Emergency Services: అంతర్జాతీయ స్థాయిలో ఆపద సేవలు
ABN , Publish Date - Sep 07 , 2025 | 03:24 AM
ఆపదలో ఉన్న మహిళ అర్ధరాత్రి 112కు ఫోన్ చెయ్యగానే పోలీసులు క్షణాల్లో స్పందిస్తున్నారు. సైబర్ నేరగాళ్లు కొట్టేసిన సొమ్ము గురించి 1930కు సమాచారమిచ్చిన గంటలోపే రికవరీ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు.
అత్యవసర సర్వీసులు ఒకే గొడుగు కిందకు
100, 112, 1930, 1972లకు ఒకే కమాండ్ కంట్రోల్
టెక్ టవర్ కేంద్రంగా.. ఎస్పీ స్థాయి అధికారి పర్యవేక్షణ
24 గంటల పాటు 152 మంది సిబ్బందితో నిర్వహణ
యూఈఆర్‌సీసీ పేరుతో త్వరలో అందుబాటులోకి
ప్రజల సంతృప్తికే ప్రాధాన్యం: డీజీపీ హరీశ్‌కుమార్
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
ఆపదలో ఉన్న మహిళ అర్ధరాత్రి 112కు ఫోన్ చెయ్యగానే పోలీసులు క్షణాల్లో స్పందిస్తున్నారు. సైబర్ నేరగాళ్లు కొట్టేసిన సొమ్ము గురించి 1930కు సమాచారమిచ్చిన గంటలోపే రికవరీ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. వరదలు, ప్రమాదాల్లో చిక్కుకున్న బాధితులను సకాలంలో రక్షిస్తున్నారు. అత్యవసర సేవలకు సంబంధించి ‘టోల్ ఫ్రీ’ నెంబర్లకు ఫోన్ చెయ్యగానే సంబంధిత పోలీసులు అప్రమత్తం అవుతున్నారు. ఇక, నుంచి మరింత పకడ్బందీగా ఈ అత్యవసర సేవలు ప్రజలకు చేరువ కానున్నాయి. మారుతున్న కాలానికి అనుగుణంగా, ఎప్పటికప్పుడు ఎదురవుతున్న సవాళ్లను మరింత సమర్థవంతంగా పరిష్కరించేందుకు పోలీసులు సర్వసన్నద్ధమవుతున్నారు. ఈ క్రమంలో రాష్ట్ర పోలీసు శాఖ వ్యూహంతోపాటు సాంకేతికతను కూడా వినియోగించుకుని అత్యవసర సేవలను మరింత వేగంగా అందించేందుకు అడుగులు వేస్తోంది. హిందూపురం నుంచి ఇచ్చాపురం వరకు రాష్ట్రంలో ఏ మూల ఎవరికి ఇబ్బంది వచ్చినా తక్షణమే స్పందించి ఉపశమనం కల్పించేందుకు అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో మంగళగిరిలోని టెక్ టవర్‌లో ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయనుంది. పోలీసు టోల్ ఫ్రీ నెంబర్లన్నీ ఒకే చోటకు తీసుకొచ్చి ఎస్పీ స్థాయి అధికారి పర్యవేక్షణలో డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలు రేయింబవళ్లు సేవలందించేలా ఏర్పాట్లు చేస్తోంది. విజయవాడ, విశాఖపట్నం పోలీసు కమీషనరేట్లతో పాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాల పోలీసులతో సమన్వయం చేసుకోవడంతో పాటు కేంద్ర హోంశాఖ పరిధిలోని ‘టోల్ ఫ్రీ’ నెంబర్ల సేవల్ని సైతం సమన్వయం చేసుకోనుంది. ‘యూనిఫైడ్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ అండ్ కమాండ్ సెంటర్’(యూఈఆర్‌సీసీ) పేరుతో మంగళగిరిలోని రాష్ట్ర పోలీస్ హెడ్‌క్వార్టర్స్ ప్రాంగణంలోని టెక్‌టవర్ లో ఈ ప్రత్యేక విభాగం సిద్ధమవుతోంది.
