Share News

Vaikunta Dwaram Darshan: వైకుంఠ ద్వార దర్శనాల్లో 90 శాతం సామాన్యులకే!

ABN , Publish Date - Dec 23 , 2025 | 05:52 AM

సీఎం చంద్రబాబు సూచనల ప్రకారం తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాల్లో సామాన్య భక్తులకే పెద్దపీట వేసేలాఏర్పాట్లు చేస్తున్నట్టు రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు

Vaikunta Dwaram Darshan: వైకుంఠ ద్వార దర్శనాల్లో 90 శాతం సామాన్యులకే!

  • ఏ ఒక్కరూ అసంతృప్తి చెందకుండా ప్రణాళికలు

  • దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి

  • వైకుంఠ ద్వార దర్శనాలపై తిరుమలలో ముగ్గురు మంత్రుల సబ్‌ కమిటీ సమీక్ష

తిరుమల, డిసెంబరు 22(ఆంధ్రజ్యోతి): సీఎం చంద్రబాబు సూచనల ప్రకారం తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాల్లో సామాన్య భక్తులకే పెద్దపీట వేసేలాఏర్పాట్లు చేస్తున్నట్టు రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. ఈ నెల 30 నుంచి మొదలుకానున్న వైకుంఠ ద్వార దర్శనాల ఏర్పాట్లపై తిరుమలలో సోమవారం ముగ్గురు మంత్రుల సబ్‌ కమిటీ అధికారులతో సమావేశమైంది. మంత్రి ఆనం రామనారాయణరెడ్డి సారథ్యంలో మంత్రులు అనిత, అనగాని సత్యప్రసాద్‌, టీటీడీ చైర్మన్‌ బీఆర్‌ నాయుడు, ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌, అదనపు ఈవో వెంకయ్య చౌదరి, దేవదాయ శాఖ కార్యదర్శి హరి జవహర్‌లాల్‌, తిరుపతి జిల్లా కలెక్టర్‌, ఎస్పీ, టీటీడీ సీవీఎస్వో, ఇతర అధికారులు ఏర్పాట్లపై సమీక్షించారు. అనంతరం రామనారాయణరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఈ నెల 30న ఏకాదశి, 31న ద్వాదశి, జనవరి1 త్రయోదశితో పాటు మిగిలిన ఏడురోజుల్లో ప్రతి ఒక్కరికీ దర్శనం కల్పించేలా ఇప్పటికే ఏర్పాట్లు చేస్తున్నారని చెప్పారు. గతంలో వైకుంఠ ఏకాదశికి కేవలం 16 గంటల దర్శన సమయం మాత్రమే కేటాయిస్తే రానున్న ఏకాదశికి దాదాపు 20 గంటలు దర్శనాలకు కేటాయించామన్నారు. అలాగే 31న కూడా 19 గంటల పాటు దర్శనాలు కొనసాగుతాయన్నారు. జనవరి 1న కూడా అదే స్థాయిలో దర్శన సమయం ఉంటుందని చెప్పారు. 90 శాతం సమయాన్ని సామాన్య భక్తులకే కేటాయిస్తామని మంత్రి స్పష్టంచేశారు. దర్శనం, అన్నప్రసాదాలు, రవాణా, బస, ప్రసాదాలపై పలు సూచనలు చేశామని తెలిపారు. భక్తులు తిరుపతిలోని సౌకర్యాలను వినియోగించుకుంటూ కేటాయించిన దర్శన సమయానికే తిరుమలకు రావాలని విజ్ఞప్తి చేశారు. ఏ ఒక్కరూ అసహనంతో అసంతృప్తితో తిరిగి వెళ్లకూడదని యంత్రాంగాన్ని ఆదేశించినట్టు రామనారాయణరెడ్డి వెల్లడించారు.

టెక్నాలజీతో రద్దీ పర్యవేక్షణ

క్యూలైన్‌లోకి ఎంత మంది వచ్చారు, దర్శనానికి పట్టే సమయం, ఎక్కడ రద్దీ అధికంగా ఉంది వంటి వాటిని పర్యవేక్షించేందుకు ఏఐ టెక్నాలజీని వినియోగిస్తామని మంత్రి తెలిపారు. సీసీ కెమెరాలతో పాటు డ్రోన్‌ టెక్నాలజీని కూడా వినియోగిస్తామని చెప్పారు. అనుకోకుండా రద్దీ అధికమైతే అందుకు అనుగుణంగా దర్శనాలు చేయించాలని అధికారులకు సూచించామన్నారు. వీఐపీలు, వీవీఐపీలకు ఎప్పటిలానే అంక్షలుంటాయని చెప్పారు. ఈ పదిరోజుల్లో 182 గంటల దర్శన సమయాన్ని సామాన్యులకు కేటాయించి, మిగిలిన సమయాన్ని మాత్రమే వీఐపీలు, దాతలు, స్థానికులు, ఉద్యోగులకు దర్శన అవకాశం కల్పించామని వివరించారు.

Updated Date - Dec 23 , 2025 | 05:52 AM