Prisoners Escape: సబ్ జైలు నుంచి ఇద్దరు రిమాండ్ ఖైదీలు పరారీ
ABN , Publish Date - Sep 06 , 2025 | 04:13 AM
అనకాపల్లి జిల్లా చోడవరం సబ్ జైలు నుంచి శుక్రవారం సాయంత్రం ఇద్దరు రిమాండ్ ఖైదీలు తప్పించుకున్నారు...
జైలు వార్డర్‌పై సుత్తితో దాడిచేసి ఉడాయింపు
ఒకరు పంచాయతీ కార్యదర్శి, మరొకరు చోరీ కేసుల్లో నిందితుడు
చోడవరం, సెప్టెంబరు 5 (ఆంధ్రజ్యోతి): అనకాపల్లి జిల్లా చోడవరం సబ్ జైలు నుంచి శుక్రవారం సాయంత్రం ఇద్దరు రిమాండ్ ఖైదీలు తప్పించుకున్నారు. పరారైన ఖైదీల్లో ఒకరు నక్కా రవికుమార్ అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం టోకూరు పంచాయతీ కార్యదర్శి. ప్రభుత్వ సామాజిక పింఛన్ల సొమ్మును మాయం చేసిన కేసులో ఏప్రిల్ 25న అనంతగిరి పోలీసులు అరెస్టు చేశారు. మరో రిమాండ్ ఖైదీ మాడుగులకు చెందిన బెజవాడ రాము వివిధ చోరీ కేసుల్లో నిందితుడు. రెండు నెలల క్రితం మాడుగుల మండలంలో జరిగిన బంగారం దొంగతనం కేసులో జూలై 23న మాడుగుల పోలీసులు అరెస్టు చేయడంతో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. శుక్రవారం సాయంత్రం వంట పనుల్లో సాయం చేసేందుకు వీరిద్దరినీ సెల్ నుంచి బయటకు వదిలారు. వంట పనిలో సాయం చేస్తున్నట్టుగా నటిస్తూ రవికుమార్.. అక్కడ ఉన్న సుత్తి తీసుకుని సమీపంలో విధి నిర్వహణలో ఉన్న జైలు వార్డర్ బి.వీర్రాజుపై దాడి చేశాడు. వీర్రాజు పడిపోవడంతో అతని వద్ద ఉన్న తాళాలు లాక్కుని ఇద్దరూ జైలు గేటు తెరచుకుని పారిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు సబ్ జైలుకు చేరుకుని వివరాలు సేకరించారు. బృందాలుగా ఏర్పడి పరారైన ఖైదీల కోసం గాలింపు చేపట్టారు. వార్డర్ వీర్రాజును చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. జిల్లా ఎస్పీ తుహిన్‌సిన్హా శుక్రవారం రాత్రి సబ్ జైలును సందర్శించి సిబ్బంది నుంచి వివరాలు సేకరించారు.