Share News

Godavari-Cauvery Water Allocation: గోదావరి లెక్కల్లో స్పష్టతేదీ

ABN , Publish Date - Aug 23 , 2025 | 04:17 AM

గోదావరి జలాల గణాంకాలపై స్పష్టత లేకుండానే.. గోదావరి-కావేరి అనుసంధాన ప్రక్రియను చేపట్టేందుకు సిద్ధం కావడంపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఆక్షేపించింది.

Godavari-Cauvery Water Allocation: గోదావరి లెక్కల్లో స్పష్టతేదీ

  • మిగులు జలాలు తేల్చకుండా కావేరి వరకు అనుసంధానమెలా?

  • ఛత్తీస్‌గఢ్‌147 టీఎంసీలనూ వాడుకుంటే ఈ పథకానికి నీళ్లెక్కడ?

  • గంగా జలాలు ఎప్పుడొస్తాయి?.. ఎన్‌డబ్ల్యూడీఏను నిలదీసిన ఏపీ

  • గోదావరి నీటిని వయా తెలంగాణ పంపుతామంటే అంగీకరించం

  • పోలవరం-బనకచర్ల ద్వారా కావేరితో సంధానాన్ని పరిశీలించండి

  • చింతలపూడి, ఉత్తరాంధ్ర, గోదావరి-పెన్నార్‌ను ఫేజ్‌-1లో చేర్చండి

  • రాష్ట్రం సూచనలు.. ఇచ్చంపల్లి నుంచి కాకుండా సమ్మక్క-సారలమ్మ

  • నుంచి తరలించాలి: తెలంగాణ.. త్వరలో మళ్లీ భేటీ: ఎన్‌డబ్ల్యూడీఏ

అమరావతి, ఆగస్టు 22 (ఆంధ్రజ్యోతి): గోదావరి జలాల గణాంకాలపై స్పష్టత లేకుండానే.. గోదావరి-కావేరి అనుసంధాన ప్రక్రియను చేపట్టేందుకు సిద్ధం కావడంపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఆక్షేపించింది. ఛత్తీస్‌గఢ్‌కు కేటాయించిన 147 టీఎంసీలనూ వాడుకుంటామని వెల్లడించినందున.. గోదావరి మిగులు జలాలపై స్పష్టత రావలసి ఉందని తెలిపింది. తెలంగాణ నుంచి నాగార్జున సాగర్‌, సోమశిల గుండా గోదావరి జలాలను కావేరికి తరలిస్తామంటే అంగీకరించేది లేదని స్పష్టం చేసింది. జాతీయ నదుల అనుసంధాన ప్రక్రియలో భాగంగా గోదావరి-కావేరి నదులను కలిపే పథకానికి పోలవరం-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టును వినియోగించుకునే అంశాన్ని పరిశీలించాలని సూచించింది. శుక్రవారం హైదరాబాద్‌ జలసౌధలో కేంద్ర జల అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యూడీఏ) డైరెక్టర్‌ దేవేంద్రరావు, గోదారి నదీ యాజమాన్య బోర్డు చైర్మన్‌ బన్షుమణి ప్రసాద్‌ పాండే ఆధ్వర్యంలో గోదావరి-కావేరి అనుసంధాన పథకంపై సమావేశం జరిగింది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌, తమిళనాడు, పుదుచ్చేరి జల వనరుల శాఖ అధికారులు పాల్గొన్నారు. రాష్ట్రం నుంచి సలహాదారు ఎం.వెంకటేశ్వరరావు, ఈఎన్‌సీ నరసింహమూర్తి, అంతర్రాష్ట్ర నదీ జలాల విభాగం చీఫ్‌ ఇంజనీర్‌ సుగుణాకరరావు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే నిర్మించిన నాగార్జునసాగర్‌, సోమశిల ప్రాజెక్టులను వినియోగించుకుంటూ గోదావరి-కావేరి అనుసంధాన పథకాన్ని ఎలా అమలు చేస్తారని రాష్ట్ర అధికారులు ఈ సందర్భంగా ప్రశ్నించారు. ఈ రెండు ప్రాజెక్టులనూ గోదావరి-కావేరి అనుసంధానానికి వాడితే.. నీటి లెక్కల్లో గందరగోళం నెలకొంటుందని తెలిపారు. గోదావరి నీటి కేటాయింపులపై రోజుకో లెక్క చెబుతున్నారని అసంతృప్తి వ్యక్తంచేశారు.


