Share News

ఇద్దరు ట్రెజరీ ఉద్యోగులపై సస్పెన్షన్‌ వేటు

ABN , Publish Date - Mar 11 , 2025 | 12:29 AM

అవనిగడ్డ సబ్‌ ట్రెజరీ కార్యాలయంలో నిధుల దుర్వినియోగం వ్యవహారంలో ఇద్దరిపై ఆ శాఖ సస్పెన్షన్‌ వేటు వేసింది. తప్పుడు బిల్లులతో రూ.1.58 కోట్లు దారి మళ్లించినట్టు గుర్తించి సీనియర్‌ అకౌంటెంట్‌ వెంకటరెడ్డిపై, నిధుల దుర్వినియోగాన్ని సకాలంలో గుర్తించలేదన్న కారణంతో ఎస్‌టీవో ఆదిశేషుపై ఆ శాఖ ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. గతంలో ఎస్‌టీవోగా పని చేసిన పి.రమేష్‌ కుమార్‌ను డిప్యూటేషన్‌పై ఇక్కడికి పంపించారు.

ఇద్దరు ట్రెజరీ ఉద్యోగులపై సస్పెన్షన్‌ వేటు

-రూ.1.58 కోట్లు దారిమళ్లించిన సీనియర్‌ అకౌంటెంట్‌ వెంకటరెడ్డి

-పోలీసులకు జిల్లా ట్రెజరీ అండ్‌ అకౌంట్స్‌ అధికారి ఫిర్యాదు

-నిధుల దుర్వినియోగాన్ని సకాలంలో గుర్తించలేదని ఎస్‌టీవో ఆదిశేషుపై చర్యలు

అవనిగడ్డ, మార్చి 10 (ఆంధ్రజ్యోతి): అవనిగడ్డ సబ్‌ ట్రెజరీ కార్యాలయంలో నిధుల దుర్వినియోగం వ్యవహారంలో ఇద్దరిపై ఆ శాఖ సస్పెన్షన్‌ వేటు వేసింది. తప్పుడు బిల్లులతో రూ.1.58 కోట్లు దారి మళ్లించినట్టు గుర్తించి సీనియర్‌ అకౌంటెంట్‌ వెంకటరెడ్డిపై, నిధుల దుర్వినియోగాన్ని సకాలంలో గుర్తించలేదన్న కారణంతో ఎస్‌టీవో ఆదిశేషుపై ఆ శాఖ ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. గతంలో ఎస్‌టీవోగా పని చేసిన పి.రమేష్‌ కుమార్‌ను డిప్యూటేషన్‌పై ఇక్కడికి పంపించారు.

జిల్లా ట్రెజరీ అండ్‌ అకౌంట్స్‌ అధికారి ఫిర్యాదు

‘అవనిగడ్డ సబ్‌ ట్రెజరీ కార్యాలయంలో సీనియర్‌ అకౌంటెంట్‌గా పని చేస్తున్న టంటం వెంకటరెడ్డి రూ.1.58,44,569 మొత్తాన్ని డూప్లికేట్‌ బిల్లులు సృష్టించి దారి మళ్లించారు. 2023లో కేవలం రెండు నెలల కాలంలోనే ఇంత మొత్తాన్ని వెంకటరెడ్డి తన పేరిట ఉన్న ఖాతాలు, తన బంధువుల పేరిట ఉన్న ఖాతాల్లో జమ చేయించారు’ అని డిసి్ట్రక్ట్‌ ట్రెజరీ అండ్‌ అకౌంట్స్‌ అధికారి ఎస్‌.రవికుమార్‌ అవనిగడ్డ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అవనిగడ్డ సబ్‌ ట్రెజరీ కార్యాలయంలో వెంకటరెడ్డి 2022, జూలై ఒకటి నుంచి సీనియర్‌ అకౌంటెంట్‌గా పని చేస్తున్నారని, 2023 జూలై నుంచి సెప్టెంబరు వరకు సీఎఫ్‌ఎంఎస్‌ ఫేజ్‌-2, సీఎంఎఫ్‌ఎస్‌ ఫేజ్‌-1 మధ్య ఉన్న సమన్వయ లోపాన్ని తనకు అనుకూలంగా మలుచుకుని 22 క్లైముల్లో అవకతవకలకు పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీని కారణంగా ప్రభుత్వానికి రూ.1.58 కోట్ల మేర నష్టం వాటిల్లగా, అందులో నుంచి రూ.1.50 కోట్ల మొత్తాన్ని నాలుగు ఖాతాలకు దారి మళ్లించినట్టుగా తమ విచారణలో వెల్లడైందని ఫిర్యాదులో తెలిపారు. సీనియర్‌ అకౌంటెంట్‌గా పని చేస్తున్న వెంకటరెడ్డి తన వ్యక్తిగత ఖాతాలకు రూ.60,99,286, ఆయన భార్య శ్రీముఖి అకౌంట్‌కు రూ.56,78,253, తన ఇంటి సమీపంలో టీ దుకాణం నడుపుకునే టి.వి.కిషోర్‌ పట్వాల్‌ అకౌంట్‌కు రూ.5,04,266 మొత్తాన్ని దారి మళ్లించినట్లుగా వెల్లడైనట్టు తెలిపారు. చందు కళ్యాణి అనే మహిళ అకౌంట్‌కు రూ.27,63,804 మొత్తాన్ని జమ చేసినట్లుగా డిసి్ట్రక్ట్‌ ట్రెజరీ అండ్‌ అకౌంట్స్‌ అధికారి తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఇల్లు కొంటామంటూ మహిళా ఉద్యోగి ఖాతాలోకి నగదు

