Election Commission: స్థానికానికి చిక్కులు
ABN , Publish Date - Sep 05 , 2025 | 04:57 AM
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు శంఖారావం మోగిందోలేదో, అంతలోనే చిక్కులు మొదలయ్యాయి. ఎన్నికలకు ముందే బీసీ కులగణన పూర్తిచేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రభుత్వాన్ని కోరడంతో....
బీసీ కులగణన జరిపాకే ఎన్నికలు
షెడ్యూల్ ప్రకారం జనవరి నాటికి నిక సంస్థలకు ఎన్నికలు జరగాలి
అప్పటికి కులగణన ప్రక్రియ పూర్తయ్యేనా?
స్థానికంలో 34ు రిజర్వేషన్ అమలుకు టమి ఇచ్చిన హామీ కూడా అప్పుడే సాధ్యం!
(అమరావతి- ఆంధ్రజ్యోతి)
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు శంఖారావం మోగిందోలేదో, అంతలోనే చిక్కులు మొదలయ్యాయి. ఎన్నికలకు ముందే బీసీ కులగణన పూర్తిచేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రభుత్వాన్ని కోరడంతో, షెడ్యూల్ లోపు మునిసిపాలిటీ ఎన్నికలు నిర్వహించడం సాధ్యమేనా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. స్థానిక సంస్థల్లో 34శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించి కూటమి పార్టీలు అధికారంలోకి వచ్చాయి. అదే మాట మీద చంద్రబాబు ప్రభుత్వం నిలబడింది. అయితే, ఈదిశగా చేపట్టాల్సిన తదుపరి కార్యక్రమాలు ఇంకా ప్రారంభం కాలేదు. మరో వైపు వచ్చే మార్చిలోగా పదవీకాలం ముగిసే మున్సిపాలిటీ స్థానిక సంస్థలకు 3నెలల ముందే ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధం కావాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రభుత్వానికి బుధవారం లేఖరాసింది. దీనికి సంబంధించిన ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని కోరింది. ఇదే లేఖలో బీసీ కులగణన ప్రస్తావన తెచ్చింది. ఈ పరిస్థితుల్లో.. గడువులోగా బీసీ కులగణన పూర్తి చేసి, షెడ్యూల్ ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికలు జరపడం ఎంతవరకు సాధ్యమనే ప్రశ్న ప్రభుత్వ వర్గాల్లోనే వ్యక్తం అవుతోంది. బీసీ కులగణన ప్రక్రియలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వాలు కమిషన్‌ను ఏర్పాటు చేసి ట్రిపుల్ టెస్ట్ ఫార్మాలిటీ నోటిఫై చేయాలని సుప్రీంకోర్టు ఇప్పటికే స్పష్టం చేసింది. తెలంగాణలో కులగణన చేసి బీసీలకు 42శాతం రిజర్వేషన్ కల్పించి స్థానిక ఎన్నికలకు సన్నద్ద్ధమవడం గమనార్హం.
ట్రిపుల్ టెస్ట్ ఫార్మాలిటీ ప్రకారం...
సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి.. బీసీ రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో అమలు చేయాలంటే ముందుగా కమిషన్‌ను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఈ కమిషన్ రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో బీసీ కులగణన చేసి బీసీలకు ఏయే నియోజకవర్గంలో, ఏ మండలంలో, ఏ పంచాయతీలో ఏ మేరకు రిజర్వేషన్లు కేటాయించాలన్న విషయంపై నివేదిక రూపొందించాలి. మొత్తం ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్లు 50శాతం మించకూడదు. సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయడంలో భాగంగా గత ప్రభుత్వం హయాంలోని బీసీ కమిషన్ చైర్‌పర్సన్ జస్టిస్ శంకరనారాయణకు ట్రిపుల్ టెస్ట్ ఫార్మాలిటీ అమలు బాధ్యత అప్పగించారు. దీనికోసం ఆయన పదవీకాలం మరో మూడేళ్లు పెంచుతూ 2022 సెప్టెంబరు 20న ఆదేశాలిచ్చారు. ఆయనకు సహాయంగా మరో ముగ్గురు సభ్యులను నియమించారు. అప్పట్లో కొంతకాలం బీసీ కులగణనకు సంబంధించి కసరత్తు జరిగింది. అయితే, అప్పటి వైసీపీ ప్రభుత్వం బీసీ కమిషన్‌కు సహకరించలేదు. అవసరమైన డేటాను కమిషన్‌కు ఇవ్వకపోవడంతో ఈ ప్రక్రియ ఎక్కడేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది. కాగా, 34శాతం బీసీ రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో కల్పించి తీరుతామని కూటమి ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. దానిప్రకారం మొత్తం రిజర్వేషన్లు 60శాతానికి చేరుకుంటాయి. ఇది ట్రిపుల్ టెస్ట్ ఫార్మాలిటీని అతిక్రమించినట్లవుతుంది. అప్పుడు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఎన్నికలు నిర్వహణకు సానుకూలత వ్యక్తం చేస్తుందా...అనే ప్రశ్న తలెత్తుతోంది. గత వైసీపీ ప్రభుత్వం 24 శాతం బీసీలకు అమలు చేసి చేతులు దులుపుతుంది. పైగా అప్పట్లో ట్రిపుల్ టెస్ట్ ఫార్మాలిటీ నిబంధనలపై ఎవ్వరూ కోర్టుకెళ్లకపోవడంతో ఎన్నికలు అడ్డంకులు లేకుండా జరిగాయి. ఇప్పుడు బీసీలకు రిజర్వేషన్లు ఎంత శాతం అమలు చేసినా...ట్రిపుల్ టెస్ట్ ఫార్మాలిటీ నిబంధనలు పాటించాలి. బీసీ కులగణన చేపట్టాలంటే కచ్చితంగా రెండున్నర నెలల సమయం పడుతుంది. అంటే ఈ ప్రక్రియ పూర్తి చేసేందుకు కచ్చితంగా మూడు నెలలు పడుతుంది. ఇప్పుడు వెంటనే ప్రారంభించినా...డిసెంబర్ నెలాఖరుకు గానీ బీసీ కులగణన పూర్తి కాదు. ఆ తర్వాత ఎన్నికలకు సంబంధించి ముందస్తు చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది.