రెండు చిరుతలు హతం....?
ABN , Publish Date - Dec 03 , 2025 | 11:48 PM
నల్లమలలో రెండేళ్ల క్రితం రెండు చిరుతల హతమైన ఘటన వివరాలు ఆలస్యంగా వెలుగులోకి రావడంతో ఫారెస్ట్, పోలీసు అధికారులు నివ్వెరపోయారు.
రెండేళ్ల కిందటి ఘటన వెలుగులోకి
కరెంట్ షాక్ ఇచ్చి హతమార్చినట్లు దర్యాప్తులో వెల్లడి
అటవీశాఖలో కింది స్థాయి ఉద్యోగి కీలకపాత్రధారి
అటవీశాఖ అదుపులో పులిగోర్లు కొనుగోలు చేసిన వ్యక్తులు
ఫారెస్ట్, పోలీసుశాఖ ఆధ్వర్యంలో ముమ్మరంగా విచారణ
నంద్యాల ఎడ్యుకేషన, మహానంది, డిసెంబరు 3 (ఆంధ్రజ్యోతి): నల్లమలలో రెండేళ్ల క్రితం రెండు చిరుతల హతమైన ఘటన వివరాలు ఆలస్యంగా వెలుగులోకి రావడంతో ఫారెస్ట్, పోలీసు అధికారులు నివ్వెరపోయారు. ఈ ఘటన నంద్యాల పట్టణంలో బయటపడడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. పట్టణంలోని సంజీవనగర్‌లో ఓ ఇంట్లో ఒక వ్యక్తి మెడలో పులిగోరును చూసి ఆ గోరు ఎక్కడిదని అటవీశాఖ అధికారులు ప్రశ్నించారు. దీనికి ఆయన తటపటాయించడంతో అనుమానం బలపడింది. వెంటనే ఆ వ్యక్తి ఇంటిలో తనిఖీ చేయగా పులిచర్మం, షూటర్‌గన కూడా దొరికినట్లు విశ్వసనీయ సమాచారం. దీనిపై పోలీసులు, అటవీశాఖ అఽధికారులు సంయుక్తంగా దర్యాప్తు చేపట్టారు. ఇందులో ఆ వ్యక్తి ఇచ్చిన సమాచారంతో ఆశ్చర్యపోయేలా చేసింది. దీంతో అప్రమత్తమైన అటవీ, పోలీసుశాఖ అధికారులు మరింత కూపీ లాగారు. ప్రధాన వేటగాడిని కూడా అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టినట్లు తెలిసింది. ప్రేమ బీట్(కృష్ణనంది ప్రాంతం)లో రెండేళ్ల క్రితం ఒక ప్రొటక్షన వాచర్ సహాయంతో అడవిలో విద్యుత తీగలను అమర్చి రెండు చిరుతలను హతమార్చినట్లు విచారణలో బయటపడింది. వెంటనే సదరు ప్రొటక్షన వాచర్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా ఆ పులులకు సంబంధించిన గోర్లు మహానంది మండలం గోపవరం గ్రామంలో ముగ్గురికి, బండిఆత్మకూరు మండలంలో ఇద్దరికి, నంద్యాల పట్టణంలో మరికొందరికి విక్రయించినట్లు తెలిసింది. దీనిపై అధికారులు మరింత లోతుగా విచారణ కొనసాగిస్తున్నారు. చిరుతల హతం వెనుక ఎంతమంది ఉన్నారనే కోణంలో దర్యాప్తు సాగుతోంది.