High Court: పరకామణిలో చోరీపై రాజీనా
ABN , Publish Date - Sep 21 , 2025 | 04:33 AM
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో టీటీడీ పరకామణిలో జరిగిన అవకతవకలపై హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. పరకామణి నుంచి నగదు అపహరణపై ఫిర్యాదు చేసిన టీటీడీ....
హైకోర్టు అభ్యంతరం
లోక్ అదాలత్ ఉత్తర్వులు సస్పెండ్
రికార్డులన్నీ స్వాధీనం చేసుకోండి
సీఐడీ ఐజీకి న్యాయమూర్తి ఆదేశం
తదుపరి విచారణ అక్టోబరు 13కి వాయిదా
అమరావతి, సెప్టెంబరు 20(ఆంధ్రజ్యోతి): గత వైసీపీ ప్రభుత్వ హయాంలో టీటీడీ పరకామణిలో జరిగిన అవకతవకలపై హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. పరకామణి నుంచి నగదు అపహరణపై ఫిర్యాదు చేసిన టీటీడీ అప్పటి అసిస్టెంట్ విజిలెన్స్ సెక్యూరిటీ అధికారి సతీశ్‌కుమార్, నిందితుడు రవికుమార్‌తో లోక్ అదాలత్ వద్ద రాజీ చేసుకోవడాన్ని తప్పుబట్టింది. విస్తృత ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని 2023 సెప్టెంబరు 9న లోక్ అదాలత్ ఇచ్చిన ఉత్తర్వులను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. తాము తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు ఇవి అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది. కేసులో సీఐడీ ఐజీని సుమోటోగా ప్రతివాదిగా చేర్చింది. ప్రస్తుత కేసుతో ముడిపడి ఉన్న తిరుమల 1వ పట్టణ పోలీస్ స్టేషన్ రికార్డులు, లోక్ అదాలత్ ప్రొసీడింగ్స్, టీటీడీ బోర్డు తీర్మానాలు, ఈ కేసుతో సంబంధం ఉన్న ప్రొసీడింగ్స్‌ను తక్షణం స్వాధీనం చేసుకోవాలని సీఐడీ ఐజీని ఆదేశించింది. తదుపరి విచారణ రోజు వాటిని సీల్డ్ కవర్‌లో తమ ముందు ఉంచాలని స్పష్టం చేసింది. తదుపరి విచారణను అక్టోబరు 13కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణప్రసాద్ శుక్రవారం ఉత్తర్వులు ఇచ్చారు. ఉత్తర్వుల ప్రతి శనివారం అందుబాటులోకి వచ్చింది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో టీటీడీ పరకామణిలో జరిగిన కుంభకోణంపై సీఐడీ దర్యాప్తు జరిపించాలని సమర్పించిన వినతిని ఈవో పరిగణనలోకి తీసుకోకపోవడాన్ని చట్టవిరుద్ధమైన చర్యగా ప్రకటించాలని కోరుతూ జర్నలిస్ట్ ఎం.శ్రీనివాసులు పిటిషన్ దాఖలు చేశారు.
సీఐడీ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ అనుబంధ పిటిషన్ వేశారు. ఈ వ్యాజ్యం శుక్రవారం విచారణకు రాగా పిటిషనర్ తరఫున న్యాయవాది కుర్రా శ్రీనివాసులు, టీటీడీ తరఫున న్యాయవాది సి. శ్రీనివాసబాబా వాదనలు వినిపించారు. ఈ వ్యవహారంపై టీటీడీ ఈవో సమర్పించిన రాతపూర్వక వివరాలు సంతృప్తికరంగా లేవని, పూర్తి వివరాలతో కౌంటర్ వేయడానికి సమయం ఇవ్వాలని అభ్యర్థించారు. ఇరువైపుల వాదనలు పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి... ఈ వ్యవహారంలో రెండు వారాల్లో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని టీటీడీని ఆదేశించారు. రవికుమార్‌పై తీసుకున్న క్రమశిక్షణ చర్యల గురించి అఫిడవిట్‌లో ప్రస్తావించాలని స్పష్టం చేశారు. వ్యాజ్యంలో వ్యక్తిగత ప్రతివాదులుగా ఉన్న టీటీడీ అప్పటి అసిస్టెంట్ విజిలెన్స్ సెక్యూరిటీ అధికారి సతీశ్‌కుమార్, నిందితుడు రవికుమార్‌కు నోటీసులు జారీ చేశారు.