Share News

Land Allocation Rejected: తిరుమలలో రెండెకరాలు ఇవ్వండి

ABN , Publish Date - Dec 28 , 2025 | 05:11 AM

జగన్‌ పాలనలో ఐదేళ్లు అస్తవ్యస్తమైన తిరుమల వ్యవహారాలను గాడి లో పెట్టేందుకు టీటీడీ కఠినంగా వ్యవహరిస్తోంది.

Land Allocation Rejected: తిరుమలలో రెండెకరాలు ఇవ్వండి

  • పీఆర్‌, రెవెన్యూ అతిథి గృహాలు నిర్మిస్తాం

  • డిప్యూటీ సీఎం, రెవెన్యూ మంత్రి అభ్యర్థన

  • నిర్ద్వంద్వంగా తిరస్కరించిన టీటీడీ బోర్డు

తిరుపతి, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి): జగన్‌ పాలనలో ఐదేళ్లు అస్తవ్యస్తమైన తిరుమల వ్యవహారాలను గాడిలో పెట్టేందుకు టీటీడీ కఠినంగా వ్యవహరిస్తోంది. రాజకీయ కోణంలో కాకుండా క్షేత్రం పవిత్రతను దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకుంటోంది. తిరుమలలో పంచాయతీరాజ్‌, రెవెన్యూ శాఖలకు అతిథిగృహాల నిర్మాణానికి భూమి కేటాయించాలని కోరుతూ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌, మంత్రి అనగాని సత్యప్రసాద్‌ చేసిన అభ్యర్థనలను సైతం టీటీడీ తిరస్కరించిన విషయం తాజాగా వెలుగు చూసింది. వీఐపీల ప్రొటోకాల్‌, తిరుమలలో ఉత్సవాల ఏర్పాట్లలో రెవెన్యూ శాఖది కీలక పాత్ర. ఈ అవసరాల దృష్ట్యా తిరుమలలో తమకు ప్రత్యేకంగా అతిథిగృహం అవసరమని ఆ శాఖ భావించింది. విషయాన్ని మంత్రి అనగాని సత్యప్రసాద్‌ దృష్టికి తీసుకెళ్లడంతో తిరుమల కొండపైన 2ఎకరాల భూమి కేటాయించాలని కోరుతూ ఆయన టీటీడీకి లేఖ రాశారు. దీనికన్నా ముందు పంచాయతీరాజ్‌ భవన్‌ పేరుతో అతిథిగృహం నిర్మించుకోవడానికి తిరుమలలో స్థలం కేటాయించాలని డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ కార్యాలయం నుంచి కూడా లేఖ అందింది. ఈ రెండింటిపై 16న జరిగిన టీటీడీ పాలకమండలి సమావేశంలో చర్చించారు. కొండపైన భూమి లభ్యత పరిమితంగా ఉన్నందున కొన్నేళ్లుగా కొత్త నిర్మాణాలపై నిషేధం ఉంది. ఈ విషయంలో హైకోర్టు పలు పరిమితులు విధించడంతో శిథిలావస్థకు చేరిన గెస్ట్‌హౌస్‌లు, కాటేజీలను పునర్నిర్మించడానికే టీటీడీ పరిమితమవుతోంది. ఇందులో భాగంగానే డిప్యూటీ సీఎం, మంత్రుల అభ్యర్థనలను టీటీడీ పాలకమండలి తిరస్కరించింది. అయితే ప్రత్యామ్నాయంగా తిరుమలలో ఇప్పటికే వున్న అతిథిగృహాల్లో అనువైన భవనాన్ని కేటాయించాలని నిర్ణయించింది.

Updated Date - Dec 28 , 2025 | 05:12 AM