TTD: వైకుంఠద్వార దర్శనాలు ఈసారి రెండురోజులే
ABN , Publish Date - Oct 15 , 2025 | 04:58 AM
తిరుమల శ్రీవారి వైకుంఠద్వార దర్శనాలను పూర్వపు విధానంలో రెండు రోజులు మాత్రమే నిర్వహించనున్నట్టు తెలుస్తోంది.
టీటీడీ యోచన...ఆగమ సలహామండలి అభిప్రాయాల సేకరణ!
తిరుమల, అక్టోబరు14(ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవారి వైకుంఠద్వార దర్శనాలను పూర్వపు విధానంలో రెండు రోజులు మాత్రమే నిర్వహించనున్నట్టు తెలుస్తోంది. గతంలో వైకుంఠ ఏకాదశి, ద్వాదశి రోజుల్లో మాత్రమే ఆలయంలోని వైకుంఠ ద్వారాలను తెరించి దర్శనం కల్పించేవారు. అయితే భక్తుల రద్దీ ఆ రెండురోజుల్లో అధికంగా ఉండటంతో పాటు శ్రీరంగం ఆలయ తరహాలో పదిరోజుల పాటు వైకుంఠ ద్వారాలను తెరిచి ఉంచి దర్శనాలను చేయించాలని గత ప్రభుత్వంలో అధికారులు నిర్ణయించారు. అప్పట్లో దీనికి పలువురు పీఠాధిపతులు, మఠాధిపతులు కూడా అంగీకారాన్ని తెలుపుతూ లేఖలను కూడా సమర్పించారు. దీంతో 2020 నుంచి పదిరోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలను కల్పించే విధానాన్ని కొనసాగిస్తున్నారు. అయితే ఇది ఆగమ విరుద్ధమని, పైగా పదిరోజుల పాటు దర్శనాలు కొనసాగించడంతో ఆ టోకెన్ల కోసం భక్తులు ఒకేసారి ఎగబడుతున్న క్రమంలో తోపులాటలు, తొక్కిసలాటలు జరుగుతున్నాయని కొందరి నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో తిరిగి రెండురోజుల వైకుంఠ ద్వార దర్శనాల అమలుపై ఆలోచనలు చేస్తున్నట్టు సమాచారం. దీనికోసం ఆగమపండితులు, అర్చకులు, శాస్త్ర నిపుణులతో ఇప్పటికే టీటీడీ అఽధికారులు చర్చించినట్టు తెలిసింది. టీటీడీ బోర్డు చైర్మన్ బీఆర్ నాయుడు, ఉన్నతాధికారులు, అర్చకబృందం, ఆగమపండితులతో ఈ విషయమై సమావేశమైనట్టు సమాచారం. త్వరలోనే వైకుంఠద్వార దర్శనాలపై ఓ నిర్ణయానికి రానున్నట్టు తెలుస్తోంది.