ఇద్దరు నిందితుల అరెస్టు
ABN , Publish Date - Mar 21 , 2025 | 12:54 AM
బాలికపై సామూహిక అత్యాచారం కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. మరో ఐదుగురు నిందితుల కోసం గాలింపు ముమ్మరం చేశారు. ఈ కేసు వివరాలను గన్నవరం పోలీస్ స్టేషన్‌లో ఎస్పీ ఆర్.గంగాధరరావు గురువారం మీడియాకు వెల్లడించారు.

-మరో ఐదుగురి కోసం గాలింపు
-బాలికపై సామూహిక అత్యాచారం కేసులో చర్యలు తీసుకున్న పోలీసులు
-మూడు రోజుల పాటు బాలికపై అత్యాచారానికి పాల్పడినట్టు నిర్ధారణ
-కేసు వివరాలు వెల్లడించిన ఎస్పీ గంగాధరరావు
గన్నవరం/మచిలీపట్నం టౌన్, మార్చి 20 (ఆంధ్రజ్యోతి): బాలికపై సామూహిక అత్యాచారం కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. మరో ఐదుగురు నిందితుల కోసం గాలింపు ముమ్మరం చేశారు. ఈ కేసు వివరాలను గన్నవరం పోలీస్ స్టేషన్‌లో ఎస్పీ ఆర్.గంగాధరరావు గురువారం మీడియాకు వెల్లడించారు. ఆయన మాటల్లో... గన్నవరం మండలం వీరపనేనిగూడేనికి చెందిన యువతికి జి.కొండూరుకు చెందిన వ్యక్తితో వివాహం జరిపించారు. అక్కడ వారి ఇంటి పక్కన ఉండే బాలిక వీరి పిల్లలతో చనువుగా ఉండేది. చదువు మానేసి ఇంటి దగ్గరే ఉంటుంది. ఈ నేపథ్యంలో వీరపనేనిగూడెంలో అంజమ్మ, సుబ్బమ్మ, పేరంటాలమ్మ తిరునాళ జరిగింది. దీనికి ఆ మహిళ పిల్లలతో కలసి స్వగ్రామానికి వస్తుండగా నేను వస్తానని సదరు బాలిక అనడంతో బాలిక తండ్రి వద్దని చెప్పారు. వెళతానని మొండికేయడంతో రూ.200 ఇచ్చి ఆ మహిళతో పాటు పంపించారు. ఈ నెల 9వ తేదీన వీరపనేనిగూడెం వచ్చారు. నాలుగు రోజుల తరువాత ఆ మహిళ ఇంట్లో గొడవ జరిగింది. ఈ గొడవకు కారణం నువ్వేనని, మీ నాన్నతో చెబుతానని బాలికను మహిళ తల్లి మందలించింది. నాన్నతో చెబితే కొడతాడని భయపడిన బాలిక ఇంట్లో నుంచి ఈ నెల 13వ తేదీ రాత్రి 10.30 గంటలకు బయటకు వచ్చింది. సగర్లపేటలోని నాలుగు రోడ్ల సెంటర్‌కు రాగానే పక్కనే ఉన్న వెంచర్‌లో కొందరు యువకులు మద్యం తాగుతున్నారు. వారి వద్దకు వెళ్లి జరిగిన విషయం చెప్పింది. ఆ యువకులు ఆ బాలికను ద్విచక్ర వాహనంపై తీసుకుని కేసరపల్లిలో వారి స్నేహితుడి సహాయంతో ఒక ఇంట్లో పెట్టారు. ఒకరి తర్వాత మరొకరు చొప్పున ఏడుగురు ఆ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. సదరు మహిళకు రెండు రోజుల తర్వాత అనుమానం వచ్చి బాలిక ఇంటికి వెళ్లిందా లేదా అని ఆరా తీసింది. జి.కొండూరు రాలేదని తెలియడంతో ఆత్కూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఎనిమిది బృందాలతో గాలింపు చేపట్టారు. ఆపరేషన్ పేరిట వాట్సాప్ గ్రూపును క్రియేట్ చేసి లుక్ అవుట్ నోటీసులను రాష్ట్రవ్యాప్తంగా పంపించారు. బాలిక కలర్ ఫొటోను అన్ని పోలీస్ స్టేషన్‌లకు పంపించారు. సాంకేతిక పరిజ్ఞానం, డ్రోన్‌లను ఉపయోగించి ఆత్కూరు, వీరపనేనిగూడెం ప్రాంతాల్లో గాలింపు చేపట్టారు. కలెక్టర్ దృష్టిలో పెట్టి జిల్లాలోని అన్ని సచివాలయాల గ్రూపుల్లో, ఆశా వర్కర్లు, డ్వాక్రా గ్రూపుల్లో బాలిక ఫొటోను వైరల్ చేశారు. ఈ నేపథ్యంలో ఈ నెల 17వ తేదీ రాత్రి బాలికను ఆటో డ్రైవర్ మాచవరం పోలీస్ స్టేషన్‌లో అప్పగించారు. సమాచారం అందుకున్న స్థానిక ఎస్‌ఐ, బాలిక తల్లిదండ్రులు అక్కడికి వెళ్లి బాలికను పెద్ద ఆవుటపల్లిలోని బంధువుల ఇంటికి తీసుకువెళ్లారు. బాలికకు కడుపులో నొప్పి వస్తున్నట్లు తల్లికి చెప్పగా, ఆమె ఆత్కూరు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే విజయవాడ ప్రభుత్వాస్పత్రికి పంపించారు. మహిళా ఎస్సై సమక్షంలో బాలిక తనపై కొంతమంది అత్యాచారం చేసినట్లు చెప్పగా స్టేట్మెంట్ రికార్డు చేశారు. ఆ రాత్రి బాలికను కేసరపల్లి తీసుకెళ్లి మూడు రోజుల పాటు ఉంచారు. ఆరుగురు యువకులు, ఒకరు మైనర్ బాలుడు బాలికపై అత్యాచారం చేశారు. మూడు రోజుల అనంతరం బాలికను విజయవాడలో దింపారు. అక్కడ బాలిక ఆటో ఆపి విజయవాడ వెళ్లాలి అని చెప్పటంతో డ్రైవర్‌కు అనుమానం వచ్చి పోలీసులకు అప్పగించారు. ఈ కేసులో నిందితులు బాణావతు లక్ష్మణ జితేంద్ర, పగడాల హర్షవర్ధన్‌ను అరెస్టు చేశారు. మరో ఐదుగురి కోసం గాలిస్తున్నారు. మీడియా సమావేశంలో డీఎస్పీ చలసాని శ్రీనివాసరావు, ఎస్సై శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.