Annadanam Program: మార్చి నుంచి 60 టీటీడీ ఆలయాల్లో అన్నప్రసాదాలు
ABN , Publish Date - Dec 13 , 2025 | 05:09 AM
దేశవ్యాప్తంగా ఉన్న టీటీడీ ఆలయాలన్నింటిలో మార్చి నుంచి రెండు పూట్లా అన్నప్రసాద వితరణకు టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది.
దాతల సహకారంతో ఒక్కో ఆలయంలో రూ.60 కోట్ల కార్పస్ ఫండ్ ఏర్పాటు
తిరుమల, డిసెంబరు12(ఆంధ్రజ్యోతి): దేశవ్యాప్తంగా ఉన్న టీటీడీ ఆలయాలన్నింటిలో మార్చి నుంచి రెండు పూట్లా అన్నప్రసాద వితరణకు టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. తిరుమల తరహాలోనే టీటీడీ ఆలయాలన్నింటిలోనూ అన్నప్రసాదాల వితరణ చేయాలని సీఎం చంద్రబాబు సూచించడంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. టీటీడీ పరిధిలో దేశవ్యాప్తంగా 60 ఆలయాలున్నాయి. ప్రస్తుతం 50 శాతానికి పైగా ఆలయాల్లో మధ్యాహ్నం అన్నప్రసాదాల వితరణ జరుగుతోంది. మార్చి మొదటివారం నుంచి మఽధ్యాహ్నం, రాత్రి సమయంలోనూ ఈ 60 ఆలయాల్లో అన్నప్రసాదాలను అందిస్తారు. దీని కోసం అన్నప్రసాదం ట్రస్టులో ఉన్న నిధులతో పాటు శ్రీవాణి ట్రస్టు నుంచీ నిధులను వినియోగించుకోవాలని టీటీడీ భావిస్తోంది. తొలిదశలో టీటీడీ నిధులతో అన్నప్రసాదాలు చేపట్టినా ఆ తర్వాత ఆయా ఆలయాల పరిధిలోని దాతల సహకారంతో వీటిని నడుపుతారు. అన్నదాన వితరణ సజావుగా జరిగేందుకు మూలనిధి ఏర్పాటు చేసే ఆలోచనలో ఉంది.