గుంటూరు జిల్లా రేపల్లెలోని తన ఇంటిని కొంటామంటూ తన ఖాతాకు డబ్బు మళ్లించి తనను బలి చేశారని బంటుమిల్లి మండలంలో పని చేస్తున్న ఓ మహిళా పంచాయతీ రాజ్‌ ఉద్యోగి లబోదిబోమంటున్నారు. సదరు మహిళా ఉద్యోగి భర్త మూడేళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందగా, ఆమెకు పెన్షన్‌ బెనిఫిట్లను అందించటంతోపాటు భర్త ఉద్యోగాన్ని ఇచ్చారు. బంటుమిల్లిలో ఉండి ఉద్యోగం చేసుకుంటుంది. ఈ క్రమంలోనే రేపల్లెలో ఉన్న తన ఇంటిని అమ్మకానికి పెట్టగా, సబ్‌ ట్రెజరీ కార్యాలయంలో నిధులు దుర్వినియోగానికి పాల్పడిన వ్యక్తులు తాము ఇళ్లు కొనుగోలు చేస్తామంటూ తన ఖాతాకు డబ్బులు వేశారని, ఇప్పుడు తనను సదరు ఉద్యోగి బంధువుగా చూపిస్తున్నారని ఆ మహిళా ఉద్యోగి వాపోతున్నారు.

వెలుగు చూడాల్సినవి ఇంకా ఎన్నో..

2023 జూలై నుంచి సెప్టెంబరు వరకు 22 వ్యవహారాల్లో నిధులను దారిమళ్లించిన సబ్‌ ట్రెజరీ కార్యాలయ ఉద్యోగులు తర్వాత ఇంకా ఎన్ని నిధులు దారి మళ్లించి ఉంటారోనని పెన్షనర్లు చెవులు కొరుక్కుంటున్నారు. సీనియర్‌ అకౌంటెంట్‌గా పని చేస్తున్న వెంకటరెడ్డి సీఎంఎఫ్‌ఎస్‌ ఫేజ్‌-2లో రిటైర్‌ అయిన పెన్షనర్ల వాస్తవ క్లైమ్‌లు పెట్టి వారి ఖాతాలకు ఆ క్లైములు జమ చేసి సీఎంఎఫ్‌ఎస్‌ ఫేజ్‌-1 నుంచి అదే పెన్షనర్‌ పేరుతో బెనిఫిషరీ అకౌంట్ల పేర్లు మార్చి క్లైములు పొందారని, కేవలం రెండు నెలల కాలంలోనే రూ.1.58 కోట్ల నిధులు దుర్వినియోగం అయితే ఆ తదనంతరం ఇంకా ఎన్ని క్లైములు జరిగాయో నిగ్గు తేల్చకుండా కేవలం విచారణను రెండు నెలల కాలానికే పరిమితం చేశారని పెన్షనర్లు ఆరోపిస్తున్నారు. జిల్లా ఉన్నతాధికారుల సహకారం లేకపోతే ఒక సీనియర్‌ అకౌంటెంట్‌ ఈ స్థాయిలో అవకతవకలకు పాల్పడే అవకాశం లేదని, ట్రెజరీ అధికారులు, ఫైనాన్స్‌ శాఖలో దీనిపై పూర్తి స్థాయిలో విచారణ నిర్వహించి ఇంకా ఎవరెవరు ఇందులో దోషులుగా ఉన్నారో నిగ్గు తేల్చాలని డిమాండ్‌ చేస్తున్నారు.

Updated Date - Mar 11 , 2025 | 12:29 AM