గోదావరి మిగులు జలాల్లో లెక్కలు తేల్చకుండా నదుల అనుసంధాన ప్రక్రియను చేపడతామంటే ఎలాగని ఎన్‌డబ్ల్యూడీఏను అడిగారు. ఇచ్చంపల్లి వద్ద గోదావరి మిగులు జలాలు లేనందున.. తెలంగాణ నుంచి కాకుండా ఆంధ్రప్రదేశ్‌లోని అంతర్రాష్ట్ర నదీ అనుసంధాన పథకాలను వినియోగించుకోవాలని.. అప్పుడు దుర్భిక్ష ప్రాంతాలకు సాగు, తాగునీటిని అందించేందుకు వీలు కలుగుతుందని పేర్కొంది. గతంలో ప్రతిపాదించిన ధవళేశ్వరం-కావేరి అనుసంధానం పథకాన్ని అమలు చేస్తే.. జాతీయ నదుల అనుసంధాన ప్రక్రియను విజయవంతంగా అమలు చేసేందుకు వీలు కలుగుతుందని రాష్ట్రప్రభుత్వం అభిప్రాయపడింది. పోలవరం-బనకచర్ల ప్రాజెక్టును వినియోగించుకోవాలని సూచించింది. చింతలపూడి ఎత్తిపోతల, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, గోదావరి (పోలవరం)-పెన్నా లింకు ప్రాజెక్టును కూడా గోదావరి-కావేరి అనుసంధానం ఫేజ్‌-1లో అంతర్భాగం చేయాలని ప్రతిపాదించింది.


ఇంకా ఏ రాష్ట్రం ఏం కోరిందంటే..

  • గోదావరి-కావేరి అనుసంధాన పథకాన్ని ఇచ్చంపల్లి నుంచి కాకుండా ఎగువన 25 కిలోమీటర్ల దూరంలోని సమక్క-సారలక్క ప్రాజెక్టు నుంచి గోదావరి జలాలను మళ్లించేలా పథకాన్ని మార్పు చేయాలని తెలంగాణ సూచించింది. ఈ పథకాన్ని అమలు చేస్తున్నందుకు ఛత్తీస్‌గఢ్‌కు కేటాయించిన 127 టీఎంసీల్లో సగం తమకు కేటాయించాలని డిమాండ్‌ చేసింది. గోదావరి-కావేరి అనుసంధాన పథకాన్ని సమక్క సారలక్క ప్రాజెక్టు నుంచి అమలు చేస్తే రెండు తెలుగు రాష్ట్రాల్లో చెరో 300 కిలోమీటర్ల మేర గోదావరి జలాలు ప్రవహిస్తాయని పేర్కొంది. దీనివల్ల రెండు రాష్ట్రాలకూ ప్రయోజనమేనని తెలిపింది.

  • తమకు కేటాయించిన 147 టీఎంసీలను త్వరలోనే సద్వినియోగం చేసుకుంటామని.. ఇందుకు అవసరమైన ప్రాజెక్టులను నిర్మించేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నామని ఛత్తీస్‌గఢ్‌ వెల్లడించింది. ఆ 147 టీఎంసీలను తాను వాడుకోనందునే.. ఆ నీటిని గోదావరి-కావేరి అనుసంధాన పథకానికి వినియోగిస్తామనడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. ఎన్‌డబ్ల్యూడీఏ జోక్యం చేసుకుని.. హిమాలయన్‌ వ్యాలీ నుంచి గంగా జలాలను దిగువకు తరలిస్తున్నందున భవిష్యత్‌లో నీటి కొరత రాబోదంటూ బుజ్జగించే ప్రయత్నం చేసింది. కానీ ఆ రాష్ట్రం అంగీకరించలేదు. తమ రాష్ట్రానికి కేటాయించిన 147 టీఎంసీలను కచ్చితంగా తామే వాడుకుంటామని తెగేసి చెప్పింది. సమావేశంలో పాల్గొన్న తమిళనాడు మాత్రం గోదావరి-కావేరి అనుసంధాన ప్రక్రియకు ఆమోదం తెలిపింది. పుదుచ్చేరి తమకు అదనంగా 12.5 టీఎంసీల గోదావరి జలాలను కేటాయించాలని కోరింది. రాష్ట్రాలు వెలిబుచ్చిన అభిప్రాయాలను తీసుకున్న ఎన్‌డబ్ల్యూడీఏ.. త్వరలోనే కీలక భేటీ ఉంటుందని వెల్లడించింది.


గంగా జలాలు ఎప్పుడొస్తాయ్‌?

గంగా జలాలు ఎప్పుడు వస్తాయో చెప్పకుండా గోదావరి-కావేరి అనుసంధాన పథకం అమలు చేస్తామంటే ఎలాగని ఎన్‌డబ్ల్యూడీఏను సలహాదారు ఎం.వెంకటేశ్వరరావు ప్రశ్నించారు. అకస్మాత్తుగా ఛత్తీస్‌గఢ్‌ తన వాటా 147 టీఎంసీలను వాడేసుకుంటామంటే.. దిగువ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌కు తీవ్ర అన్యాయం జరుగుతుందని, నీటి కొరత ఏర్పడితే ఎంతో నష్టం వాటిల్లుతుందని చెప్పారు. ఆయన ప్రశ్నలకు ఎన్‌డబ్ల్యూడీఏ డైరెక్టర్‌, జీఆర్‌ఎంబీ చైర్మన్‌ సమాధానం ఇవ్వలేకపోయారు.

Updated Date - Aug 23 , 2025 | 04:19 AM