Road Accident in the U.S.: అమెరికాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు తెలంగాణ యువతుల దుర్మరణం
ABN , Publish Date - Dec 30 , 2025 | 04:28 AM
ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన ఇద్దరు తెలంగాణ యువతులు అక్కడ రోడ్డు ప్రమాదంలో దుర్మరణంపాలయ్యారు. మృతులు మహబూబాబాద్ జిల్లా గార్ల మండలానికి చెందిన పుల్లకండం...
మృతుల స్వస్థలం మహబూబాబాద్ జిల్లా
విహారయాత్రకు వెళ్తుండగా లోయలోకి కారు
మరో ఇద్దరమ్మాయిలకు తీవ్ర గాయాలు
గార్ల, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన ఇద్దరు తెలంగాణ యువతులు అక్కడ రోడ్డు ప్రమాదంలో దుర్మరణంపాలయ్యారు. మృతులు మహబూబాబాద్ జిల్లా గార్ల మండలానికి చెందిన పుల్లకండం మేఘన (25), కడియాల భావన (24). భారత కాలమానం ప్రకారం.. ఆదివారం విహారయాత్రకు వెళుతుండగా కాలిఫోర్నియాలో వారు ప్రయాణిస్తున్న కారు లోయలోపడింది. ఈ ప్రమాదంలో హైదరాబాద్‌కు చెందిన మరో ఇద్దరు విద్యార్థినులు తీవ్రంగా గాయపడ్డారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మృతుల బంధువుల వివరాల ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా గార్ల మండల కేంద్రానికి చెందిన మీసేవ నిర్వాహకుడు పుల్లకండం శిరీష-నాగేశ్వర్‌రావు దంపతుల కుమార్తె మేఘన, ఇదే మండలం ముల్కనూరుకు చెందిన ఉపసర్పంచ్ కడియాల రేణుక-కోటేశ్వర్‌రావు దంపతుల చిన్నకుమార్తె భావన స్నేహితులు. కలిసి పదో తరగతి వరకు మహబూబాబాద్‌లో చదువుకున్నారు. ఆ తర్వాత హైదరాబాద్ బాచుపల్లి నారాయణ కాలేజీలో ఇంటర్ పూర్తి చేశారు. ఆపై ఇరువురు హైదరాబాద్‌లోని వేర్వేరు కాలేజీల్లో ఇంజనీరింగ్ పూర్తిచేశారు. రెండున్నరేళ్ల క్రితం అమెరికా వెళ్లారు. అక్కడ ఒహియో స్టేట్‌లోని డేటన్ యూనివర్సిటీలో ఎంఎస్ పూర్తిచేశారు. అమెరికాలో ఒకేచోట ఉంటూ ఉద్యోగాన్వేషణలో ఉన్నారు. భావన, మేఘన ఆదివారం హైదరాబాద్‌కు చెందిన మరో ఇద్దరు విద్యార్థినులతో కలిసి కారులో విహార యాత్రకు బయలుదేరి ప్రమాదం బారినపడ్డారు. మేఘన, భావనల మృతదేహాలను స్వస్థలాలకు పంపాలంటూ వారి తరఫువారు తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (టీఏఎన్‌ఏ) సాయాన్ని కోరుతున్నారు. మృతదేహాలను అమెరికా నుంచి స్వదేశానికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు, విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లనున్నట్లు ఎంపీ బలరాం నాయక్ పేర్కొన్నారు.