Aviation Hub: రాష్ట్రంపై 2 ఏరోస్పేస్ సంస్థల ఆసక్తి
ABN , Publish Date - Sep 24 , 2025 | 04:22 AM
ఏరోస్పేస్ రంగంలో ఉన్న అవకాశాలను మన రాష్ట్రం అందిపుచ్చుకుంటోంది. ప్రభుత్వం తీసుకుంటున్న చొరవ, పాలసీలతో ఆ రంగంలో పెట్టుబడులు రాష్ట్రానికి వస్తున్నాయి.
చిన్న విమానాల తయారీ యూనిట్ స్థాపనకు మనో ఎయిర్‌క్రాఫ్ట్ సంసిద్ధత
విమానాల కంట్రోల్ సిస్టమ్స్, హార్డ్‌వేర్ ఉత్పత్తి యూనిట్ ఏర్పాటుకు డలాఫ్ట్ సిద్ధం
అమరావతి, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి): ఏరోస్పేస్ రంగంలో ఉన్న అవకాశాలను మన రాష్ట్రం అందిపుచ్చుకుంటోంది. ప్రభుత్వం తీసుకుంటున్న చొరవ, పాలసీలతో ఆ రంగంలో పెట్టుబడులు రాష్ట్రానికి వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో చిన్న తరహా విమానాల తయారీ యూనిట్‌ను స్థాపించేందుకు మనో ఎయిర్‌క్రాఫ్ట్ సంసిద్ధత వ్యక్తం చేసింది. రెండు, మూడు సీట్ల సామర్థ్యం ఉన్న విమానాలను తయారు చేయడంలో కోయంబత్తూరుకు చెందిన ఆ సంస్థకు అనుభవం ఉంది. మంగళవారం సచివాలయంలో రోడ్లు భవనాలు, మౌలిక సదుపాయాల కల్పన శాఖ మంత్రి బీసీ జనార్దనరెడ్డిని మనో ఎయిర్‌క్రాఫ్ట్ సర్వీసెస్ ప్రతినిధి విఽఘ్నేష్ కలిశారు. టూ సీటర్, త్రీసీటర్ సామర్థ్యంతో చిన్న విమానాలను తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. డీపీఆర్‌ను సమర్పిస్తే పరిశీలించి ఆమోదం తెలిపేందుకు సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు.
మంత్రిని కలిసిన డలాఫ్ట్ ప్రతినిధులు
రాష్ట్రంలో సంస్థను స్థాపించేందుకు చెన్నై కేంద్రంగా పనిచేసే డలాఫ్ట్ ఏరోస్పేస్ కూడా సంసిద్ధత వ్యక్తం చేసింది. ఈమేరకు ఆ సంస్థ ప్రతినిధులు దినేశ్, నరేశ్ సచివాలయంలో మంత్రి బీసీ జనార్దనరెడ్డిని కలిసి చర్చించారు. ఫ్లైట్ డైనమిక్స్, కంట్రోల్ సిస్టమ్ హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ రూపకల్పనలో తమకు అనుభవం ఉందని మంత్రికి సంస్థ ప్రతినిధులు వివరించారు. రాష్ట్రంలో వ్యవసాయ రంగంలో డ్రోన్ టెక్నాలజీ వినియోగం, ఉత్పత్తి యూనిట్ ఏర్పాటుకు తాము సిద్ధంగా ఉన్నామని మంత్రికి తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సమర్థ నాయకత్వంపై నమ్మకంతో పెట్డుబడులు పెట్టేందుకు పలు సంస్థలు ముందుకు వస్తున్నాయని ఈ సందర్భంగా మంత్రి జనార్దనరెడ్డి చెప్పారు. సుస్థిర ప్రభుత్వం, బలమైన నాయకత్వం కారణంగా రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయన్నారు. పెట్టుబడిదారులకు ప్రభుత్వం పూర్తి బాసటగా ఉంటుందన్నారు. భవిష్యత్తులో రాష్ట్రం ఏరోస్పేస్ హబ్‌గా నిలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఏవియేషన్ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రముఖ సంస్థలు ఆసక్తిని చూపడంపై మంత్రి సంతోషం వ్యక్తం చేశారు.