Guntur: తురకా కిశోర్ మళ్లీ అరెస్టు
ABN , Publish Date - Jul 31 , 2025 | 04:44 AM
పల్నాడు జిల్లా మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రధాన అనుచరుడు, రౌడీ షీటర్, మాచర్ల మున్సిపాలిటీ మాజీ చైర్మన్ తురకా కిశోర్ బుధవారం గుంటూరు జిల్లా జైలు నుంచి విడుదలయ్యాడు.
జైలు నుంచి రాగానే అదుపులోకి రౌడీషీటర్
గత ఏడాది ఏప్రిల్లో టీడీపీ నేత సిద్ధయ్యపై కిశోర్ దాడి...బాధితుడి ఫిర్యాదుతో కేసు
గుంటూరు/రెంటచింతల, జూలై 30 (ఆంధ్రజ్యోతి): పల్నాడు జిల్లా మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రధాన అనుచరుడు, రౌడీ షీటర్, మాచర్ల మున్సిపాలిటీ మాజీ చైర్మన్ తురకా కిశోర్ బుధవారం గుంటూరు జిల్లా జైలు నుంచి విడుదలయ్యాడు. అయితే జైలు నుంచి బయటకు అడుగుపెట్టగానే హత్యాయత్నం కేసులో రెంటచింతల పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఎన్నికలకు ముందు గత ఏడాది ఏప్రిల్ 8న రెంటచింతల బస్టాండ్ సమీపంలో టీడీపీ నేత సన్నెగంటి సిద్ధయ్య కరపత్రాలు పంచుతూ.. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డికి ఓటేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థిస్తుండగా కిశోర్ అడ్డుకున్నాడు. ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. కిశోర్ మారణాయుధంతో దాడి చేసి సిద్దయ్యను తీవ్రంగా గాయపరిచాడు. నాడు వైసీపీ అధికారంలో ఉండడంతో ఫిర్యాదు చేయడానికి సిద్ధయ్య భయపడ్డాడు. ఈ ఘటనపై తాజాగా రెంటచింతల పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీనిపై మంగళవారం రాత్రి కిశోర్‌పై ఐపీసీ 307 సెక్షన్ కింద హత్యాయత్నం కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ సీహెచ్ నాగార్జున చెప్పారు. బుధవారం గుంటూరు జిల్లా జైలు నుంచి బయటకు వచ్చిన కిశోర్‌ను వెంటనే ఈ కేసులో పోలీసులు అదుపులోకి తీసుకుని వాహనం ఎక్కించారు. అయితే అప్పటికే కిశోర్ భార్య సురేఖ తన ఇద్దరు పిల్లలు, కుటుంబ సభ్యులు, వైసీపీ ఎమ్మెల్సీ చంద్రగిరి ఏసురత్నం, వైసీపీ నాయకులతో అక్కడకు చేరుకున్నారు. పోలీసు వాహనానికి వారంతా అడ్డుపడి హల్‌చల్ చేశారు. తన భర్తను వదిలివేయాలని, కేసు మీద కేసు పెట్టి బయటకు రాకుండా అరెస్టు చేస్తున్నారని సురేఖ ఆగ్రహం వ్యక్తంచేశారు.
బుద్దా వెంకన్న, బొండాపై హత్యాయత్నం వీడియో వైరల్
జగన్ హయాంలో స్థానిక ఎన్నికల సందర్భంగా మాచర్ల వెళ్లిన టీడీపీనేతలు బుద్దా వెంకన్న, బొండా ఉమా వాహనంపై తురకా కిశోర్ దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జిల్లా జైలు వద్ద కిశోర్ కుటుంబ సభ్యులు చేసిన హంగామా తాలూకు వీడియోకు ఆనాటి అతడి అరాచకం వీడియోను ట్యాగ్ చేసి నెటిజెన్లు కామెంట్లు పెడుతున్నారు.
కిశోర్‌పై ఎన్ని కేసులున్నాయ్?
వివరాలతో అఫిడవిట్ వేయండి
పల్నాడు జిల్లా ఎస్పీకి హైకోర్టు ఆదేశం
వైసీపీ నేత తురకా కిశోర్‌పై ఎన్ని కేసులు నమోదయ్యాయో వివరాలు తమ ముందుంచాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. ఘటనలు ఎప్పుడు జరిగాయి.. ఎప్పుడు ఫిర్యాదులు అందాయి.. ఎప్పుడు అరెస్టు చేశారు.. తదితర వివరాలను పట్టిక రూపంలో సమర్పించాలని పల్నాడు జిల్లా ఎస్పీకి స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఆగస్టు 4కి వాయిదా వేసింది. ఈ మేరకు జస్టిస్ ఆర్.రఘునందనరావు, జస్టిస్ సుమతితో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు ఇచ్చింది. గుం టూరుజిల్లా జైలు నుంచి విడుదలైన తన భర్త కిశోర్‌ను పోలీసులు అక్రమంగా నిర్బంధించారని, కోర్టు ముందు హాజరుపరిచేలా వారిని ఆదేశించాలని కోరుతూ సురేఖ బుధవారం హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. పోలీసుల తరఫున ఎస్‌జీపీ విష్ణుతేజ వాదనలు వినిపించారు.