Share News

‘అద్విక’ ఆదిత్య అరెస్టు

ABN , Publish Date - Oct 29 , 2025 | 01:16 AM

పెట్టుబడిగా లక్ష రూపాయలు పెడితే నెలకు రూ. 6 వేలు వడ్డీగా చెల్లిస్తానని చెప్పి ప్రజల నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేసి బోర్డు తిప్పేసిన అద్విక ట్రేడింగ్‌ ప్రైవేటు లిమిటెడ్‌ కంపెనీ ఎండీ తాడేపల్లి శ్రీవెంకట ఆదిత్యను విజయవాడ పోలీసులు అరెస్టు చేశారు. అతడితోపాటు భార్య సుజాత, మరో ఇద్దరు ఏజెంట్లు విజయవాడ లబ్బీపేటకు చెందిన గాదంశెట్టి బాలకృష్ణమూర్తి, ఆయన సతీమణి నాగలక్ష్మీదేవికి సంకెళ్లు వేశారు. వివరాలను పోలీసు కమిషనర్‌ ఎస్వీ రాజశేఖరబాబు, డీసీపీలు కేజీవీ సరిత, తిరుమలేశ్వరరెడ్డి, ఏడీసీపీ ఎం.రాజారావు, ఏసీపీలు లతాకుమారి, కె.దామోదరరావు, ఇన్‌స్పెక్టర్లు ప్రకాష్‌, సుబ్రహ్మణ్యంతో కలిసి కమిషనర్‌ కార్యాలయంలోని సమావేశపు హాలులో మంగళవారం వెల్లడించారు.

‘అద్విక’ ఆదిత్య అరెస్టు

పెట్టుబడులుగా రూ.413.03 కోట్లు వసూలు

మొత్తం పెట్టుబడుదారులు 1,417

రూ.144 కోట్లకు టోకరా

వివరాలు వెల్లడించిన సీపీ రాజశేఖరబాబు

పెట్టుబడిగా లక్ష రూపాయలు పెడితే నెలకు రూ. 6 వేలు వడ్డీగా చెల్లిస్తానని చెప్పి ప్రజల నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేసి బోర్డు తిప్పేసిన అద్విక ట్రేడింగ్‌ ప్రైవేటు లిమిటెడ్‌ కంపెనీ ఎండీ తాడేపల్లి శ్రీవెంకట ఆదిత్యను విజయవాడ పోలీసులు అరెస్టు చేశారు. అతడితోపాటు భార్య సుజాత, మరో ఇద్దరు ఏజెంట్లు విజయవాడ లబ్బీపేటకు చెందిన గాదంశెట్టి బాలకృష్ణమూర్తి, ఆయన సతీమణి నాగలక్ష్మీదేవికి సంకెళ్లు వేశారు. వివరాలను పోలీసు కమిషనర్‌ ఎస్వీ రాజశేఖరబాబు, డీసీపీలు కేజీవీ సరిత, తిరుమలేశ్వరరెడ్డి, ఏడీసీపీ ఎం.రాజారావు, ఏసీపీలు లతాకుమారి, కె.దామోదరరావు, ఇన్‌స్పెక్టర్లు ప్రకాష్‌, సుబ్రహ్మణ్యంతో కలిసి కమిషనర్‌ కార్యాలయంలోని సమావేశపు హాలులో మంగళవారం వెల్లడించారు.

