Share News

ఎఫ్‌ఎస్‌ఎల్‌కు ‘అద్విక’ కంప్యూటర్లు

ABN , Publish Date - Jun 30 , 2025 | 01:21 AM

అధిక వడ్డీల చెల్లింపును ఎరగా వేసి కోట్లాది రూపాయలు వసూలు చేసిన అద్విక ట్రేడింగ్‌ ప్రైవేటు లిమిటెడ్‌ కార్యాలయంలో ఉన్న కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లను ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపడానికి అధికారులు రంగం సిద్ధం చేశారు.

ఎఫ్‌ఎస్‌ఎల్‌కు ‘అద్విక’ కంప్యూటర్లు

హైదరాబాద్‌లో రెండు కార్యాలయాలు

విజయవాడ కార్యాలయంలో కొనసాగుతున్న విచారణ

ఏజెంట్లను పిలిపించి వివరాలు సేకరిస్తున్న పోలీసులు

(ఆంధ్రజ్యోతి - విజయవాడ):

అధిక వడ్డీల చెల్లింపును ఎరగా వేసి కోట్లాది రూపాయలు వసూలు చేసిన అద్విక ట్రేడింగ్‌ ప్రైవేటు లిమిటెడ్‌ కార్యాలయంలో ఉన్న కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లను ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపడానికి అధికారులు రంగం సిద్ధం చేశారు. విజయవాడ ఎన్టీఆర్‌ కాలనీలో ఉన్న కార్యాలయంలో ఉన్న కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లను పోలీసులు సీజ్‌ చేశారు. కంపెనీ ఎండీ తాడేపల్లి శ్రీవెంకట ఆదిత్య ఇక్కడే కాకుండా హైదరాబాద్‌లో రెండు చోట్ల కార్యాలయాలు నడుపుతున్నట్టు నిర్ధారించారు. ఈ రెండు కార్యాలయాల బాధ్యతలను ఇద్దరు తమ్ముళ్లకు అప్పగించినట్టు తెలిసింది. ఇప్పటికే ఒక బృందం హైదరాబాద్‌లో ఉండగా, తాజాగా మరో బృందం విజయవాడ నుంచి ఆదివారం బయలుదేరి వెళ్లింది. ఆ రెండు కార్యాలయాల్లో ఉన్న కంప్యూటర్లను సీజ్‌ చేసి ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపాలని నిర్ణయించారు. ఇప్పటికే కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌ల్లో ఉన్న వివరాలను మొత్తం ఆదిత్య తీసేశాడు. ఇదిప్పుడు పోలీసులకు పెద్ద సవాలుగా మారింది. ఎలాంటి వివరాలు లేకుండా లెక్కలు తేల్చడం వారికి కష్టంగా మారింది.

కార్యాలయంలో సుదీర్ఘ విచారణ

ఆదిత్యను పోలీసులు ఎన్టీఆర్‌ కాలనీలో ఉన్న అద్విక కార్యాలయంలో ఆదివారం సుదీర్ఘంగా విచారించారు. సెంట్రల్‌ జోన్‌ ఏసీపీ కె.దామోదరరావు, టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్లు, మాచవరం ఎస్‌ఐలు ఉదయం నుంచి రాత్రి వరకు విచారించారు. ఆదిత్య పోన్‌ను సీజ్‌ చేసిన పోలీసులు అందులో వాట్సాప్‌ చాటింగ్‌ను కాంటాక్ట్‌ నంబర్ల వారీగా పరిశీలిస్తున్నారు. దీని ద్వారా అద్వికలోకి భారీగా పెట్టుబడులను రప్పించిన పది మంది ఏజెంట్లను గుర్తించారు. వాళ్లందరిని అద్విక కార్యాలయానికి పిలిపించారు. ఒక్కొక్కరి వాంగ్మూలం తీసుకున్నారు. ఎవరెవరి నుంచి ఎంతెంత సొమ్ములను ఇందులో పెట్టుబడిగా పెట్టించారో రాబట్టారు. కొంతమంది ఏజెంట్లు కమీషన్ల రూపంలో ఆదిత్య నుంచి భారీగానే లాగేసినట్టు పోలీసులు గుర్తించారు. హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి ఏజెంట్‌గా వ్యవహరిస్తూ రూ.25కోట్లు పెట్టుబడులుగా పెట్టించాడు.

బయటకు వస్తున్న బినామీ బాగోతం

ఆదిత్య అంటే లక్షలు కాదు... కోట్లు. అతడితో ఏ డీల్‌ అయినా కోట్లలోనే ఉంటుంది. ఓ ఏజెంట్‌ పోలీసుల వద్ద చేసిన వ్యాఖ్య ఇది. పోలీస్‌స్టేషన్‌కు వస్తున్న బాధితులతో మాట్లాడినప్పుడు కొత్తకొత్త విషయాలు బయట పడుతున్నారు. అద్వికలో పెట్టుబడులు పెట్టిన వారిలో విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌ విభాగానికి చెందిన అధికారులు, సిబ్బంది పేర్లు బయటపడుతున్నాయి. వాళ్లంతా స్నేహితులు, పరిచయస్తుల పేర్ల మీద ఈ పెట్టుబడులు పెట్టించారని ప్రచారం జరుగుతోంది. దర్యాప్తు చేస్తున్న పోలీసులకు ఈ విభాగం నుంచే ఎక్కువగా ఫోన్లు వస్తున్నాయి. అసలు ఆదిత్యపై కేసు నమోదు చేశారా, ఖాతాలు ఏమైనా స్తంభింపచేశారా, ఆ ఖాతాల్లో ఎంత మొత్తం నగదు నిల్వలు ఉన్నాయి అన్న వివరాలను చాలా శ్రద్ధగా అడిగి తెలుసుకుంటున్నారు. కొంతమంది కోసం రాజకీయ నేతలు ఫోన్లు చేస్తున్నారు.

Updated Date - Jun 30 , 2025 | 01:21 AM