Former CM kiran Kumar: ఏపీ ఉమ్మడిగా ఉంటేనే బాగుండేది..
ABN , Publish Date - Oct 16 , 2025 | 06:11 AM
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉమ్మడిగా ఉంటేనే బాగుండేదని.. తాను ఇప్పటికీ అదే కోరుకుంటున్నానని ఉమ్మడి ఏపీ చివరి ముఖ్యమంత్రి, ప్రస్తుత బీజేపీ నేత ఎన్ కిరణ్ కుమార్‌రెడ్డి అన్నారు.
కలిసున్నప్పుడు దేశంలోనే రెండో స్థానంలో ఆంధ్రప్రదేశ్
విభజన తర్వాత తెలుగు రాష్ట్రాల స్థానమేంటో చూడండి
పోలవరం ప్రాజెక్టును త్వరగా పూర్తిచేయాలి
ఉమ్మడి ఏపీ చివరి సీఎం కిరణ్ కుమార్‌రెడ్డి
రాజమహేంద్రవరం, అక్టోబరు 15(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉమ్మడిగా ఉంటేనే బాగుండేదని.. తాను ఇప్పటికీ అదే కోరుకుంటున్నానని ఉమ్మడి ఏపీ చివరి ముఖ్యమంత్రి, ప్రస్తుత బీజేపీ నేత ఎన్ కిరణ్ కుమార్‌రెడ్డి అన్నారు. తెలుగు రాష్ట్రాలు ఉమ్మడిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ దేశంలోనే రెండో స్థానంలో ఉండేదని, కానీ.. విభజన తర్వాత ఈ రెండు రాష్ట్రాలు ఏ స్థానాల్లో ఉన్నాయో చూడాలని వ్యాఖ్యానించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని బీజేపీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘కలసి ఉంటే కలదు సుఖం. అందుకే తెలుగు రాష్ట్రాలు ఉమ్మడిగానే ఉండాలని కోరుకున్నాను. అలా ఉంటేనే బాగుండేది. ఇప్పటికీ నేను అదే మాటపై ఉన్నాను’ అని అన్నారు. పోలవరం ప్రాజెక్టును యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ ప్రాజెక్టు కోసం తన హయాంలోనే టెండర్లు పిలిచానని గుర్తుచేశారు. కృష్ణా జలాలపై 1976 బచావత్ ట్రైబ్యునల్ ప్రకారం 811 టీఎంసీల నీటిని ఉమ్మడి ఏపీ వాడుకోవచ్చని చెప్పారు. కానీ, ట్రైబ్యునల్ ఆర్డర్‌ను పునఃపరిశీలన చేయాలని తెలంగాణ అడుగుతోందని, దీనిపై మన ప్రభుత్వం కూడా స్పందించాలని అన్నారు.