Share News

తామర పూల కోసం వెళ్లి ఇద్దరు విద్యార్థులు మృతి

ABN , Publish Date - Jul 17 , 2025 | 12:21 AM

తామర పూలు కోసమని చెరువులో దిగిన ఇద్దరు విద్యార్థులు ఊబిలో కూరుకుపోయి మృతి చెందిన హృదయవిదారక ఘటన గన్నవరంలో జరిగింది.

 తామర పూల కోసం వెళ్లి ఇద్దరు విద్యార్థులు మృతి

- గన్నవరం తొండం గట్టు చెరువు వద్ద ఘటన

- రెండు కుటుంబాల్లో విషాదం

గన్నవరం, జూలై 16 (ఆంధ్రజ్యోతి):

తామర పూలు కోసమని చెరువులో దిగిన ఇద్దరు విద్యార్థులు ఊబిలో కూరుకుపోయి మృతి చెందిన హృదయవిదారక ఘటన గన్నవరంలో జరిగింది. ఎస్సై శ్రీధర్‌ తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక సగర్లపేటకు చెందిన ముగ్గురు విద్యార్థులు బుధవారం సాయంత్రం కోనాయి చెరువు పక్కనే ఉన్న తొండం గట్టు చెరువులో తామర పూలు కోసం వెళ్లారు. పోట్రు సతీష్‌(15), నక్కా ఛైతన్య కుమార్‌(12) తొండం గట్టు చెరువులో దిగారు. ఊబి ఎక్కువగా ఉండటంతో ఇద్దరూ దానిలో కూరుకుపోయారు. దీంతో వారితో పాటు వెళ్లిన మరో విద్యార్థి కేకలు వేస్తూ చుట్టు పక్కల వారిని పిలిచాడు. స్థానికులు వెంటనే అక్కడకు చేరుకుని విద్యార్థులను ఊబిలో నుంచి బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్టు నిర్థారించారు. సతీష్‌ పదవ తరగతి పూర్తి చేసి ఇంటి వద్దనే ఉంటున్నాడు. ఛైతన్యకుమార్‌ గన్నవరం బాలుర హైస్కూల్‌లో 7వ తరగతి చదువుతున్నాడు. సతీష్‌ తండ్రి నరసింహారావు స్థానిక పంచాయతీలో కార్మికుడిగా పని చేస్తున్నాడు. సతీష్‌ కొంచం అమాయకంగా ఉండటంతో ఇంటి వద్దనే ఉంచుతున్నారు. ఎవరికి తెలియకుండా వెళ్లి ఇలా చనిపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. చైతన్య కుమార్‌ తండ్రి దుర్గారావు తాపీ మేస్ర్తిగా పని చేస్తున్నాడు. వీరికి లేకలేక చైతన్య కుమార్‌ పుట్టాడు. ఒక్కగానొక కొడుకు మృతి చెందటంతో బోరున విలపిస్తున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Jul 17 , 2025 | 12:21 AM