Fake Cases: బాబు అరెస్టుకు రెండేళ్లు
ABN , Publish Date - Sep 09 , 2025 | 05:07 AM
ముఖ్యమంత్రి చంద్రబాబును తప్పుడు కేసులో అక్రమంగా అరెస్టు చేసి మంగళవారానికి సరిగ్గా రెండేళ్లు. 2023 సెప్టెంబరు 9న అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబును.. లేని కుంభకోణాన్ని సృష్టించి అరెస్టు చేశారు.
2023 సెప్టెంబరు 9న నంద్యాలలో నిర్బంధం
దీనితోనే వైసీపీ పతనానికి నాంది.. టీడీపీ-జనసేన పొత్తుకూ ఇదే మూలం
జైల్లో బాబును కలిసి ఉమ్మడిగా పోటీచేస్తామని పవన్ కల్యాణ్ ప్రకటన
ఆనక వారిద్దరితో జతగట్టిన బీజేపీ.. అవినీతి కేసుల్లో నిండా మునిగిన జగన్
ఆ మకిలిని బాబుకూ అంటించేందుకు యత్నం.. అక్రమాలే లేని స్కిల్ కేసులో అరెస్టు
ఐఏఎ్‌సల వాంగ్మూలాలూ తారుమారు.. ఆధారాలు చూపడంలో సీఐడీ విఫలం
ఆయన అరెస్టుపై దేశవిదేశాల్లోని తెలుగువారి నుంచి తీవ్ర నిరసనలు
ప్రజావ్యతిరేకతతో గత ఏడాది ఎన్నికల్లో 11 సీట్లకే వైసీపీ పరిమితం
(అమరావతి/రాజమహేంద్రవరం-ఆంధ్రజ్యోతి)
ముఖ్యమంత్రి చంద్రబాబును తప్పుడు కేసులో అక్రమంగా అరెస్టు చేసి మంగళవారానికి సరిగ్గా రెండేళ్లు. 2023 సెప్టెంబరు 9న అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబును.. లేని కుంభకోణాన్ని సృష్టించి అరెస్టు చేశారు. నిలువెల్లా అవినీతికూపంలో కూరుకుపోయి.. అవినీతి, అక్రమార్జన కేసుల్లో ఏ-1 నిందితుడిగా ఉన్న నాటి ముఖ్యమంత్రి జగన్.. ఆ అవినీతి మరకలను చంద్రబాబుకు కూడా అంటించేందుకు చేసిన దుస్సాహ సమే స్కిల్ డెవల్‌పమెంట్ కేసు. కనిపించిన టీడీపీ నేతనల్లా ఏదో ఒక కేసులో ఇరికించి.. అరెస్టులు చేయడం.. ఆ పార్టీ కార్యకర్తలను సైతం తప్పుడు కేసుల్లో నిర్బంధించడం.. వేధించడం.. అర్ధరాత్రి ఇళ్ల గోడలు సైతం దూకి పోలీసులు అరెస్టులకు పాల్పడడం వంటి అరాచకాలకు పాల్పడిన నాటి సీఎం.. చంద్రబాబు విషయంలోనూ అదే కొనసాగించారు. నంద్యాలలో సెప్టెంబరు 8వ తేదీ రాత్రి ‘బాబు ష్యూరిటీ-భవిష్యత్ గ్యారెంటీ’ కార్యక్రమంలో పాల్గొని తన బస్సులో సేదతీరేందుకు సిద్ధమైన టీడీపీ అధినేతను.. రాత్రంతా కునుకైనా వేయనివ్వకుండా వేధించారు. అప్పటి సీఐడీ డీఐజీ కొల్లి రఘురామరెడ్డి నేతృత్వంలోని పోలీసు బృందం ఆయన బస వద్ద రాత్రంతా హడావుడి చేసి.. 9వ తేదీ తెల్లవారుజామున 6 గంటలకు అరెస్టు చేశారు. ప్రతిపక్ష నేతగా క్యాబినెట్ ర్యాంకులో ఉన్న చంద్రబాబును నంద్యాల నుంచి విజయవాడకు 400 కిలోమీటర్లు రోడ్డు మార్గంలో తీసుకొచ్చారు. కోర్టు రిమాండ్ విధించడంతో ఆయన్ను రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించారు. మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబుకు జైల్లోనూ సరైన సౌకర్యాలు కల్పించకుండా వేధించారు. జైళ్ల శాఖ ఉన్నతాధికారిని అడ్డుపెట్టుకుని ఏకంగా వైద్య పరీక్షల నివేదికలనే తారుమారు చేశారు. అనారోగ్య సమస్యలనూ దాచిపెట్టాలని చూశారు.
11 సీట్ల పతనానికి పునాది..
