TTD: అలిపిరిలో ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్
ABN , Publish Date - Dec 17 , 2025 | 06:09 AM
తిరుమలపై ఒత్తిడి తగ్గించే ఆలోచనతో తిరుపతిలోని అలిపిరి వద్ద 20 నుంచి 25 ఎకరాల స్థలంలో ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్ ను నిర్మించాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది.
శిల్ప కళాశాల ప్రాంతంలోని 25 ఎకరాలలో నిర్మాణం.. తిరుమల కూడళ్లు, దారులకు శ్రీవారి నామాల పేర్లు
రథాలు, ధ్వజస్తంభాల కోసం పలమనేరులో 100 ఎకరాలు
హృదయాలయలో అత్యాధునిక సౌకర్యాలకు రూ.48 కోట్లు
ముంబైలో రూ.14.04 కోట్లతో ఆలయ నిర్మాణం
టీటీడీ బోర్డు సమావేశంలో నిర్ణయాలు
తిరుమల, డిసెంబరు 16(ఆంధ్రజ్యోతి): తిరుమలపై ఒత్తిడి తగ్గించే ఆలోచనతో తిరుపతిలోని అలిపిరి వద్ద 20 నుంచి 25 ఎకరాల స్థలంలో ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్ ను నిర్మించాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది. తిరుమలలోని అన్నమయ్య భవనంలో మంగళవారం నిర్వహించిన టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను బోర్డు చైర్మన్ బీఆర్ నాయుడు మీడియాకు వెల్లడించారు. టీటీడీ శిల్ప కళాశాల ప్రాంతంలో ఈ టౌన్‌షి్‌పను నిర్మిస్తామని, శిల్పకళాశాలను మరో ప్రదేశానికి తరలిస్తామని చెప్పారు. శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులకు కనీస బస, అన్నదానం, పార్కింగ్ వంటి కొన్ని సౌకర్యాలు ఇక్కడ ఉంటాయన్నారు. తిరుపతిలోని శ్రీపద్మావతి చిన్నపిల్లల హృదయాలయంలో అత్యాధునిక సౌకర్యాలు కల్పించేందుకు అదనంగా రూ.48 కోట్ల మంజూరుకు బోర్డు ఆమోదం తెలిపిందని చెప్పారు. ఇప్పటికే ఆ ఆస్పత్రికి దాదాపు రూ.230 కోట్లు కేటాయించగా, అందులో అవసరం లేని కొన్ని నిర్మాణాలకు సంబంధించిన టెండర్లను రద్దు చేశామన్నారు. ఈవో అనిల్‌కుమార్ సింఘాల్, అదనపు ఈవో వెంకయ్య చౌదరి తదితరులు పాల్గొన్నారు.
సమావేశంలో మరికొన్ని నిర్ణయాలు
టీటీడీ ఆలయాలు, దేశంలోని ఇతర ఆలయాలకు ధ్వజస్తంభాలు, రథాల తయారీ కోసం పలమనేరులో వంద ఎకరాలలొ దివ్య వృక్షాలు పెంచేందుకు నిర్ణయం.
ముంబైలోని బాంద్రా ప్రాంతంలో మహారాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన 800 గజాల స్థలంలో రూ.14.40 కోట్లతో శ్రీవారి ఆలయం నిర్మాణానికి ఆమోదం.
దాతల కాటేజీల నిర్వహణ, నిర్మాణాలపై నూతన సమగ్ర విధానం తీసుకురావాలని నిర్ణయం.
టీటీడీ ఇంజినీరింగ్ విభాగంలో ఖాళీగా ఉన్న 60 పోస్టులను ఇప్పటికే ఇచ్చిన నోటిఫికేషన్ ఆధారంగా త్వరలో భర్తీ చేసేందుకు నిర్ణయం.
నిబంధనల మేరకు శ్రీవారి పోటులో నూతనంగా 18 పాచక పోస్టుల మంజూరు కోసం ప్రభుత్వానికి లేఖ రాయాలని తీర్మానం
తిరుమలలోని రహదారులు, ప్రధాన కూడళ్ల పేర్లను వైష్ణవ పురాణాలు, ఆళ్వార్లు, అన్నమాచార్య సంకీర్తనల్లోని శ్రీవారి నామాలు తదితర పేర్లతో మార్చేందుకు ప్రత్యేక కమిటీ నియామకం.
శ్రీవారి ఆలయంలో ప్రధాన సన్నిధి యాదవతోపాటు అదనంగా మరో సన్నిఽధి యాదవ పోస్టు ఏర్పాటు.
తిరుమల, నడక మార్గాల్లోని పురాతన నిర్మాణాల పరిరక్షణ కోసం ప్రత్యేక విభాగం, అనుభవం కలిగిన అధికారుల నియామకానికి ఆమోదం.
జగిత్యాల కొండగట్టు వీరాంజనేయస్వామి ఆలయంలో భక్తుల వసతి సముదాయం నిర్మాణానికి ఆమోదం.