Share News

Visakhapatnam: ఈఐపీఎల్‌లో ఆరని మంటలు

ABN , Publish Date - Sep 09 , 2025 | 05:44 AM

ఈస్ట్‌ ఇండియా పెట్రోలియం లిమిటెడ్‌(ఈఐపీఎల్‌) కంపెనీలో మంటలు పూర్తిగా అదుపులోకి రాలేదు. ఆదివారం మధ్యాహ్నం మిథనాల్‌ ఆయిల్‌(పెట్రోలియం ఫిల్టరింగ్‌) ట్యాంకుపై పిడుగు పడటంతో మంటలు చెలరేగిన విషయం తెలిసిందే.

Visakhapatnam: ఈఐపీఎల్‌లో ఆరని మంటలు

  • సీ కింగ్‌ హెలికాప్టర్‌తో రంగంలోకి నేవీ

  • ఫోమ్‌, నీటిని వెదజల్లుతూ మంటలార్పే యత్నం

విశాఖపట్నం, సెప్టెంబరు 8 (ఆంధ్రజ్యోతి): ఈస్ట్‌ ఇండియా పెట్రోలియం లిమిటెడ్‌(ఈఐపీఎల్‌) కంపెనీలో మంటలు పూర్తిగా అదుపులోకి రాలేదు. ఆదివారం మధ్యాహ్నం మిథనాల్‌ ఆయిల్‌(పెట్రోలియం ఫిల్టరింగ్‌) ట్యాంకుపై పిడుగు పడటంతో మంటలు చెలరేగిన విషయం తెలిసిందే. ఆ ట్యాంక్‌ నుంచి సోమవారం రాత్రి వరకు మంటలు వస్తూనే ఉన్నాయి. తూర్పు నౌకాదళం అధికారులు ఐఎన్‌ఎస్‌ డేగా నుంచి సీ కింగ్‌ హెలికాప్టర్‌ను తీసుకువచ్చి, దాని ద్వారా ఫోమ్‌, నీటిని ట్యాంకుపై వెదజల్లి మంటలను అదుపులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మంగళవారం ఉదయానికి మంటలు పూర్తిగా తగ్గిపోయే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈఐపీఎల్‌ కంపెనీ మిథనాల్‌ను ట్యాంకుల్లో నిల్వ చేస్తోంది. ప్రమాదానికి గురైన ట్యాంకు సామర్థ్యం 7,225 లీటర్లు. ప్రమాదం జరిగే సమయానికి అందులో 6,500 లీటర్ల మిథనాల్‌ ఉంది. దీనికి మండే గుణం అధికం. గాలి సోకినప్పుడు ఏ చిన్న ఇగ్నిషన్‌ (వేడి) తగిలినా వెంటనే అంటుకుంటుంది. మిథనాల్‌ నిల్వ చేసే ట్యాంకులు ప్రత్యేకంగా ఉంటాయి. ట్యాంకుపై పిడుగు పడినప్పుడు పైకప్పు విరిగి పక్కకు జారిపోవడంతోపాటు లోపల ఉన్న ఫ్లోటింగ్‌ రూఫ్‌కు ఒక అంగుళం మేర రంధ్రం ఏర్పడి మంట లోపలికి చేరింది. తద్వారా మిథనాల్‌ అంటుకుంది. మిగిలిన ఫ్లోటింగ్‌ రూఫ్‌ అంతా బాగానే ఉంది. ట్యాంకులోకి ఎంత నీరు పోసినా, ఫోమ్‌ వెదజల్లినా ఆ అంగుళం రంధ్రం నుంచే లోపలకు వెళ్లి మంటలను తగ్గిస్తున్నాయి.


మరోవైపు ట్యాంక్‌కు ఉన్న వేరే వాల్వ్‌ ద్వారా సుమారు 2 వేల కిలోలీటర్ల మిథనాల్‌ను వేరే ట్యాంక్‌లోకి పంపించగలిగారు. సుమారు 4 వేల నుంచి 4,500 లీటర్ల మిథనాల్‌ గత 30 గంటల్లో మండిపోయింది. కాగా, పిడుగుల వల్ల ప్రమాదం జరగకుండా ఇక్కడ 40 మీటర్ల ఎత్తున లైట్నింగ్‌ ప్రొటెక్టర్‌ ఉందని, అది పనిచేసి ఉంటే ఈ ప్రమాదం జరిగేది కాదని, అది బహుశా పనిచేయడం లేదేమోనని ఒక అధికారి అనుమానం వ్యక్తంచేశారు. ట్యాంక్‌ పైకప్పుపై మిథనాల్‌ వేపర్‌ (ఆవిరి) అక్కడక్కడ ఉండడం వల్లే పిడుగు పడినప్పుడు మంటలంటుకున్నాయని ప్రాథమిక పరిశీలనలో తేలినట్టు విశాఖపట్నం డీసీఎఫ్‌ సురేశ్‌ తెలిపారు. 2024 ఆగస్టు 21న అచ్యుతాపురంలోని ఎసెన్షియా ఫార్మా కంపెనీలో రియాక్టర్‌ పేలి 17 మంది చనిపోయిన ఘటన తర్వాత ఫ్యాక్టరీస్‌ అధికారులు విశాఖ జిల్లాలోని అన్ని కంపెనీల్లో సేఫ్టీ ఆడిట్‌ చేయించారు. ఈఐపీఎల్‌లోనూ అప్పుడే సేఫ్టీ ఆడిట్‌ చేయించారు. మళ్లీ ఇప్పుడు చేయించాల్సి ఉండగా, ఈలోపే ప్రమాదం జరిగింది.

Updated Date - Sep 09 , 2025 | 05:46 AM