Share News

CM Chandrababu: ప్రతి చెరువూ నింపుతాం

ABN , Publish Date - Aug 31 , 2025 | 04:30 AM

రాయలసీమ అభివృద్ధికి బ్లూ ప్రింట్‌ సిద్ధం చేశామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. రాయలసీమను రతనాల సీమగా మారుస్తానని ముందే మాటిచ్చానని గుర్తుచేశారు.

CM Chandrababu: ప్రతి చెరువూ నింపుతాం

  • సీమ అభివృద్ధికి బ్లూప్రింట్‌

  • రతనాల సీమగా మారుస్తానని ముందే చెప్పా: సీఎం

  • ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా నా సంకల్పాన్ని అడ్డుకోలేరు

  • ఏ పని కావాలన్నా వెంకన్నపై భారమేసి బుల్లెట్‌లా దూసుకెళ్తా

  • పోలవరం, బనకచర్ల ప్రాజెక్టుల పూర్తి,వంశధార-పెన్నా అనుసంధానం నా జీవితాశయం

  • కుప్పానికి కృష్ణమ్మ రాకతో మనసు పులకించింది

  • కృష్ణా పుష్కరాలు రెండేళ్ల ముందే వచ్చినట్లుంది

  • హంద్రీ-నీవాకు 1999లో నేనే శంకుస్థాపన చేశా

  • రెండు దశల్లో 6 లక్షల ఎకరాలకు సాగునీరు

  • 33 లక్షల మందికి తాగునీరు కూడా: చంద్రబాబు

  • కుప్పంలో కృష్ణమ్మకు జలహారతి

ఎవరిది అరాచక రాజకీయమో, ఎవరిది అభివృద్ధి రాజకీయమో ప్రజలే తేల్చుకుంటారు. పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం.. వైసీపీకి నూకలు చెల్లిపోయాయనడానికి సంకేతం.

-చంద్రబాబు

గోదావరి నుంచి 1,630 టీఎంసీలు, కృష్ణా నదిలో 600 టీఎంసీల నీళ్లు సముద్రంలోకి వృధాగా పోయాయి. అలా పోతున్న జలాలను రెండు తెలుగు రాష్ట్రాలూ సమర్థంగా ఉపయోగించుకోగలిగితే ప్రతి ఎకరాకు నీరు అందుతుంది.

పోలవరం, బనకచర్ల ప్రాజెక్టులను పూర్తి చేసి.. వంశధార నుంచి పెన్నా వరకు నదుల అనుసంధానం చేయగలిగితే రాష్ట్రంలో కరువనేది ఉండదు. అదే నా జీవితాశయం.

- సీఎం చంద్రబాబు

కుప్పం, ఆగస్టు 30 (ఆంధ్రజ్యోతి): రాయలసీమ అభివృద్ధికి బ్లూ ప్రింట్‌ సిద్ధం చేశామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. రాయలసీమను రతనాల సీమగా మారుస్తానని ముందే మాటిచ్చానని గుర్తుచేశారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా తన సంకల్పాన్ని అడ్డుకోలేరని స్పష్టం చేశారు. హంద్రీ-నీవా, గాలేరు-నగరి సుజల స్రవంతి పథకాలను పూర్తి చేసి అన్ని నియోజకవర్గాలకూ నీళ్లిస్తామని తెలిపారు. హంద్రీ-నీవా కాలువ నుంచి కుప్పం బ్రాంచ్‌ కెనాల్‌కు చెందిన చిట్టచివరి చెరువు, కుప్పం పట్టణంలోని పరమసముద్రం చెరువుకు కృష్ణా జలాలు వచ్చిన సందర్భంగా శనివారం ఆయన జలహారతి ఇచ్చారు. అక్కడే పైలాన్‌ను ఆవిష్కరించారు. ఆ సమీపంలో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో ప్రసంగించారు.

