TTD Housing Project: అలిపిరిలో ‘ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్’
ABN , Publish Date - Dec 21 , 2025 | 04:40 AM
శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చే భక్తులకు తిరుపతిలోనే వసతి ఏర్పాట్లు కల్పించేలా అలిపిరిలో ‘ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్’కు టీటీడీ శ్రీకారం చుట్టింది.
రూ.4 వేల కోట్లతో రూపుదిద్దుకోనున్న వసతి కేంద్రం
తిరుమల, డిసెంబరు 20 (ఆంధ్రజ్యోతి): శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చే భక్తులకు తిరుపతిలోనే వసతి ఏర్పాట్లు కల్పించేలా అలిపిరిలో ‘ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్’కు టీటీడీ శ్రీకారం చుట్టింది. రూ.3 వేల కోట్ల నుంచి రూ.4 వేల కోట్ల అంచనాలతో ఈ ప్రాజెక్ట్‌ను పూర్తిచేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. శ్రీవారి దర్శనార్థం ప్రస్తుతం రోజూ 60 వేల నుంచి 80 వేల మంది భక్తులు వస్తున్నారు. వారాంతాల్లో, రద్దీ రోజుల్లో ఆ సంఖ్య లక్ష నుంచి 1.50 లక్షలకు చేరుకుంటోంది. తిరుమలలో ప్రస్తుతం 40 వేల నుంచి 50 వేల మందికి సరిపడేలా 7,500 గదులు అందుబాటులో ఉన్నాయి. దీంతో రద్దీ సమయాల్లో తిరుమలపై ఒత్తిడి పెరుగుతోంది. తిరుపతిలో శ్రీనివాసం, మాధవం, విష్ణు నివాసం వంటి భారీ వసతి సముదాయాలున్నా వీటిలో 10 నుంచి 12 వేల మందికి మాత్రమే వసతి లభిస్తోంది. అచ్యుతం, శ్రీపథం వంటి భవనాలు ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్నాయి.
25 వేల మందికి వసతి
అలిపిరి సమీపంలోని శిల్ప కళాశాల ప్రాంగణం నుంచి ఓల్డ్ చెక్ పాయింట్ (గరుడ సర్కిల్) వరకు ఈ ‘ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్’ను ఏర్పాటు చేస్తారు. ఇందులో గదులు, హాళ్లతో కూడిన లాకర్లు, వందల సంఖ్యలో స్నానపు గదులు, మరుగుదొడ్లు, ఉచిత అన్నప్రసాద వితరణ కేంద్రాలు, ప్రైవేట్ రెస్టారెంట్ల్లు, దుకాణాల సముదాయం, పార్కింగ్, ఆధ్యాత్మిక చింతన కలిగించేలా థియేటర్లు, పార్కు, ఆడిటోరియం ఉంటాయి. ఈ టౌన్‌షిప్‌లో 25 వేల నుంచి 30 వేల మందికి వసతులు కల్పించాలని భావిస్తోంది.