విజయవాడ, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి):

ఎక్కువ వడ్డీ చెల్లిస్తామని ప్రజలకు ఆశలు పుట్టించి ఆదిత్య రూ.413.03 కోట్లను పెట్టుబడులుగా వసూలు చేశాడు. ఏజెంట్లు, ఖాతాదారులు వెరసి 1,417 మంది ఇందులో పెట్టుబడులు పెట్టారు. 2022లో ఆదిత్య, అతని భార్య సుజాత విజయవాడలో అద్విక ట్రేడింగ్‌ ప్రైవేటు లిమిటెడ్‌ కంపెనీ ఏర్పాటు చేశారు. వారు తొలుత రూ.15 లక్షల పెట్టుబడితో దుబాయిలోని కబానా అకౌంట్‌ ద్వారా ఫారెక్స్‌ ట్రేడింగ్‌ ప్రారంభించారు. అద్విక ప్రారంభించిన కొత్తలో లాభాలు పెద్దగా రాకపోవడంతో ఆదిత్య, సుజాత కలిసి పెట్టుబడులను ఆకర్షించడానికి ప్రణాళిక రూపొందించారు. సుజాతకు ప్రైవేటు బ్యాంకులో రికవరీ మేనేజర్‌గా ఉద్యోగం చేసిన అనుభవం ఉండడంతో తమ సంస్థలో పెట్టుబడి పెట్టిన వారికి నెలకు ఆరు శాతం, ఏజెంట్లకు మూడు నుంచి నాలుగు శాతం వడ్డీ చెల్లిస్తామని ప్రకటించారు. ఈవిధంగా ప్రజల నుంచి పెట్టుబడులను స్వీకరించారు. ఇలా కొత్త ఖాతాదారులు ఇచ్చిన డబ్బులతో పాత ఖాతాదారులకు చెల్లింపులు చేశాడు. 2023లో సృష్టించుకున్న వార్షికోత్సవం పేరుతో ఒక ఈవెంట్‌ను నిర్వహించి మరిన్ని డిపాజిట్లు సేకరించారు. కొంతమంది లాభాలకు ఆశపడి అద్వికకు ఏజెంట్లుగా మారి ఆదిత్యకు సహకరించారు. కొంత డబ్బును ఆదిత్య మల్టీ బ్యాంక్‌ గ్రూపునకు బదిలీ చేశాడు. ఈ డబ్బులను తన వ్యక్తిగత ప్రయోజనాలకు ఉపయోగించుకున్నాడు. ప్రజల నుంచి సేకరించిన పెట్టుబడులతో ఆదిత్య రెండు తెలుగు రాషా్ట్రల్లో స్థిర, చరాస్తులను సమకూర్చుకున్నాడు. కొన్ని ఆస్తులను ఆదిత్య తన పేరున, మరికొన్ని ఆస్తులను భార్య సుజాత పేరున రిజిసే్ట్రషన్‌ చేయించాడు. 2022 నుంచి ఈ ఏడాది జూన్‌ వరకు ఆదిత్య 1,417 మంది నుంచి రూ.413.03 కోట్లను డిపాజిట్లుగా సేకరించాడు. అందులో కొంత భాగాన్ని దుబాయిలో ఉన్న కబానా ట్రేడింగ్‌, మల్టీ బ్యాంకింగ్‌ ఫారెక్స్‌ వంటి విదేశీ ట్రేడింగ్‌ కంపెనీలకు బదిలీ చేశాడు.

ఇదీ లెక్క..

