Share News

Tungabhadra Dam at Risk: తుంగభద్ర డ్యాంకు మరో ముప్పు

ABN , Publish Date - Aug 16 , 2025 | 03:18 AM

ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక రాష్ట్రాల ఉమ్మడి నీటి ప్రాజెక్టు తుంగభద్ర డ్యాంకి మరో ముప్పు ముంచుకొచ్చింది. డ్యాంకి అమర్చిన 4, 6, 11, 18, 20, 24, 27 నంబర్ల క్రస్ట్‌ గేట్లు వరద ఉధృతికి ...

Tungabhadra Dam at Risk: తుంగభద్ర డ్యాంకు మరో ముప్పు

  • మొరాయిస్తున్న 7 క్రస్ట్‌గేట్లు

  • గేట్లు దెబ్బతిన్నాయని కర్ణాటక మంత్రి స్పష్టీకరణ

బళ్లారి, ఆగస్టు 15(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక రాష్ట్రాల ఉమ్మడి నీటి ప్రాజెక్టు తుంగభద్ర డ్యాంకి మరో ముప్పు ముంచుకొచ్చింది. డ్యాంకి అమర్చిన 4, 6, 11, 18, 20, 24, 27 నంబర్ల క్రస్ట్‌ గేట్లు వరద ఉధృతికి దెబ్బతిన్నాయి. ఆ క్రస్ట్‌ గేట్లు ఎత్తి నీటిని బయటకు వదలాలన్నా.. వరద తగ్గాక దించాలన్నా మొరాయిస్తున్నాయి. ప్రస్తుతం ఈ గేట్లు 3 నుంచి 4 అడుగులు మేర తెరిచి ఉన్నాయి. డ్యాంకు వరద పెరుగుతున్న నేపథ్యంలో ఎక్కువగా నీటిని వదలడానికి ఈ క్రస్ట్‌ గేట్లు మరింత ఎత్తు పెంచేందుకు వీలు కావడం లేదు. అలాగే వరద తగ్గినపుడు గేట్లు దించేందుకు కూడా వీలవ్వడంలేదు. ఈ గేట్లు వరద ఉధృతికి కిందిభాగంలో వం గిపోయాయి. ఈ మేరకు డ్యాం సేఫ్టీ కమిటీ నివేదిక ఇచ్చినట్లు కర్ణాటక మంత్రి, తుంగభద్ర డ్యాం జలమండలి అధ్యక్షుడు శివరాజ్‌ తంగడిగి తెలిపారు. శుక్రవారం ఆయన కొప్పళలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, డ్యాం గేట్లు దెబ్బతిన్న విషయం, కేంద్ర డ్యాం సేఫ్టీ కమిటీ తనకు ఇచ్చిన నివేదికను వివరించారు. గేట్లు దెబ్బతిన్నది వాస్తవమేనని తుంగభద్ర బోర్డు అధికారులు కూడా అంగీకరించారు. డ్యాంకు మొత్తం 33 క్రస్ట్‌ గేట్లు ఉన్నాయి. వీటిలో 19వ నంబర్‌ క్రస్ట్‌ గేటు గతేడాది వరద ఉధృతికి కొట్టుకుపోయిన విషయం తెలిసిందే. అప్పుడు గేట్ల తయారీ నిపుణుడు కన్నయ్య నాయుడును ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సంప్రదించి జలాలు వృథాకాకుండా చూడాలని కోరారు. ఆయన తన నైపుణ్యంతో వెంటనే స్టాప్‌లా క్‌ వేశారు. తరువాత డ్యాం సేఫ్టీ అధ్యయన కమిటీ డ్యాంతోపాటు గేట్లను పరిశీలించి మొత్తం గేట్లను మార్చి కొత్తవి అమర్చాలని సూచించింది. కొత్త గేట్ల తయారీకి రూ. 60 కోట్లతో టెండర్‌ పిలిచి పనులు చేస్తున్నారు. భద్రతను దృష్టిలో ఉంచుకుని 80 టీఎంసీలకి మించి డ్యాంలో నిల్వ ఉంచరాదని కమి టీ సూచించింది. ఆ మేరకు జలాశయంలో 80 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ చేస్తున్నారు. ఈ సీజన్‌లో ఇప్పటికే ప్రాజెక్టు నుంచి 135 టీఎంసీల నీరు కిందకు వదిలారు. 24 టీఎంసీల నీరు వినియోగించారు. ప్రస్తుతం ఇన్‌ఫ్లో 23,295 క్యూసెక్కు లు వస్తోంది. ఔట్‌ ఫ్లో 23,193 క్యూసెక్కులు వదులుతున్నారు. ఇప్పుడు ఈ గేట్లు దెబ్బతినడంతో పరివాహక ప్రాంతంలోని రైతుల్లో ఆందోళన నెలకొంది.

Updated Date - Aug 16 , 2025 | 03:18 AM