చంద్రబాబు అక్రమ అరెస్టు.. జగన్ ప్రభుత్వ పతనానికి నాందీ ప్రస్తావన. అప్పటికే ప్రజల్లో గూడుకట్టుకుని ఉన్న భయాందోళనలు.. ఆయన అరెస్టుతో పతాక స్థాయికి చేరాయి. 2024 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీకి దక్కిన 11 సీట్ల పతనానికి నాడే బీజం పడింది. చంద్రబాబు జైలులో ఉన్నంత కాలం రాష్ట్రవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారు నిరసనలు హోరెత్తించారు. ఆయనకు సంఘీభావంగా ఐటీ ఉద్యోగులు హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన సమావేశం చరిత్రలో నిలిచిపోతుంది. రాష్ట్రవ్యాప్తంగా మహిళలు రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపారు. హైకోర్టు బెయిల్ ఇవ్వడంతో ఎట్టకేలకు 53 రోజుల తర్వాత.. 2023 అక్టోబరు 31న చంద్రబాబు జైలు నుంచి విడుదలయ్యారు. రాజమహేంద్రి నుంచి విజయవాడలోని నివాసానికి బయల్దేరిన ఆయనకు దారిపొడవునా ప్రజలు నీరాజనాలు పట్టారు. సుమారు 200 కిలోమీటర్ల ప్రయాణానికి 14 గంటలు పట్టిందంటే.. ఎంతలా అభిమానులు తరలివచ్చారో అర్థమవుతుంది.
అక్రమ కేసులకు పరాకాష్ఠ ‘స్కిల్’
స్కిల్ కేసు.. అక్రమ కేసులకు పరాకాష్ఠగా నిలుస్తుంది. అవినీతి జరగకుండానే జరిగినట్లు చూపడం.. ఐఏఎస్ అధికారులు ఇచ్చిన వాంగ్మూలాలనే తారుమారు చేయడం వంటి చిత్రాలెన్నో ఈ కేసులో చోటుచేసుకున్నాయి. కేవలం రాజకీయ కక్షసాధింపుతో.. ఏ తప్పూ చేయకపోయినా.. ఎలాంటి ఆధారాలూ లేకపోయినా.. ఏ స్థాయి వ్యక్తినైనా అరెస్టు చేయవచ్చని ఈ కేసు ద్వారా జగన్ సర్కారు నిరూపించింది. స్కిల్ డెవల్‌పమెంట్ కేసులో అప్పటి ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పీవీ రమేశ్ వాంగ్మూలాన్ని సీఐడీ అధికారులు తారుమారు చేశారు. ఇన్ని ప్రయత్నాలు చేసినా స్కిల్ కేసులో సీఐడీ ఒక్క ఆధారం కూడా చూపలేకపోయింది. జగన్ 2019లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ కేసుపైనే ప్రత్యేక దృష్టి పెట్టారు. చంద్రబాబును ఎలాగైలా ఇరికించాలని పథక రచన చేశారు. విభజిత ఆంధ్ర రాష్ట్ర యువతలో నైపుణ్యాభివృద్ధి కోసం 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వం స్కిల్ ప్రాజెక్టును అమలు చేసింది. సీమెన్స్ వంటి ప్రతిష్ఠాత్మక సంస్థతోపాటు డిజైన్‌టెక్ సంస్థతో ఒప్పందం చేసుకుంది. సుమారు 4 లక్షల మందికి శిక్షణ ఇచ్చారు. వీరిలో వేల సంఖ్యలో ఉద్యోగాలు కూడా పొందారు.
ఏ శక్తీ నన్ను ఆపలేదు..
జైలు నుంచి విడు దలైన తర్వాత చంద్రబాబు పెట్టిన ట్వీట్ యావత్ తెలుగు జాతినీ కదిలించింది. ‘గత 45 ఏళ్లుగా తెలుగు ప్రజలకు నిస్వార్థంగా సేవ చేశాను. వారి ప్రయోజనాల కోసం నేను ప్రాణత్యాగానికైనా సిద్ధం. భూమ్మీద ఏ శక్తి కూడా నన్ను తెలుగు ప్రజలకు.. నా మాతృభూమి ఆంధ్రప్రదేశ్‌కు సేవ చేకుండా ఆపలేదు’ అని ఆయన పేర్కొన్నారు. ఆయన జైల్లో ఉన్నంత కాలం ఆయన సతీమణి భువనేశ్వరి, తనయుడు లోకేశ్, కోడలు బ్రాహ్మణి రాజమహేంద్రవరంలోనే బస చేశారు. ఆయన్ను జైల్లో కలిసి సంఘీభావం ప్రకటించిన జనసేనాని పవన్ కల్యాణ్.. జైలు వద్దే టీడీపీతో కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించారు. ఆ తర్వాత బీజేపీ కూడా జతకలవడంతో మూడు పార్టీల కూటమిగా ఎన్నికల బరిలో నిలిచి.. 94 శాతం స్ట్రైక్ రేటుతో 175 అసెంబ్లీ స్థానాలకు గాను 164 స్థానాల్లో జయకేతనం ఎగురవేశాయి. 2019 ఎన్నికల్లో 151 సీట్లు గెలిచిన వైసీపీ.. ఐదేళ్లకే 11 స్థానాలకు పరిమితమై కుదేలైంది. లోక్‌సభ ఎన్నికల్లో కూడా 25 స్థానాలకు నాలుగే గెలిచింది. కూటమి 21 సీట్లలో విజయం సాధించింది. జగన్ తన దుస్సాహసానికి మూల్యం చెల్లించుకున్నారు. కనీసం అసెంబ్లీలో ప్రతిపక్ష నేత హోదా కూడా సాధించలేకపోయారు. అయినా ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాల్సిందేనని.. లేదంటే అసెంబ్లీకి రానంటూ మారాం చేస్తున్నారు.