16 రకాల సేవలు
రాష్ట్రంలో పోలీసు అత్యవసర సేవలకు సంబంధించిన ‘డయల్ 100’కు ప్రతి రోజూ సరాసరి 15 వేల ఫోన్ కాల్స్ వస్తున్నాయి. సైబర్ నేరాలకు సంబంధించి 1930 ద్వారా ప్రతి రోజూ 2,300 కాల్స్, మహిళల రక్షణకు 112తో పాటు ‘శక్తి’ యాప్ ద్వారా 120 కాల్స్, గంజాయి, మత్తు పదార్థాల విక్రయాలు, వినియోగానికి సంబంధించి 10 కాల్స్ 1972 నెంబర్‌కు వస్తున్నాయి. కేంద్ర హోంశాఖ నిర్వహించే వాటితో కలిపి ఏపీ పోలీసు శాఖలో వివిధ సేవలకు సంబంధించి మొత్తం 16 రకాల టోల్ ఫ్రీ నెంబర్లున్నాయి. అయితే వాటిలో కొన్ని ఏపీ పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో.. మరికొన్ని టెక్ టవర్‌లో.. ఇంకొన్ని విశాఖపట్నం, తిరుపతి తదితర ప్రాంతాల్లో ఉన్నాయి. ఒక్కొక్కటి ఒక్కోచోట ఉండటంతో పర్యవేక్షణ, సేవల్లో నాణ్యత సంతృప్తి కరంగా ఉండడం లేదని డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా ఇటీవల ఉన్నతస్థాయి సమీక్షలో నిర్ధారణకు వచ్చారు.
స్మార్ట్ పోలీసింగ్ దిశగా: డీజీపీ
‘‘పోలీసింగ్ అంటే శాంతి భద్రతల పరిరక్షణ ఒక్కటే కాదు. ఆపదలో ఉన్న వారికి అత్యంత వేగంగా సేవలందించడం కూడా.’’ అని డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా వ్యాఖ్యానించారు. ఇప్పటి కే పోలీసు శాఖ ద్వారా పలు సేవలు అందుతు న్నా ప్రజలకు 100శాతం సంతృప్తికరమైన సేవ లు అందడం లేదన్నారు. అందుకే సేవలన్నింటినీ ఒకే చోటకు చేర్చి అంతర్జాతీయ ప్రమాణాలతో సిబ్బందికి శిక్షణ ఇచ్చినట్టు తెలిపారు. ప్రజలకు సేవలందించేందుకు యూఈఆర్‌సీసీ తీసుకొస్తున్నామని పేర్కొన్నారు. టెక్ టవర్‌లోని మూడో అంతస్తులో అంతా సిద్ధం చేస్తున్నామ ని, సీ-డాక్ నుంచి అనుమతి రాగానే ప్రారంభిస్తామని చెప్పారు. దీంతో ఏపీ పోలీసు శాఖ దేశంలో ఒక మార్గదర్శి కాబోతోందన్నారు.
ఇక.. ఏకీకృతం!
అత్యవసర సేవల టోల్ ఫ్రీ నెంబర్లకు పలుమార్లు ప్రజలు ఫోన్ చేసినా సరైన స్పందన రావట్లేదనే విమర్శలు ఉన్నాయి. దీనికి ప్రధాన కారణం.. పర్యవేక్షణ లోపంతో పాటు వేర్వేరు నెంబర్లు, వేర్వేరు చోట్ల ఉండటంతో సమన్వయ లోపం, గందరగోళం కూడా. ఈ విషయాన్ని గుర్తించిన డీజీపీ అన్నింటినీ ఒకే చోటకు చేర్చి ఎస్పీ స్థాయి అధికారి పర్యవేక్షణలో సేవలు మెరుగు పరిచేందుకు నడుం బిగించారు. శ్రీకాకుళం నుంచి విజయవాడ వరకు ఒక డివిజన్. గుంటూరు నుంచి నెల్లూరు దాకా మరో డివిజన్. రాయల సీమ జిల్లాలు మూడో డివిజన్‌గా ఏర్పాటు చేసి ముగ్గురు డీఎస్పీల పర్యవేక్షణలో సీఐలు, ఎస్‌ఐలు, పోలీసు, సాంకేతిక సిబ్బందితో అంతర్జాతీయ స్థాయి కాల్ సెంటర్ నిర్వహించేందుకు సిద్ధమయ్యా రు. మొత్తం 152 మందితో ఏర్పాటైన ఈ బృందంలో 28 మంది అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తూ సేవల్లో అంతరాయం కలగకుండా చూస్తారు.