రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి
ABN , Publish Date - Dec 06 , 2025 | 11:31 PM
మండలంలోని అలేబాదు గ్రామం సమీపంలో శుక్రవారం అర్ధరాత్రి ఆటో బోల్తా పడింది.
ఐదుగురికి గాయాలు
దైవ దర్శనానికి వెళ్లి వస్తుండగా ఆటో ప్రమాదం
ప్యాపిలి, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి): మండలంలోని అలేబాదు గ్రామం సమీపంలో శుక్రవారం అర్ధరాత్రి ఆటో బోల్తా పడింది. ఈ ఘటనలో ఇద్దరు మహిళలు మృతి చెందగా మరో ఐడుగురు మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని పోలీసులు 108 అంబులెన్సలో డోన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కర్నూలు జిల్లా క్రిష్ణగిరి మండలంలోని రామక్రిష్ణాపురం గ్రామానికి చెందిన 9 మంది మహిళలు ఈ నెల 4న ఆటోలో కడప జిల్లా పోరుమామిళ్ల దగ్గరలోని జ్యోతి నందుల కాశిరెడ్డి నాయన ఆశ్రమానికి వెళ్లారు. ఆ రోజు స్వామిని దర్శించుకొని అక్కడే నిద్రించారు. 5న అవుకు మండలంలోని సీతారాంపురంలో నిర్వహిస్తున్న కాశిరెడ్డి నాయన ఆరాధన ఉత్సవాలలో పాల్గొన్నారు. ఆ రాత్రి మహిళలంతా సొంత ఊరికి బయలు దేరారు. మార్గమధ్యంలోని అలేబాదు గ్రామం సమీపంలోని వినాయకుడి గుడి దగ్గర మలుపులో ఆటో అదుపు కాక బోల్తా పడింది. ఈ ప్రమాదంలో హనుమక్క(66), నాగేంద్రమ్మ(58) మృతి చెందగా కళావతి, అయ్యమ్మ, సోమక్క, మద్దమ్మ, లక్ష్మమ్మలకు తీవ్ర గాయాలయ్యాయి. రాచెర్ల ఎస్‌ఐ రమేష్ బాబు తమ సిబ్బందితో ఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టి క్షతగాత్రులను 108 అంబులెన్స డోన ప్రభత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్న సోమక్క, అయ్యమ్మను కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు ఎస్‌ఐ రమేష్‌బాబు తెలిపారు. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.