Forest Department Job Scam Foiled: 10 లక్షలు.. రెండు ఉద్యోగాలు
ABN , Publish Date - Nov 18 , 2025 | 04:56 AM
రాష్ట్ర అటవీ శాఖలో ఉద్యోగాలు ఆశ జూపి మోసం చేయబోయిన ఇద్దరు వ్యక్తుల నుంచి మరో ఇద్దరు నిరుద్యోగులు తృటిలో తప్పించుకున్నారు....
ఇద్దరు స్నేహితులకు టోకరా
అటవీ శాఖ పేరిట నకిలీ నియామకాలు
రాజమహేంద్రవరం, నవంబరు 17(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర అటవీ శాఖలో ఉద్యోగాలు ఆశ జూపి మోసం చేయబోయిన ఇద్దరు వ్యక్తుల నుంచి మరో ఇద్దరు నిరుద్యోగులు తృటిలో తప్పించుకున్నారు. రూ.10 లక్షలు ఇస్తే ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మబలికిన వ్యక్తుల మోసాన్ని గ్రహించి.. వారి ఉచ్చు నుంచి బయటపడ్డారు. అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఉప్పాడ కొత్తపల్లికి చెందిన నవంత్, ఆలమూరుకు చెందిన రాజ్‌కుమార్ డిగ్రీ చదువుకున్నారు. రెండు నెలల కిందట ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ల పోస్టులకు ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చింది. రాజ్‌కుమార్, నవంత్‌లు ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలని అనుకున్నారు. కానీ, రాజ్‌కుమార్ దరఖాస్తు చేసినా.. నవంత్ మాత్రం అప్లికేషన్ పెట్టలేదు. ఇదిలావుంటే, నవంత్, రాజ్‌కుమార్‌లకు కొత్తపల్లికి చెందిన ఒక యువకుడి ద్వారా తొలుత ఎక్సైజ్ శాఖలో జీపు డ్రైవరుగా పనిచేస్తున్న ఉద్యోగి పరిచయం అయ్యారు. తర్వాత ఈ ఉద్యోగి ద్వారా కోటికేశవరానికి చెందిన జల్లూరు రాజ్‌కుమార్, ధవళేశ్వరానికి చెందిన యర్రంశెట్టి ప్రసాద్ పరిచయమయ్యారు. వీరిద్దరూ అటవీ శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తామని, దీనికి కొంత ఖర్చవుతుందని నవంత్, రాజ్‌కుమార్‌లను నమ్మించారు. దీంతో ఆశపడిన స్నేహితులు జల్లూరు రాజ్‌కుమార్‌తో రెండు రోజుల కిందట ఫోన్‌లో మాట్లాడి రూ.10 లక్షలు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. అపాయింట్‌మెంట్ ఆర్డర్లను సోమవారం రాజమహేంద్రి ఆర్ట్స్ కళాశాల ఎదురుగా ఉన్న కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్టు కార్యాలయానికి తీసుకొస్తున్నాని.. అడ్వాన్స్‌గా రూ.లక్ష చొప్పున ఇద్దరూ రూ.2 లక్షలు తీసుకురావాలని రాజ్‌కుమార్ చెప్పాడు. ఇద్దరూ అక్కడికి వెళ్లగా పార్కింగ్‌లో రాజ్‌కుమార్ మాట్లాడి అపాయింట్‌మెంట్ ఆర్డర్లను ఇచ్చారు. ఒకరికి చింతూరు, మరొకరికి రంపచోడవరంలో పోస్టింగ్ ఇచ్చినట్టు ప్రభుత్వ ప్రిన్సిపల్‌సెక్రటరీ సంతకం, అటవీశాఖ స్టాంపుతో రెండేసి ప్రింటెడ్ కాగితాలను చేతిలో పెట్టాడు. ఈ వ్యవహారంపై ఉప్పందడంతో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ వీళ్లను పిలిచి ఆరాతీయగా విషయం బయటపడింది. డబ్బులందాయంటూ రాజ్‌కుమార్‌తో ఫోన్ చేయించి మరో నిందితుడు ప్రసాద్‌ని అటవీ శాఖ సంరక్షణాధికారి కార్యాలయానికి రప్పించారు. ఇద్దరిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. 282/2025గా ఎఫ్‌ఐఆర్ నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించామని సీఐ మురళీకృష్ణ తెలిపారు. ఉద్యోగాలకు సంబంధించి ఎవరైనాసరే ప్రక్రియను పాటించాల్సిందేనని, ఇలాంటి వాళ్లను నమ్మి మోసపోవద్దని పేర్కొన్నారు. ఎఫ్‌ఆర్‌వో ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ వెలువడిందని, స్ర్కీనింగ్ టెస్ట్ మాత్రమే పూర్తయిందని జిల్లా అటవీ శాఖ అధికారి ప్రభాకరరావు తెలిపారు.