Untitled-5 copy.jpg


‘కుప్పానికి కృష్ణమ్మ రాకతో రెండేళ్లకు ముందే కృష్ణా పుష్కరాలు వచ్చినట్లుగా ఉంది. కృష్ణమ్మ పరవళ్లు చూసి నా మనసు పులకించిపోయింది. నా జీవితంలో ఇది పవిత్రమైన రోజు. రాష్ట్రంలో నదులన్నింటినీ అనుసంధానం చేసి కరువు లేకుండా చేయడమే నా జీవితాశయం’ అని సీఎం తెలిపారు. 1999లో హంద్రీ-నీవాకు తానే శంకుస్థాపన చేశానని గుర్తుచేశారు. ఇప్పుడు 2025లో.. శ్రీశైలం మల్లన్న వద్ద నుంచి కుప్పంలోని కంగుంది మల్లన్న వరకు నీళ్లు వచ్చాయని ఆనందంతో చెప్పారు. కుప్పంలోని గంగమ్మ తల్లి.. కృష్ణమ్మ తల్లిని కుప్పానికి తీసుకొచ్చిందని.. పరమసముద్రంలో నీటిని చూసి తన మనసు ఉప్పొంగిపోయిందన్నారు. ‘మల్యాలలో ప్రారంభమై.. 27 ఎత్తిపోతల ద్వారా.. పలు సొరంగాల గుండా.. 738 కిలోమీటర్లు ప్రయాణించి.. కుప్పంలోని పరమసముద్రం చెరువు వరకు కృష్ణా జలాలు తరలివచ్చాయి. ఇది సాధారణ విషయం కాదు’ అని స్పష్టంచేశారు. ఇది తన జీవితంలో మరచిపోలేనిదన్నారు. వైసీపీకి చేతనైతే అభివృద్ధిలో, సంక్షేమంలో పోటీ పడాలన్నారు. ఇంకా ఏమన్నారంటే..


అందుకే కాటన్‌ దొర విగ్రహాలు..

మనల్ని పాలించడానికి వచ్చిన బ్రిటిష్‌ కాటన్‌ దొర గోదావరి వృధా జలాల సద్వినియోగానికి ధవళేశ్వరం, ప్రకాశం బ్యారేజీ కట్టాడు. దీంతో సంబంధిత డెల్టా జిల్లాల పరిస్థితి మారిపోయింది. అక్కడి ప్రజలకు నీటి విలువ తెలుసు. అందుకే కాటన్‌ను ఇప్పటికీ గుర్తు పెట్టుకుంటున్నారు. విగ్రహాలు పెడతారు.

మళ్లీ రతనాల సీమగా..

మన నాయకుడు ఎన్టీఆర్‌ సీఎంగా ఉన్నప్పుడు కృష్ణాజలాలు వృధాగా సముద్రంలోకి వెళ్లకుండా రాయలసీమకు తీసుకురావాలని సంకల్పించారు. మా ఇంటి ఇలవేల్పు వేంకటేశ్వరస్వామి. ఏ పని కావాలన్నా ఆయన మీద భారం వేసి బుల్లెట్‌లా దూసుకెళ్తా. రాయలసీమను మళ్లీ రతనాల సీమగా మారుస్తానని ముందుగానే మాటిచ్చా. సీమ ప్రాజెక్టులకు 2014-19లో రూ.12,500 కోట్లు ఖర్చు పెట్టాం. వైసీపీ ప్రభుత్వం రూ.2 వేల కోట్లు మాత్రమే ఖర్చు పెట్టింది. ఈ ప్రాంతంలో హార్టికల్చర్‌కు ప్రాధాన్యమిచ్చి ప్రపంచానికే పండ్లను సరఫరా చేసేలా తయారుచేస్తాం.


అవి సినిమా సెట్టింగులు

ఎన్నికలకు ముందు సినిమాల్లో మాదిరిగా సెట్టింగులు వేసి బయటి నుంచి కుప్పానికి నీళ్లు తెచ్చి నాటకాలాడి జగన్‌ అభాసుపాలయ్యారు. మేమలా కాదు. ప్రతి చెరువుకూ నీళ్లిచ్చే బాధ్యత నాదీ. 2019లో మిగిలిపోయిన 20 శాతం పనులను వైసీపీ పూర్తి చేయలేదు. ఇప్పుడు రూ.3,850 కోట్లిచ్చి పనులు చేయించి కుప్పం దాకా నీళ్లు తెచ్చా. పలమనేరు, కుప్పం నియోజకవర్గాల్లో 110 చెరువులకు నీరిస్తున్నాం. హంద్రీ-నీవా రెండు దశల్లో 6 లక్షల ఎకరాలకు సాగునీరు, 33 లక్షల మందికి తాగునీరు, పరిశ్రమలకు నీళ్లు అందుతాయి. ఫేజ్‌-1లో 2 లక్షల ఎకరాలకు, ఫేజ్‌ 2 కింద 4 లక్షల ఎకరాలకు నీరు అందుతుంది. కర్నూలులో కృష్ణగిరి, పత్తికొండ, అనంతపురంలో జీడీపల్లి రిజర్వాయర్లు నింపాం. పెన్నహోబిలం బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌కు 4 టీఎంసీలు తరలించాం. శ్రీ సత్యసాయి జిల్లాలో మారాల, గొల్లపల్లె, చెర్లోపల్లె, అన్నమయ్య జిల్లాలో శ్రీనివాసపురం, అడవిపల్లె రిజర్వాయర్లకు వచ్చే ఏడాది నీరిస్తాం. అప్పుడే చిత్తూరుకు కూడా నీళ్లిచ్చే బాధ్యత తీసుకుంటాం. కుప్పం బ్రాంచ్‌ కెనాల్‌కు లైనింగ్‌ పూర్తి చేశాం. రాష్ట్రంలో ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వగలిగితే నా జన్మ ధన్యమవుతుంది. దీనికోసం నదులు అనుసంధానం చేయాలి. 45 ఏళ్ల రాజకీయ జీవితంలో పరిగెత్తే నీటిని నడిపించడానికి, నడిచే నీటిని నిలబెట్టడానికి, నిలబెట్టిన నీటిని భూమిలో ఇంకించేందుకు అనేక ప్రయత్నాలు చేశా.


