Guntur: పెరుగుతున్న స్క్రబ్ టైఫస్ కేసులు
ABN , Publish Date - Dec 14 , 2025 | 05:18 AM
రాష్ట్ర వ్యాప్తంగా స్క్రబ్ టైఫస్ జ్వర కేసులు పెరుగుతున్నాయి. గుంటూరు జిల్లాతోపాటు ఇతర జిల్లాలకు చెందిన బాధితులు పెద్ద సంఖ్యలో గుంటూరు...
గుంటూరు జీజీహెచ్‌లో 22 మందికి చికిత్స
ముగ్గురి పరిస్థితి విషమం.. ఐసీయూకి తరలింపు
జ్వరంతో వచ్చిన వారందరికీ స్క్రబ్ టైఫస్ పరీక్షలు: సూపరింటెండెంట్
గుంటూరు మెడికల్, డిసెంబరు 13(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర వ్యాప్తంగా స్క్రబ్ టైఫస్ జ్వర కేసులు పెరుగుతున్నాయి. గుంటూరు జిల్లాతోపాటు ఇతర జిల్లాలకు చెందిన బాధితులు పెద్ద సంఖ్యలో గుంటూరు ప్రభుత్వ సమగ్రాస్పత్రి (జీజీహెచ్)లో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఇక్కడ 22 మందికి చికిత్స అందిస్తున్నారు. వీరిలో ముగ్గురి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో ఐసీయూలో ఉంచారు. ఆసుపత్రి బీ క్లాస్ విభాగంలో 14 పడకలతో స్క్రబ్ టైఫస్ రోగుల కోసం ప్రత్యేక వార్డును ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ వార్డు మొత్తం రోగులతో నిండిపోయింది. ఇంకా మిగిలిన వారిని ఇతర వార్డుల్లో ఉంచి పర్యవేక్షిస్తున్నారు. చికిత్సల కోసం వస్తున్న జ్వర బాధితులందరికీ స్క్రబ్ టైఫస్ నిర్ధారణ పరీక్షలు చేయిస్తున్నట్లు సూపరింటెండెంట్ డాక్టర్ రమణ యశస్వి తెలిపారు. అదేవిధంగా మలేరియా, డెంగీ పరీక్షలు కూడా చేయిస్తున్నామని వెల్లడించారు. జిల్లాలో పలు చోట్ల పారిశుధ్యం క్షీణించి.. స్క్రబ్ టైఫస్ కారక చిగ్గర్ మైట్స్ (పేడ పురుగులు) సంఖ్య బాగా పెరిగినట్లు వైద్య వర్గాలు అంచనా వేస్తున్నాయి. పెరిగిన మైట్స్ వల్ల పలువురు ఈ జ్వరాల బారిన పడుతున్నారు.