అద్వికలో మొత్తం 1,139 మంది ఖాతాదారులు రూ.255 కోట్లు పెట్టుబడిగా పెట్టారు. అందులో నుంచి రూ.120 కోట్లు వెనక్కి తీసుకున్నారు. వారు ఇంకా రూ.135 కోట్లు నష్టపోయారు. 204 మంది డిపాజిటర్లు రూ.35 కోట్లను పెట్టుబడిగా పెట్టి రూ.56 కోట్లు వెనక్కి తీసుకున్నారు. పెట్టుబడి కంటే రూ.21 కోట్లను అదనంగా తీసుకున్నారు. దీన్ని లాభంగా పరిగణించారు. 12 మంది ఖాతాదారులు రూ.1.8 కోట్లు పెట్టుబడిగా పెట్టారు. ఈ మొత్తాన్ని వెనక్కి తీసుకున్నారు. వాళ్లంతా లాభపడలేదు. అలాగని నష్టపోలేదు. 30 మంది ఏజెంట్లు రూ.54 కోట్లును పెట్టుబడులుగా పెట్టించి రూ.45 కోట్లను అద్విక నుంచి వెనక్కి తీసుకున్నారు. వాళ్లంతా రూ.9 కోట్ల వరకు నష్టపోయారు. 32 మంది ఏజెంట్లు రూ.54 కోట్లను పెట్టుబడిగా పెట్టి రూ.105 కోట్లను వెనక్కి తీసుకున్నారు. రూ.49 కోట్లను లాభాలుగా పొందారు. దుబాయిలో ఉన్న కబానా, మల్టీ బ్యాంకింగ్‌ ఫారెక్స్‌లో రూ.13.5 కోట్లను పెట్టుబడి పెట్టి రూ.27.5 కోట్లను వెనక్కి తీసున్నాడు. తద్వారా రూ.14 కోట్లు లాభాలను పొందాడు. కార్యాలయ ఖర్చులకు రూ.8 కోట్లు, వ్యక్తిగత ఖర్చులుగా రూ.12.5 కోట్లు ఖర్చు చేశాడు. మరో రూ.39.5 కోట్లను ఆదిత్య తన వద్ద భద్రపరుచుకున్నాడు. 92 మంది ఖాతాదారులు రూ.9.47 కోట్లను పెట్టుబడి పెట్టారు. వారు అసలు గానీ, లాభాలు గానీ పొందలేదు. పెట్టుబడుల ద్వారా ఆదిత్య 52 ఆస్తులను కొనుగోలు చేశాడు. వాటి మార్కెట్‌ విలువ రూ.100 కోట్లు ఉంటుందని పోలీసు కమిషనర్‌ తెలిపారు. ఆదిత్య, అతని భార్య సుజాత నుంచి 580 గ్రాముల బంగారం, 8.03 కిలోల వెండిని, రూ.23 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. అద్విక పేరుతో ఉన్న 17 బ్యాంకు ఖాతాల్లో రూ.32 లక్షలు, కబానా, మల్టీబ్యాంక్‌కు చెందిన 69 ఖాతాల్లో రూ.50 లక్షలు, మూడు ట్రేడింగ్‌ ఖాతాల్లో రూ.53 లక్షలు, 200 ఏజెంట్ల ఖాతాల్లో రూ.1.02 కోట్లు ఉన్నట్టు గుర్తించారు. వాటిని పోలీసులు స్తంభింపజేశారు. మరో రూ.39.50 కోట్లు లెక్కలు తేలాల్సి ఉంది. టాటా సఫారి కారు, ల్యాప్‌ టాప్‌లు, కంప్యూటర్లు స్వాధీనం చేసుకున్నారు.

నిందితులకు రిమాండ్‌

అద్విక ట్రేడింగ్‌ ప్రైవేటు లిమిటెడ్‌ కంపెనీ ఎండీ తాడేపల్లి శ్రీవెంకట ఆదిత్యతోపాటు మరో ముగ్గురికి న్యాయస్థానం రిమాండ్‌ విధించింది. ఆదిత్య, ఆయన భార్య సుజాత, ఏజెంట్లు గాదంశెట్టి బాలమురళీకృష్ణ, ఆయన సతీమణి నాగలక్ష్మీదేవిని పోలీసులు అరెస్టు చేసి మంగళవారం రాత్రి విజయవాడ మొదటి అదనపు చీఫ్‌ జ్యుడీషియల్‌ మేజిస్ర్టేట్‌ కోర్టులో హాజరుపరిచారు. వారికి కోర్టు వచ్చే నెల పదో తేదీ వరకు రిమాండ్‌ విధించింది. అనంతరం నిందితులను విజయవాడ జిల్లా జైలుకు తరలించారు.

Updated Date - Oct 29 , 2025 | 01:16 AM