Political Dispute: తిరువూరులో రచ్చ
ABN , Publish Date - Oct 24 , 2025 | 03:23 AM
ఎన్టీఆర్ జిల్లాలో కీలక టీడీపీ నేతలు వీధికెక్కారు. మీడియాలోనే గాక సోషల్ మీడియాలో కూడా ఆరోపణలు, ప్రత్యారోపణలతో రచ్చచేశారు.
ఎంపీ కేశినేని చిన్ని X ఎమ్మెల్యే కొలికపూడి
2024 ఎన్నికల్లో టికెట్‌కు చిన్ని 5 కోట్లు అడిగారని కొలికపూడి ఆరోపణలు
నా డబ్బులు ఖర్చు చేస్తానే తప్ప వసూలు చేయను.. కొలికపూడి వైసీపీ కోవర్టు: ఎంపీ
వైసీపీ నాయకులతో ఆయనే వ్యాపారాలు చేస్తున్నారని ఎమ్మెల్యే ధ్వజం
నియోజకవర్గంలో వేర్వేరుగా కార్యక్రమాలు.. మీడియా, సోషల్ మీడియాలో రచ్చ రచ్చ
విజయవాడ, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): ఎన్టీఆర్ జిల్లాలో కీలక టీడీపీ నేతలు వీధికెక్కారు. మీడియాలోనే గాక సోషల్ మీడియాలో కూడా ఆరోపణలు, ప్రత్యారోపణలతో రచ్చచేశారు. పార్టీ ప్రతిష్ఠ బజారునపడేశారని సీఎం చంద్రబాబుపై ఇద్దరిపైనా మండిపడ్డారు. ఎంపీ కేశినేని శివనాథ్, తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మధ్య గత కొన్నాళ్లుగా పొసగడం లేదు. పదవుల పంపకాల్లో విభేదాలతో తాజాగా బహిరంగ విమర్శలకు దిగారు. గురువారం తిరువూరు నియోజకవర్గంలో ఇద్దరూ వేర్వేరుగా పోటాపోటీ కార్యక్రమాలు నిర్వహించారు. దీనికి రెండ్రోజుల ముందు.. ఎంపీ కార్యాలయంలో పనిచేస్తున్న కిశోర్.. తన నియోజకవర్గంలో పదవుల పంపకాలకు డబ్బులు వసూలు చేశారని కొలికపూడి ఆరోపించారు. మర్నాడు వీటిపై ఎంపీ చిన్ని ఓ మీడియా చానల్‌తో ప్రత్యేకంగా మాట్లాడారు. వైసీపీ కోవర్టులకు చచ్చినా పదవులు ఇవ్వబోమని, తాను డబ్బులు వసూలు చేశానో లేదో తిరువూరు ప్రజలకు తెలుసని వ్యాఖ్యానించారు. గురువారం నియోజకవర్గంలో ఉభయులూ వేర్వేరు కార్యక్రమాల్లో పరస్పరం ఆరోపణలు చేసుకోవడంతో వాతావరణం వేడెక్కింది. కొలికపూడి ముందుగా తన పీఏ ద్వారా ఎంపీ కేశినేనిపై తీవ్ర ఆరోపణలు చేస్తూ ప్రకటన విడుదల చేశారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో తిరువూరు టీడీపీ టికెట్ తనకు కేటాయించినప్పుడు చిన్ని తనను రూ.5 కోట్లు అడిగారని ఆరోపించారు. ‘2024 ఫిబ్రవరి 7న రూ. 20 లక్షలు, ఫిబ్రవరి 8న రూ.20 లక్షలు, ఫిబ్రవరి 14న రూ.20 లక్షలు చొప్పున చెల్లించాను. ఆ తర్వాత పోరంకిలో చిన్ని పీఏకు రూ.50 లక్షలు ఇచ్చాను. గొల్లపూడిలోని తన స్నేహితులు రూ.3.50 కోట్లు చెల్లించారు’ అని అందులో పేర్కొన్నారు.
