Tirumala: టీటీడీలో అన్యమత ఉద్యోగుల లెక్క తేలుస్తాం
ABN , Publish Date - Jul 23 , 2025 | 06:28 AM
టీటీడీలో అన్యమత ఉద్యోగుల విషయంలో కఠినంగా ఉన్నాం. గుర్తించేందుకు ప్రత్యేకంగా కమిటీ వేశాం..లెక్కలు తీస్తున్నాం.
వైకుంఠం క్యూ కాంప్లెక్స్-3 నిర్మాణానికి నిపుణుల కమిటీ
టీటీడీలో ప్రత్యేకంగా సైబర్ సెక్యూరిటీ ల్యాబ్
టీటీడీ బోర్డు నిర్ణయం
తిరుమల, జూలై22(ఆంధ్రజ్యోతి): ‘టీటీడీలో అన్యమత ఉద్యోగుల విషయంలో కఠినంగా ఉన్నాం. గుర్తించేందుకు ప్రత్యేకంగా కమిటీ వేశాం..లెక్కలు తీస్తున్నాం. టీటీడీ విజిలెన్స్ వద్ద అన్యమత ఉద్యోగుల వివరాలున్నాయి....విచారిస్తున్నారు. గతంలో అన్యమత ఉద్యోగులపై ఎలాంటి నిఘా లేదు. కొత్త బోర్డు ఏర్పాటైన తర్వాత గట్టిగా వ్యవహరిస్తున్నాం.’ అని టీటీడీ బోర్డు చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో శ్యామలరావు తెలిపారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో మంగళవారం టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం జరిగింది. ఆ వివరాలను చైర్మన్, ఈవో బోర్డు సభ్యులతో కలిసి మీడియాకు తెలిపారు. ‘అన్యమత ఉద్యోగులకు వీఆర్‌ఎస్ అవకాశం ఇచ్చాం. ఇప్పటికే కొందరు ముందుకు వచ్చారు. గతంలో కొంతమందికి ఇంక్రిమెంట్లు కట్ చేశారు. అయినప్పటికీ కొందరు నిబంధనలు ఉల్లంఘిస్తూనే ఉన్నారు. విచారణలో తేలితే వారిని సస్పెండ్ చేస్తున్నాం’ అని తెలిపారు. కాగా, ఆలయానికి సంబంధంలేని టీటీడీ పరిధిలోని ఆస్పత్రులు, విద్యాసంస్థల్లోకి అన్యమత ఉద్యోగులను బదిలీ చేసే అంశాన్ని పరిశీలించాలని ప్రభుత్వం సూచించిందని చైర్మన్, ఈవో తెలిపారు. ఇటీవల దేవదాయశాఖ మంత్రితోనూ ఇదే అంశంపై చర్చించామన్నారు. ఇది సున్నితమై అంశం, ప్రతి ఉద్యోగి ఇంటికి వెళ్లి తనిఖీ చేయడం సాధ్యం కాదని, అన్యమతస్తులని సమాచారం అందిన వెంటనే విజిలెన్స్ విచారణకు ఆదేశించి నిజమని తేలితే చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. కాగా అనమత్య ఉద్యోగులు ఖచ్చితంగా ఎంతమంది ఉన్నారనే సంఖ్య లేదన్నారు. 2018లో కొంతమంది అన్యమత ఉద్యోగులను తొలగించేందుకు నోటీసులు ఇవ్వగా కోర్టు నుంచి వారు స్టే తీసుకువచ్చారని, వారిలో 20 మంది పదవీ విరమణ చేశారని తెలిపారు. మరో 22 మంది అధికారికంగా ఉన్నారన్నారు. ఇక, ప్రభుత్వానికి కామన్ గుడ్ ఫండ్ పెంచే అంశంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, సీఎంతో చర్చించిన తర్వాత నిర్ణయాలు తీసుకుంటామని ఓ ప్రశ్నకు బదులిచ్చారు. ఏఐ ద్వారా త్వరితగతిన దర్శనం చేయించేందుకు ఇప్పటికే గూగుల్, టీసీఎస్ సంస్థలు ఆధ్యయనం చేస్తున్నాయన్నారు.
మరికొన్ని నిర్ణయాలు..
భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని వైకుంఠం క్యూ కాంప్లెక్స్-3 నిర్మాణానికి సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు నిపుణుల కమిటీ వేయాలి.
నిరుద్యోగులైన వేదపారాయణదారులకు ఎండోమెంట్ ద్వారా నిరుద్యోగ భృతిని చెల్లించేందుకు రూ.2.16 కోట్ల టీటీడీ నిధుల మంజూరుకు ఆమోదం.
తిరుమలలోని వివిధ ప్రాంతాల్లో అన్ని వసతులతో విశ్రాంతి కేంద్రాలు(లాంజ్‌లు) ఏర్పాటుకు ఉన్న అవకాశాలపై అధ్యయనం.
భక్తులు సైబర్ మోసాలకు గురికాకుండా నియంత్రించేందుకు సైబర్ సెక్యూరిటీ ల్యాబ్ ఏర్పాటుకు ఆమోదం.
సమరసతా సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇటీవల నిర్మించిన 320 ఆలయాలకు రూ.79.82 లక్షలతో ఉచితంగా మైక్‌సెట్లు.
దేవదాయ శాఖ సూచన మేరకు శ్రీవాణిట్రస్టు ఆధ్వర్యంలో ఎస్సీ, ఎస్టీ, వెనుకబడిన ప్రాంతాల్లో నిర్మించే శ్రీవారి ఆలయాలు, భజన మందిరాలకు నిధులు చెల్లించేందుకు మూడు కేటగిరీల్లో రూ.10 లక్షలు, రూ.15 లక్షలు, రూ.20 లక్షలుగా నిర్ణయం.