Share News

Sahitya Akademi Award: తుర్లపాటి రాజేశ్వరికి కేంద్ర సాహిత్య అకాడమి పురస్కారం

ABN , Publish Date - Oct 25 , 2025 | 06:21 AM

ప్రముఖ రచయిత్రి తుర్లపాటి రాజేశ్వరి కేంద్ర సాహిత్య అకాడమి అనువాద పురస్కారం అందుకున్నారు.

Sahitya Akademi Award: తుర్లపాటి రాజేశ్వరికి  కేంద్ర సాహిత్య అకాడమి పురస్కారం

న్యూఢిల్లీ, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ రచయిత్రి తుర్లపాటి రాజేశ్వరి కేంద్ర సాహిత్య అకాడమి అనువాద పురస్కారం అందుకున్నారు. కోల్‌కతాలోని జాతీయ లైబ్రరీలోని శ్యామ ప్రసాద్‌ ముఖర్జీ ఆడిటోరియంలో అకాడమి అధ్యక్షుడు మాధవ్‌ కౌశిక్‌.. శుక్రవారం రాజేశ్వరిని రూ.50 వేల నగదు, తామ్రపత్రంతో సత్కరించారు. సుప్రసిద్ధ ఒడియా రచయిత గోపీనాథ మహంతి రచించిన దాడిబుధ అనే నవలను ఈతచెట్టు దేవుడు అన్న పేరుతో రాజేశ్వరి అనువదించారు. ఒడిశాలోని కోరాపుట్‌ జిల్లాలోని లుల్లా గ్రామంలో జరిగిన కథతో రూపొందిన ఈ నవల, అడవిలో అడవి జంతువుల ముప్పు మధ్య నివసిస్తున్న గిరిజన వర్గాల జీవితాలను, నమ్మకాలను చిత్రీకరిస్తుంది. 1947 ఆగస్టు 10న కృష్ణా జిల్లా గుడ్లవల్లేరులో జన్మించిన రాజేశ్వరి దాదాపు 5 దశాబ్దాలుగా బరంపురంలో స్థిరపడి పలు ఒడియా రచనల్ని తెలుగులో అనువదించారు. కవిత్వం, అనువాదాలు, వ్యాసాలు, పరిశోధనా రచనలు చేశారు. ఈతచెట్టు దేవుడుకు తెలుగులో అనువాద బహుమతిని ప్రదానం చేయడం సాహిత్య అకాడమికే గర్వకారణమని అకాడమి కార్యదర్శి కృత్తివెంటి శ్రీనివాసరావు తెలిపారు.

Updated Date - Oct 25 , 2025 | 06:22 AM