. మద్యం అమ్మకాల్లో డిజిటల్‌ చెల్లింపులు 34.9 శాతం పెరిగాయన్నారు. కొన్ని జిల్లాల్లో 40 నుంచి 47 శాతం డిజిటల్‌ చెల్లింపులు నమోదయ్యాయన్నారు. డిజిటల్‌ చెల్లింపులు పెరిగేలా వినియోగదారుల్లో అవగాహన పెంచాలని సీఎం సూచించారు.

సబ్‌ లీజు విధానంపై అధ్యయనం చేయండి

బెల్టుషాపులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులకు స్పష్టం చేశారు. బెల్టుల కట్టడికి హరియాణా రాష్ట్రం తరహా సబ్‌ లీజు విధానంపై అధ్యయనం చేయాలని సూచించారు. ప్రస్తుతం కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో మద్యం షాపులు లేకపోవడం వల్ల బెల్టు సమస్య పెరిగిందని అధికారులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. అలాగే పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఖాళీ మద్యం సీసాలను తిరిగి ఇస్తే.. నగదు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నామని అధికారులు తెలిపారు. సమీక్షలో మంత్రులు కొల్లు రవీంద్ర, కొండపల్లి శ్రీనివాస్‌, ఉన్నతాధికారులు పీమూష్‌ కుమార్‌, సీహెచ్‌ శ్రీధర్‌, రాహుల్‌దేవ్‌ శర్మ పాల్గొన్నారు.

Updated Date - Dec 23 , 2025 | 04:18 AM