Share News

Rajamahendravaram Central Jail: అనధికార న్యాయవాదికి ఝలక్‌

ABN , Publish Date - Jul 31 , 2025 | 07:05 AM

రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైల్లో రిమాండ్‌ ఖైదీగా ఉన్న వైసీపీ ఎంపీ మిఽథున్‌రెడ్డిని అనధికారికంగా ఓ న్యాయవాది కలుస్తున్నారనే విషయం అలజడి సృష్టించింది.

 Rajamahendravaram Central Jail: అనధికార న్యాయవాదికి ఝలక్‌

  • సెంట్రల్‌ జైల్లో తరచూ కలుస్తున్న హుస్సేన్‌

  • ఆంధ్రజ్యోతి కథనంతో కనిపించని లాయర్‌

రాజమహేంద్రవరం, జూలై 30(ఆంధ్రజ్యోతి): రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైల్లో రిమాండ్‌ ఖైదీగా ఉన్న వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డిని అనధికారికంగా ఓ న్యాయవాది కలుస్తున్నారనే విషయం అలజడి సృష్టించింది. మిథున్‌రెడ్డిని కలవడానికి ఏసీబీ కోర్టు నలుగురు న్యాయవాదులకు అనుమతివ్వగా, హుస్సేన్‌ అనే న్యాయవాది ములాఖత్‌లకు హాజరవుతున్నారనే విషయాన్ని ‘ఆంధ్రజ్యోతి’ వెలుగులోకి తెచ్చిన విషయం తెలిసిందే. దీనిపై ఉన్నతాధికారులు ఆరా తీశారు. మిథున్‌రెడ్డి ప్రధాన న్యాయవాది టి.నాగార్జునరెడ్డి తరఫున హుస్సేన్‌ వస్తారని, ఆమేరకు ఆయన తమకు లేఖ రాశారని సెంట్రల్‌ జైలు అధికారులు చెబుతున్నారు. ఈ విషయాన్ని కోర్టుకు కూడా తెలియజేశామన్నారు. బుధవారం ఆ న్యాయవాది రాలేదని ఓ జైలు అధికారి చెప్పారు. ఏసీబీ కోర్టు ఫలానా న్యాయవాదులే వెళ్లాలని ఆర్డరు ఇచ్చినపుడు ఒక న్యాయవాది ఇచ్చిన లేఖను అధికారికంగా పరిగణించవచ్చా అనేది కూడా చర్చకు వచ్చింది. ఎవరు ములాఖత్‌కు వెళ్లినా వారితో ఆ న్యాయవాది వెళ్లడానికి వీలులేదు. మొత్తం మీద న్యాయవాది హుస్సేన్‌ జైలుకు వస్తుండడం వివాదాస్పదమైంది. బుధవారం ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన కథనంతో ఆ న్యాయవాది పత్తాలేరు. మిథున్‌రెడ్డి చిన్నాన్న జైలు వద్దకు వచ్చినా ఆయన వెంట రాలేదు.


  • మిథున్‌రెడ్డిని కలిసిన మండలి చైర్మన్‌

రాజమహేంద్రవరం జైలులో రిమాండులో ఉన్న వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డిని బుధవారం శాసనమండలి చైర్మన్‌ కొయ్యే మోషేన్‌రాజు కలిశారు. 40 నిమిషాలు మాట్లాడారు. నరసాపురం మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు కూడా జైలు లోపలికి వెళ్లడానికి ప్రయత్నించగా, జైలు అధికారులు ప్రధాన ద్వారం వద్ద నిలిపివేశారు. బయటకు వచ్చాక మోషేన్‌రాజు మీడియాతో మాట్లాడకుండానే వెళ్లిపోయారు. మాజీమంత్రి చెల్లుబోయిన వేణు, మాజీ ఎంపీ మార్గాని భరత్‌రామ్‌ తదితరులు మోషేన్‌రాజును కలిశారు. మిఽథున్‌రెడ్డి బాబాయి, ఎమ్మెల్యే ద్వారకానాథ్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు, లోకేశ్‌ తమ కుటుంబంపై కక్షతో తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆరోపించారు.

Updated Date - Jul 31 , 2025 | 07:05 AM