Tirumala Tirupati Devasthanams: కొనుగోళ్లలో అవినీతికి చెక్
ABN , Publish Date - Nov 21 , 2025 | 03:56 AM
తిరుమల తిరుపతి దేవస్థానముల(టీటీడీ)లో అత్యంత కీలకమైన మార్కెటింగ్ విభాగం ప్రక్షాళనకు ధర్మకర్తల మండలి పూనుకుంది. ఏటా దాదాపు రూ. 700 కోట్లకుపైగా....
టీటీడీ మార్కెటింగ్ విభాగం ప్రక్షాళనకు చర్యలు
రెండేళ్లకే ఉద్యోగుల తప్పనిసరి బదిలీలు
అత్యవసరం పేరుతో కొనేవాటికి అడ్డుకట్ట
స్థానిక ప్రాంతాల నుంచే శాలువాల సేకరణ
నిబంధనల్లో పలు మార్పులు.. త్వరలో అమలు
(తిరుమల-ఆంధ్రజ్యోతి)
తిరుమల తిరుపతి దేవస్థానముల(టీటీడీ)లో అత్యంత కీలకమైన మార్కెటింగ్ విభాగం ప్రక్షాళనకు ధర్మకర్తల మండలి పూనుకుంది. ఏటా దాదాపు రూ. 700 కోట్లకుపైగా కొనుగోళ్లు చేసే ఈ విభాగంలో అవినీతి మీద తరచూ విమర్శలు వస్తుంటాయి. ఈ విభాగంలో అధికారులు, సిబ్బంది కక్కుర్తి పడితే నాణ్యతలేని సరుకులు టీటీడీకి సరఫరా అయ్యే అవకాశం ఉంటుంది. పైగా ధరల్లోనూ తేడాలుంటాయి. టెండర్ల నిబంధనల్లోనే సడలింపులు ఇచ్చి మాయ చేయొచ్చు. గతంలో మార్కెటింగ్ విభాగంలో కొందరి అవినీతి, విచ్చలవిడి కొనుగోళ్లు బోర్డు దృష్టికి వచ్చింది. విజిలెన్స్ విచారణ ఆధారంగా ఇప్పటికే అవినీతికి పాల్పడిన కొందరిని బదిలీ కూడా చేశారు. రూ. 350 నుంచి రూ. 400 విలువ చేసే శాలువాలను రూ. 1,300 చొప్పున కొనుగోలు చేసి కోట్లాది రూపాయాల అవినీతికి పాల్పడ్డారంటూ టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు కూడా బహిరంగంగా ప్రకటించారు.
అక్రమాలకు తావులేకుండా...
భవిష్యత్తులో అక్రమాలకు తావులేకుండా గట్టి నిబంధనలు పెట్టాలని బోర్డు భావిస్తోంది. మార్కెటింగ్ విభాగంలో అధికారులు, సిబ్బంది రెండేళ్లకు మించి పనిచేయకూడదన్నది ఇందులో ప్రధానమైనది. రెండేళ్ల తర్వాత తప్పనిసరి బదిలీ చేయాలని నిర్ణయించారు. మార్కెటింగ్ విభాగంలోకి తీసుకునే ముందే ఉద్యోగుల గత పనితీరు, ఏవైనా అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారా వంటి వ్యక్తిగత వివరాలు విజిలెన్స్ విభాగం ద్వారా తెలుసుకోవాలనే మరొక నిబంధన పెడుతున్నారు. ఇక కొనుగోళ్ల విషయంలోనూ కొన్ని మార్పులు చేయాలని భావిస్తున్నారు. కొన్ని ముడిసరుకులు, వస్తువులను పది, పదిహేను రోజులకోసారి కొనుగోలు చేస్తున్నారు. దీంతో హడావుడిగా అనుమతులు పొందుతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో తప్పడం లేదని ఆయా విభాగాల అధికారులు చెబుతున్నారు. ఇందుకు ప్రత్యామ్నాయంగా ఇకపై మూడునెలలకోసారి కొనుగోళ్లు చేయాలని భావిస్తున్నారు. సరుకుల నిల్వకు తగిన గోదాములు సిద్ధం చేసుకోవాలని బోర్డు కూడా సూచన చేసిందని తెలిసింది. అలాగే శాలువాల మంగళగిరి వంటి స్థానిక ప్రాంతాల నుంచి టీటీడీ నేరుగా కొనుగోలు చేసే అంశం పరిశీలించాలని కూడా అధికారులకు బోర్డు సూచించింది. త్వరలోనే మార్కెటింగ్ విభాగంలో ఈ నిబంధనలు అమలు కానున్నాయి.