2027లో పోలవరం జాతికి అంకితం..

2027కి పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేస్తా. ఎప్పుడో పూర్తి కావలసిన ప్రాజెక్టు. 2019లో టీడీపీ గెలిచి ఉంటే 2020లో పూర్తయ్యేది. ఏడేళ్లు ఆలస్యమైంది. రాజకీయ కక్షతో డయాఫ్రం వాల్‌ను రక్షించకపోవడంతో అది కొట్టుకుపోయింది. మళ్లీ రూ.వెయ్యి కోట్లు ఖర్చు చేయాల్సి వస్తోంది. ప్రశాంతమైన కుప్పంలో వైసీపీ నేతలు రప్పారప్పా రాజకీయం చేయాలని చూశారు. దీనికి బదులుగా మేం పులివెందులకు నీళ్లిచ్చాం. రాజకీయమంటే అభివృద్ధి, సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు సేవ చేయడం తప్ప రప్పారప్పా రాజకీయం కాదు.


అభినవ రాయలు చంద్రబాబు: నిమ్మల

‘ఆనాడు శ్రీకృష్ణ దేవరాయలు రాయలసీమను రతనాల సీమగా చేస్తే.. ఈనాటి అభినవ రాయలైన ముఖ్యమంత్రి చంద్రబాబు కృష్ణమ్మ జలాలను కరువు రాయలసీమకు తీసకొచ్చి పాడిపంటల సీమగా మార్చారు’ అని జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. కుప్పం బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. హంద్రీ-నీవా కాలువను ఆసియాలోనే అతిపెద్ద కాలువగా అభివర్ణించారు. ఎంతో కష్టమైన కార్యాన్ని కష్టనష్టాలకోర్చి పూర్తిచేసిన ఘనత చంద్రబాబుకు దక్కుతుందన్నారు. రాయలసీమకు తీరని ద్రోహం చేసిన పాలకుడిగా జగన్‌ మిగిలిపోయారని విమర్శించారు.


ఆరు కంపెనీలతో ఎంవోయూలు

ముఖ్యమంత్రి కుప్పం పట్టణాభివృద్ధి సంస్థ తరఫున ఆరు కంపెనీలతో ఎంవోయూలు కుదుర్చుకున్నారు. చెత్త నుంచి సంపద తయారు చేసేందుకు ఏజీఎస్‌ ఐటీసీ.. మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు షీలీడ్స్‌.. ఫైబర్‌ బోర్డు ఉత్పత్తి కోసం కింగ్స్‌ ఉడ్‌ డెకార్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, 2 సీటర్‌ ట్రైనింగ్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ తయారీ యూనిట్‌ ఏర్పాటు చేసే పయనీర్‌ క్లీన్‌ యాంప్స్‌ లిమిటెడ్‌.. స్పేస్‌ టెక్నాలజీ సంస్థ ఎతెరియల్‌ ఎక్స్‌ప్లొరేషన్‌ గిల్డ్‌.. అగ్రిటెక్‌, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ హబ్‌ ఏర్పాటుకు రెడ్‌ బెర్రీ పుడ్‌ లాజిక్స్‌ కంపెనీలతో ఒప్పందాలు కుదిరాయి.

పంచెకట్టులో బాబు

చంద్రబాబు ఎప్పటిలా కాకుండా భిన్నంగా కనిపించారు, వ్యవహరించారు. శాంతిపురం మండలంలో ఇటీవలి స్వగృహ ప్రవేశంలో తప్ప ఆయన కుప్పం ప్రజలకు ఏ కార్యక్రమంలోనూ పంచెకట్టులో కనిపించలేదు. ఇప్పుడు జలహారతి సమయంలోనే గాక.. బహిరంగ సభలో కూడా పంచెకట్టు, చొక్కాతోనే పాల్గొన్నారు. తెలుగు సంప్రదాయంలో గంగమ్మను పూజించుకోవడమే కాక, సంప్రదాయ దుస్తులను పర్యటన ఆద్యంతం ధరించడం విశేషంగా ప్రజలు చెప్పుకొన్నారు. ఆయన ప్రసంగంలో జలాలు.. పొలాలు.. హలాలు.. అడుగడుగునా పలకరించాయి.

Updated Date - Aug 31 , 2025 | 04:39 AM