Central Water Commission: తుంగభద్ర డ్యాంకు..వచ్చే జూన్‌కల్లా కొత్త గేట్లు
ABN , Publish Date - Oct 09 , 2025 | 04:53 AM
తుంగభద్ర డ్యాంకు వచ్చే ఏడాది జూన్ నాటికి మొత్తం 33 కొత్త క్రస్ట్ గేట్లనూ అమర్చుతామని తుంగభద్ర డ్యాం బోర్డు చైర్మన్ ఎస్‌కే పాండే తెలిపారు. బుధవారం బళ్లారిలోని ఎల్లెల్సీ కార్యాలయంలో...
నవంబరు నుంచి అమర్చే పనులు ప్రారంభిస్తాం
రూ.55 కోట్లు ఇచ్చేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధం
ప్రస్తుత సర్కారు పెండింగ్ నిధులూ ఇచ్చింది
‘ఆంధ్రజ్యోతి’తో తుంగభద్ర బోర్డు చైర్మన్ పాండే
బళ్లారి, అక్టోబరు 8 (ఆంధ్రజ్యోతి): తుంగభద్ర డ్యాంకు వచ్చే ఏడాది జూన్ నాటికి మొత్తం 33 కొత్త క్రస్ట్ గేట్లనూ అమర్చుతామని తుంగభద్ర డ్యాం బోర్డు చైర్మన్ ఎస్‌కే పాండే తెలిపారు. బుధవారం బళ్లారిలోని ఎల్లెల్సీ కార్యాలయంలో ఆయన ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడారు. ఈ జలాశయం విషయంలో ఏపీ, కర్ణాటక ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేస్తున్నాయని.. కొత్త క్రస్ట్ గేట్ల ఏర్పాటుకు అవసరమైన నిధుల్లో ఏపీ ప్రభుత్వం రూ.55 కోట్లు విడుదల చేసేందుకు సిద్ధంగా ఉందని వెల్లడించారు. మిగిలిన నిధులను రెండో విడతలో విడుదల చేస్తుందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రస్తుత కూటమి ప్రభుత్వం టీబీ డ్యాం విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపుతోందన్నారు. గతంలో పెండింగ్‌లో ఉన్న నిధులను కూడా మంజూరు చేసిందని చెప్పారు. డ్యాంలో ప్రస్తుతం 80 టీఎంసీల నీరు నిల్వ ఉందని తెలిపారు. ఈ ఏడాది వర్షాలు పుష్కలంగా కురిశాయని, రైతులకు సాగునీటికి ఇబ్బంది కలుగలేదని అన్నారు. క్రస్ట్ గేట్ల నిపుణుడు కన్నయ్యనాయుడు, కేంద్ర జలసంఘం సూచనల ప్రకారం డ్యాంకు ఉన్న 33 గేట్లనూ మార్చి, కొత్తవాటి ఏర్పాటుకు చర్యలు చేపట్టామని తెలిపారు. ‘కొత్త గేట్ల తయారీ టెండరు దక్కించుకున్న గుజరాత్ కంపెనీ.. ఇక్కడే రెండు ప్రాంతాల్లో వాటిని తయారుచేస్తోంది. తయారీ పూర్తి కావచ్చింది. నవంబరు నుంచి క్రస్ట్ గేట్లను అమర్చే పనులు ప్రారంభిస్తాం’ అని చెప్పారు. కొత్త గేట్ల తయారీలో నాణ్యత, ఇతర అంశాలను పరిశీలించేందుకు కేంద్రం నిపుణుల కమిటీని నియమించిందని చెప్పారు. అంతకుముందు పాండే తుంగభద్ర దిగువ కాలువను 200 కి.మీ. నుంచి 250 కి.మీ. వరకూ పరిశీలించారు. ఆయన వెంట బోర్డు ఎస్‌ఈ నారాయణ నాయక్, బోర్డు కార్యదర్శి ఓఆర్‌కే రెడ్డి, ఎస్‌డీవోలు హసేన్ బాషా, విశ్వనాథ్, సురేశ్, ప్రవీణ్, ఈఈ నాగరాజ్‌రావు తదితరులు ఉన్నారు.