High Court: నోటిఫైకాని స్టేషన్‌లో కేసు చెల్లదు
ABN , Publish Date - Aug 03 , 2025 | 05:13 AM
నోటిఫై కాని పోలీస్ స్టేషన్‌లో కేసులు నమోదు చేయడం చెల్లదని హైకోర్టు స్పష్టం చేసింది. నోటిఫైకాని స్టేషన్‌లో అవినీతి నిరోధకశాఖ(ఏసీబీ) నమోదు చేసిన 15 కేసులను రద్దు చేసింది.
అలా కేసు నమోదు చేయడం సరికాదు
2016-20 నాటి 15 కేసులు రద్దు చేస్తున్నాం
అవినీతి నిరోధక శాఖ కేసులపై హైకోర్టు తీర్పు
అమరావతి, ఆగస్టు 2(ఆంధ్రజ్యోతి): నోటిఫై కాని పోలీస్ స్టేషన్‌లో కేసులు నమోదు చేయడం చెల్లదని హైకోర్టు స్పష్టం చేసింది. నోటిఫైకాని స్టేషన్‌లో అవినీతి నిరోధకశాఖ(ఏసీబీ) నమోదు చేసిన 15 కేసులను రద్దు చేసింది. వీటికి సంబంధించిన ఎఫ్‌ఐఆర్‌లను కూడా రద్దు చేస్తున్నట్టు పేర్కొంది. ఆయా కేసులు నమోదు చేసేనాటికి విజయవాడలోని ఏసీబీ సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్(సీఐయూ) కార్యాలయాన్ని పోలీస్ స్టేషన్‌గా నోటిఫై చేయలేదని, దీనిపై ప్రభుత్వం ఎలాంటి గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయలేదని గుర్తు చేసింది. ఈ నేపథ్యంలో విజయవాడ ఏసీబీ సీఐయూలో నమోదైన ఎఫ్‌ఐఆర్‌లకు చట్టబద్ధత ఉండదని పేర్కొంది. సదరు ఎఫ్‌ఐఆర్‌లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్.హరినాథ్ తీర్పు ఇచ్చారు. ఆదాయానికి మించిన ఆస్తులున్నాయనే ఆరోపణలతో రాష్ట్రవ్యాప్తంగా వివిఽఽధ శాఖలకు చెందిన 15 మంది అధికారులు, ఉద్యోగులపై విజయవాడలోని ఏసీబీ సీఐయూ కార్యాలయం ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసింది. నోటిఫైకాని పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసినందున వాటికి ఎలాంటి చట్టబద్ధత ఉండదని, వాటిని కొట్టివేయాలని కోరుతూ 15 మంది అధికారులు వేర్వేరుగా హైకోర్టును ఆశ్రయించారు. పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ.. సీఆర్పీసీ సెక్షన్-2(ఎస్) ప్రకారం పోలీస్ స్టేషన్‌గా గుర్తించేందుకు ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంటుందన్నారు.
విజయవాడలోని ఏసీబీ సీఐయూ కార్యాలయాన్ని పోలీస్ స్టేషన్‌గా నోటిఫై చేస్తూ ప్రభుత్వం ఎలాంటి గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వలేదని తెలిపారు. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ వాదనలు వినిపిస్తూ.. సాంకేతిక కారణాలు చూపి ఎఫ్‌ఐఆర్‌లను కొట్టివేయాలని కోరలేరని తెలిపారు. ఏసీబీ విభాగంలోని జాయింట్ డైరెక్టర్ల కార్యాలయాలను పోలీస్ స్టేషన్లుగా గుర్తిస్తూ 2003లో ప్రభుత్వం జీవో ఇచ్చిందన్నారు. పునర్విభజన చట్టంలోని సెక్షన్లు 101, 102 ప్రకారం రాష్ట్ర విభజన అనంతరం ఆ చట్టాలు అమల్లో ఉంటాయని తెలిపారు. విజయవాడలోని ఏసీబీ సీఐయూ కార్యాలయాన్ని పోలీస్ స్టేషన్ గా నోటిఫై చేస్తూ 2022లోనే నోటిఫికేషన్ ఇచ్చినప్పటికీ, కేసులు నమోదు చేసేందుకు వాటికి తాత్కాలికంగా అర్హత ఉంటుందన్నారు.