Share News

లైంగిక వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య

ABN , Publish Date - Oct 05 , 2025 | 01:12 AM

లైంగిక వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన పామర్రు మండలం కొమరవోలు గ్రామంలో జరిగింది.

లైంగిక వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య

- మృతదేహంతో కుటుంబ సభ్యుల రాస్తారోకో

- పామర్రు మండలం కొమరవోలు గ్రామంలో ఘటన

పామర్రు, అక్టోబరు 4 (ఆంధ్రజ్యోతి):

లైంగిక వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన పామర్రు మండలం కొమరవోలు గ్రామంలో జరిగింది. బాధితులు, పోలీసుల కథనం ప్రకారం... కొమరవోలు ఎస్సీ కాలనీకి చెందిన కౌలురైతు మేడపాటి ప్రవీణ్‌ భార్య వసంత (25)పై అదే గ్రామానికి చెందిన మెరుగుమాల పవన్‌ కన్నేశాడు. లైంగికంగా వేధించడం మొదలు పెట్టాడు. వేధింపులు భరించలేక వసంత కుటుంబ సభ్యులకు చెప్పడంతో వారు పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టారు. దీంతో పెద్దలు పవన్‌ను మందలించారు. అయినా వేధింపులు ఆపకపోవడంతో శుక్రవారం వసంత పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. గమనించిన కుటుంబసభ్యులు వెంటనే గుడివాడలోని ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం వేకువజామున మృతి చెందింది. మృతురాలికి నాలుగు, ఏడేళ్ల వయసు కలిగిన ఇద్దరు కుమారులు ఉన్నారు. బాధితురాలు ఆస్పత్రిలో వచ్చిన మరణ వాగ్మూలం ఆధారంగా పామర్రు పోలీసులు కేసు నమోదు చేశారు. గుడివాడ ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం అనంతరం వసంత మృతదేహన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.

నిందితుడిని అరెస్టు చేయాలని రాస్తారోకో

లైంగిక వేధింపులకు పాల్పడిన పవన్‌ను వెంటనే అరెస్టు చేయాలని కోరుతూ వసంత మృతదేహంతో కుటుంబ సభ్యులు, బంధువులు కొమరవోలు గ్రామంలో పామర్రు-దిగమర్రు జాతీయ రహదారిపై దాదాపు 40 నిమిషాల పాటు రాస్తారోకో చేశారు. సమాచారం అందుకున్న సీఐ సుభాకర్‌, ఎస్సై రాజేంద్రప్రసాద్‌ గ్రామానికి చేరుకుని ఆందోళన కారులతో చర్చలు జరిపారు. బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. అనంతరం వసంత మృతదేహాన్ని అంత్యక్రియలకు తరలించారు.

Updated Date - Oct 05 , 2025 | 01:12 AM