రెండు కంపాక్టర్‌లు అవసరం
ABN , Publish Date - Sep 17 , 2025 | 01:09 AM
జిల్లాలోని పంచాయతీల నుంచి వచ్చే చెత్తను గుంటూరు జిల్లాలోని జిందాల్ సిమెంట్ ఫ్యాక్టరీకి తరలించేందుకు అనుమతులతో పాటు రెండు కంపాక్టర్‌లు కావాలని కలెక్టర్ బాలాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకువచ్చారు.
- సీఎం చంద్రబాబు దృష్టికి తెచ్చిన కలెక్టర్ బాలాజీ
- జిల్లా నుంచి చెత్తను జిందాల్ ఫ్యాక్టరీకి తరలించేందుకు అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి
- సానుకూలంగా స్పందించి ఉన్నతాధికారులకు ఆదేశాలు ఇచ్చిన సీఎం
మచిలీపట్నం, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని పంచాయతీల నుంచి వచ్చే చెత్తను గుంటూరు జిల్లాలోని జిందాల్ సిమెంట్ ఫ్యాక్టరీకి తరలించేందుకు అనుమతులతో పాటు రెండు కంపాక్టర్‌లు కావాలని కలెక్టర్ బాలాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకువచ్చారు. రాజధాని అమరావతిలోని సచివాలయం ఐదవ బ్లాక్‌లో మంగళవారం జరిగిన కలెక్టర్‌ల కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ బాలాజీ జిల్లాకు సంబంధించిన పలు అంశాలను చంద్రబాబు దృష్టికి తీసుకువచ్చారు. స్వచ్ఛాంధ్ర మిషన్‌పై జరిగిన సమీక్షలో కలెక్టర్ మాట్లాడుతూ మచిలీపట్నం మునిసిపల్ కార్పొరేషన్ నుంచి సేకరించిన చెత్తను రోజూ గుంటూరుకు తరలిస్తున్నామని తెలిపారు. అదే పద్ధతిలో జాతీయ రహదారుల పక్కనే ఉన్న పంచాయతీల నుంచి చెత్తను సేకరించి గుంటూరుకు తరలించేందుకు కనీసంగా రెండు కంపాక్టర్‌లను ఇవ్వాలని కోరారు. కంపాక్టర్‌ల కొనుగోలుకు నిధులు ఇస్తామని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా హామీ ఇచ్చి.. ఇందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు సూచించారు. కలెక్టర్‌తో పాటు ఎస్పీ విద్యాసాగర్‌నాయుడు ఈ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.