CM Chandrababu Naidu: నేడు, రేపు కలెక్టర్ల సదస్సు
ABN , Publish Date - Dec 17 , 2025 | 05:11 AM
మరింత మెరుగైన పరిపాలన అందించడం లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ఐదోసారి కలెక్టర్ల సదస్సు నిర్వహణకు సన్నద్ధమైంది.
మరింత మెరుగైన పాలన లక్ష్యంగా నిర్వహణ
ఉత్తమ విధానాలు, సక్సెస్ స్టోరీల ప్రదర్శన
జిల్లాల పనితీరుపై చర్చ.. ర్యాంకులు
అమరావతి, డిసెంబరు 16(ఆంధ్రజ్యోతి): మరింత మెరుగైన పరిపాలన అందించడం లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ఐదోసారి కలెక్టర్ల సదస్సు నిర్వహణకు సన్నద్ధమైంది. బుధ, గురువారాల్లో సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఈ సదస్సు జరగనుంది. సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధన, కలెక్టర్ల పనితీరు మదింపు, జిల్లాలు, పథకాల వారీగా ప్రజల అభిప్రాయాలను వెల్లడించడం ప్రధాన అజెండాగా సదస్సు నిర్వహిస్తారు. బుధవారం ఉదయం 10 గంటలకు సదస్సు ప్రారంభం కానుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రారంభోపన్యాసం చేస్తారు. రెండు రోజుల సదస్సులో భాగంగా ఉత్తమ విధానాలు, సవాళ్లు అధిగమించడంపై ప్రశ్నలు, సమాధానాలతో తొలి సెషన్ ప్రారంభ అవుతుంది. తర్వాత సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనలో భాగంగా జిల్లాల్లో శాఖల వారీగా జీఎ్‌సడీపీపై చర్చిస్తారు. 2024-25 ఆర్థిక సంవత్సరం, 2025-26లో అర్ధసంవత్సరం జీఎ్‌సడీపీపై ఆయా శాఖ కార్యదర్శులు ప్రజెంటేషన్ ఇస్తారు. సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనలో రేటింగ్ వెల్లడిస్తారు. పథకాల అమలుతీరుపై ప్రజల అభిప్రాయాలను సదస్సులో వెల్లడిస్తారు. జిల్లాల్లో ఎన్ని ఫైళ్లు పెండింగ్‌లో ఉన్నాయి, ఎన్ని పరిష్కరించారు, ఆర్థిక- ఆర్థికేతర ఫైళ్లు ఎన్ని, ప్రజల నుంచి వచ్చిన వినతుల్లో ఆర్థిక అంశాలు ఎన్ని ఉన్నాయి అనే వివరాలపై ప్రజెంటేషన్ ఇస్తారు. జిల్లాలకు వచ్చిన పెట్టుబడులు, ప్రాజెక్టులు.. వాటి పనులు ప్రారంభంపై మౌలిక సదుపాయాల శాఖ అధికారులు ప్రజెంటేషన్ ఇస్తారు. అనంతరం ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, మైనారిటీ సంక్షేమం, పేదరిక నిర్మూలన(పీ4), నైపుణ్యం- ఉపాధి కల్పన, సాగునీటి భద్రత, వ్యవసాయం, స్వచ్ఛాంధ్రపై సమీక్షలు జరుగుతాయి. తర్వాత మొత్తంగా జిల్లాల పనితీరుపై చర్చించి ర్యాంకులు ప్రకటిస్తారు. రెండో రోజు చివరి సెషన్‌లో శాంతి భద్రతలపై చర్చ జరుగుతుంది.