Gotti Pati Ravi Kumar: అమరావతిలో భూగర్భ కేబుల్ వ్యవస్థ
ABN , Publish Date - Sep 25 , 2025 | 07:09 AM
అమరావతిలో విద్యుత్తు ప్రమాదాలకు తావులేకుండా అధునాతన భూగర్భ కేబుల్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు.
విద్యుత్ ప్రమాదాలకు తావులేకుండా చర్యలు: గొట్టిపాటి
అమరావతి/తుళ్లూరు, సెప్టెంబరు 24(ఆంధ్రజ్యోతి): అమరావతిలో విద్యుత్తు ప్రమాదాలకు తావులేకుండా అధునాతన భూగర్భ కేబుల్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. 2.50 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో సీఆర్డీయే భవనాన్ని ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తోందని చెప్పారు. రాయపూడిలో సీఆర్డీయే ప్రధాన కార్యాలయ భవన నిర్మాణ పనులను మంత్రి బుధవారం పరిశీలించారు. ఇక్కడ ఏర్పాటు చేస్తున్న వివిధ చాంబర్లను అధికారులు మంత్రికి వివరించారు. అక్టోబరు 2న సీఎం చంద్రబాబు చేతుల మీదుగా భవనం ప్రారంభోత్సవం జరుగుతుండటంతో ఆ సమయానికి విద్యుత్తు పనులు పూర్తి కావాలని మంత్రి ఆదేశించారు. సీఆర్డీయేతో విద్యుత్తు శాఖ సమన్వయం చేసుకుని పనులు వేగవంతం చేయాలన్నారు.
ప్రతిపక్ష హోదా ప్రజలు ఇవ్వాలి.. కోర్టులు కాదు!
జగన్‌కు ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సింది ప్రజలే కానీ న్యాయస్థానం కాదని గొట్టిపాటి చెప్పారు. ఎంతమంది ఎమ్మెల్యేలు ఉంటే ప్రతిపక్ష హోదా వస్తుందనే విషయం తెలియకుండా జగన్ సీఎం ఎలా అయ్యారో అంటూ ఎద్దేవా చేశారు. జగన్ జైలు నుంచి బెయిల్‌పై బయటకు వచ్చి 12 ఏళ్లు పూర్తయినందున పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తున్నారేమోనని వ్యాఖ్యానించారు. జగన్ విధ్వంసంతో అమరావతి పనులు ఐదేళ్లు ఆలస్యమయ్యాయన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో సోలార్ ప్యానెల్స్, విండ్ టర్బైన్ల తయారీ కూడా చేపడుతున్నామని చెప్పారు. ఏటేటా పెరుగుతున్న విద్యుత్ వినియోగానికి అనుగుణంగా సబ్ ేస్టషన్ల నిర్మాణం చేపడుతున్నామని తెలిపారు.