ఇందుకు ఆధారంగా కొన్ని బ్యాంకు స్టేట్‌మెంట్లు విడుదల చేశారు. డబ్బులు తీసుకుని పదవులు ఇచ్చారని కూడా ఆరోపించారు. దీనిపై నియోజకవర్గ పర్యటనలో ఉన్న కేశినేని శివనాథ్ తక్షణం స్పందించారు. విజయవాడ ఉత్సవ్ వంటి కార్యక్రమాన్ని సొంత డబ్బుతో నిర్వహించానని.. అలాంటిది తిరువూరులో ఐదు లక్షలకు, పది లక్షలకు పదవులు ఇచ్చానంటే ప్రజలెవరూ నమ్మరని స్పష్టంచేశారు. కొలికిపూడి వైసీపీ కోవర్టు అని బాంబు పేల్చారు. పొద్దునే పేర్ని నానితో, మధ్యాహ్నం దేవినేని అవినాశ్‌తో, సాయంత్రి కేశినేని నానితో, రాత్రికి స్వామిదా్‌సతో తాను కాపురం చేయడం లేదని ఎద్దేవాచేశారు. ‘నాకు టీడీపీ కార్యకర్తలు మాత్రమే తెలుసు. నా కోసం పోరాడేవారిని మధ్య సముద్రంలో వదిలేసి వైసీపీ నాయకులతో చెట్టపట్టాలు వేసుకుని తిరగను. కేశినేని నాని గతంలో తెలుగుదేశంలో ఉండగా.. ఆయన ఫొటో పెట్టుకుని ఉంటే తప్పులేదు. కానీ మా అధినేత చంద్రబాబు, యువనేత లోకేశ్‌లపై ఎన్నికల సమయంలో దారుణంగా వ్యాఖ్యలు చేసిన కేశినేని నాని మా అందరికీ శత్రువే. అలాంటి వ్యక్తి ఫొటోను ఈ కాలంలో పెట్టుకునే వారు కూడా మాకు శత్రువులే. వైసీపీ కోవర్టులకు చచ్చినా పదవులివ్వం. మేం కరడుగట్టిన టీడీపీ నాయకులం. చిన్ని నికార్సయిన, నిజాయితీపరుడైన తెలుగుదేశం కార్యకర్త’ అని అన్నారు. ఆయన వ్యాఖ్యలపై కొలికిపూడి కూడా స్పందించారు. తన వాట్సాప్ స్టేట్‌సలో.. ‘నేను జగన్ మీద పోరాటం చేసి రాజకీయాలలోకి వచ్చాను. కసిరెడ్డి, చెవిరెడ్డి ఇచ్చిన లిక్కర్ డబ్బుతో రాలేదు’ అని పోస్టు చేశారు. దీంతో పాటు తన అనుచరుల ద్వారా ఎంపీపై సోషల్ మీడియాలో మరిన్ని ఆరోపణలు చేయించారు.
హైదరాబాద్ ప్రగతి నగర్‌లో ప్రీలాంచింగ్ పేరుతో రూ.150 కోట్లు వసూలు చేసి ఒక్క అపార్ట్‌మెంట్ కూడా కట్టలేదని.. ప్రభుత్వ స్థలంలో వెంచర్ పేరుతో మోసం చేశారని, అమాయకులు కేసు వేస్తే తప్పించుకుని తిరుగుతున్నారని.. తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ భూమి అని బోర్డు పెట్టిందని చెప్పారు. నందిగామ, తిరువూరు, జగ్గయ్యపేటలో ఎంపీ ఇసుక వ్యాపారం చేయిస్తున్నారని, గంజాయి వ్యాపారం చేయిస్తుంటే అడ్డుకోవడానికి తాను ర్యాలీ చేశానని, పేకాట క్లబ్బులు కూడా నడుపుతున్నారని ఆరోపణలు చేయించారు. చిన్ని మనుషులు ఢిల్లీ, హైదరాబాద్‌లోనూ పేకాట ఆడిస్తున్నట్టుగా తన నియోజకవర్గంలో ఆడించడానికి అంగీకరించేది లేదన్నారు. వైసీపీ నేతలతో ప్రత్యక్ష, పరోక్ష సంబంధాలు నెరపుతున్నారని.. వారితో కలిసి వ్యాపారాలు చేస్తున్నారని కూడా ఆరోపణలు చేయించారు. ఈ ఆరోపణలు, ప్రత్యారోపణలతో తిరువూరు నియోజకవర్గం గురువారం అట్టుడికింది. సీనియర్ నేతలు రచ్చకెక్కడంతో టీడీపీ నాయకత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. కేంద్ర కార్యాలయానికి రావాలని ఇద్దరినీ ఆదేశించింది. కానీ సీఎం చంద్రబాబు ఆదేశాలతో ఈ భేటీని చివరి నిమిషంలో రద్దుచేశారు.