TTD to Build 1000 Temples: దళితవాడల్లో వెయ్యి ఆలయాలు!
ABN , Publish Date - Sep 17 , 2025 | 03:43 AM
ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో రాష్ట్రంలోని దళితవాడల్లో తొలి దశలో వెయ్యి ఆలయాలను నిర్మించాలని టీటీడీ పాలక మండలి నిర్ణయించింది....
మత మార్పిడులను అడ్డుకునేందుకే.. టీటీడీ పాలక మండలి నిర్ణయం
రూ.10-20 లక్షలుశ్రీవాణి నిధుల కేటాయింపు
ప్రతిష్ఠాత్మకంగా బ్రహ్మోత్సవాలు
రద్దీ నియంత్రణకు తొలిసారి ఇస్రో సాయం
ఆ పది రోజులూ సిఫారసు లేఖలపైవీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
బోర్డు తీర్మానాలను వెల్లడించిన టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు
తిరుమల, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో రాష్ట్రంలోని దళితవాడల్లో తొలి దశలో వెయ్యి ఆలయాలను నిర్మించాలని టీటీడీ పాలక మండలి నిర్ణయించింది. దళితవాడల్లో జరుగుతున్న మతమార్పిడులు అడ్డుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఆయా ప్రాంతాలను బట్టి రూ.10 లక్షలు, రూ.15 లక్షలు, రూ.20 లక్షల చొప్పున శ్రీవాణి ట్రస్టు నిధులు కేటాయిస్తామని తెలిపింది. బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై తిరుమలలోని అన్నమయ్య భవనంలో మంగళవారం మధ్యాహ్నం పాలక మండలి సమావేశం జరిగింది. చైర్మన్ బీఆర్ నాయుడు బ్రహ్మోత్సవాల బుక్‌లెట్‌ను ఆవిష్కరించి ఆ తర్వాత ఏర్పాట్లపై సమీక్షించారు. అనంతరం ఈవో అనిల్‌కుమార్ సింఘాల్, అదనపు ఈవో వెంకయ్య చౌదరి, బోర్డు సభ్యులతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. తమ పాలక మండలి ఏర్పడ్డాక ఇవే తొలి బ్రహ్మోత్సవాలని.. ప్రతిష్ఠాత్మికంగా తీసుకుని అత్యంత వైభవంగా, దిగ్విజయంగా జరపాలని తీర్మానించామని చెప్పారు. భక్తులకు ఇబ్బందులు, అసౌకర్యాలు లేకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై సుదీర్ఘంగా చర్చించామని తెలిపారు. ‘రద్దీ నియంత్రణ కోసం తొలిసారి ఇస్రో సహకారం తీసుకోవాలని నిర్ణయించామని, ప్రతినిమిషం వారు రద్దీని పర్యవేక్షిస్తూ అప్రమత్తం చేస్తూ సందేశాలిస్తారు. ఎల్ అండ్ టీ సంస్థ కూడా క్రౌడ్ మేనేజ్‌మెంట్‌కు సహకరిస్తుంది. బ్రహ్మోత్సవాల సందర్భంగా పది రోజులపాటు సిఫారసు లేఖలపై ఇచ్చే వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేశాం. స్వయంగా వచ్చే ప్రొటోకాల్ ప్రముఖులకే వీఐపీ బ్రేక్ దర్శనాలుంటాయి. వృద్ధులు, చిన్నపిల్లల తల్లిదండ్రులు, ఎన్నా రైలకు ప్రత్యేక దర్శనాలు నిలిపివేస్తాం. ’ అని వెల్లడించారు. ఈ నెల 23న అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు మొదలవుతాయని, 24వ తేదీన మీన లగ్నంలో (సాయంత్రం 5.43-6.15 గంటల మధ్య) ధ్వజారోహణం, రాత్రి పెద్ద శేషవాహన సేవ జరుగుతుందన్నారు. అదే రోజు రాష్ట్రప్రభుత్వం తరపున సీఎం చంద్రబాబు శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారని వెల్లడించారు.
మరికొన్ని నిర్ణయాలు..
కర్ణాటక బెలగావిలోని కొలికోప్ప గ్రామంలో ఏడు ఎకరాల్లో శ్రీవాణి ట్రస్టు నిధులతో శ్రీవారి ఆలయ నిర్మాణం
గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం అనంతవరంలో ఉన్న శ్రీవారి ఆలయంలో రాజగోపురం, ముఖమండపం, సుబ్రహ్మణ్యస్వామికి ఆభరణాలు, తాగునీటి సౌకర్యం కోసం రూ.7.20 కోట్లు.
అన్నమయ్య జిల్లా వాల్మీకిపురం పట్టాభిరామాలయంలో ఆలయ పుష్కరిణి, కల్యాణ వేదిక, రాజ గోపురం, తోరణం నిర్మాణానికి రూ.5.73 కోట్లు మంజూరు.
గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కాజలో రూ.89.54 లక్షల విలువైన 74 సెంట్ల భూమిని కొనుగోలు చేసి టీటీడీకి విరాళంగా ఇచ్చేందుకు హైదరాబాద్‌కు చెందిన వెంకట్‌రెడ్డి, విష్ణువర్ధన్‌రెడ్డి ముందు కొచ్చారు. ఆ విరాళం స్వీకరించేందుకు ఆమోదం.