TTD Offers Sri Vari Blessing: కొత్త జంటకు శ్రీవారి అక్షింతలు!
ABN , Publish Date - Dec 24 , 2025 | 04:42 AM
నూతన వధూవరులకు శ్రీ వారి దీవెనలతో అక్షింతలు, కుంకు మ, కంకణం, ఆశీర్వచనం పత్రిక, కల్యాణ సంస్కృతి అనే పుస్తకాన్ని టీటీడీ అందిస్తోంది
తిరుమల, డిసెంబరు 23(ఆంధ్రజ్యోతి): నూతన వధూవరులకు శ్రీ వారి దీవెనలతో అక్షింతలు, కుంకు మ, కంకణం, ఆశీర్వచనం పత్రిక, కల్యాణ సంస్కృతి అనే పుస్తకాన్ని టీటీడీ అందిస్తోంది. ప్రతి ఏడాది శుభలేఖ పంపిన లక్షకు పైగా జంటలకు శ్రీవారి ఆశీస్సులతో కల్యాణం జరుగుతోంది. ఈ మహత్తర కార్యక్రమాన్ని టీటీడీ కొన్నేళ్లుగా కొనసాగిస్తోంది. కల్యాణంలో మొదటి ఘట్టంగా వధూవరులకు కంకణధారణ చేస్తారు. ఇందుకోసం శ్రీపద్మావతి అమ్మవారి ఆశీస్సులతో కుంకుమతో పాటు కంకణాన్ని పంపుతున్నారు. ఇక, వివాహంలో చివరిగా తలంబ్రాలు పోసే ఆచారం ఉంది. కొత్త దంపతులకు సకల మంగళాలు కలగాలని, వారి దాంపత్యం ఫలప్రదం కావాలని కోరుతూ టీటీడీ శ్రీవారి ఆశీస్సులతో తలంబ్రాలు పంపుతోంది. ఇక, వివాహ వ్యవస్థ గురించి తెలిపేందుకు ‘కల్యాణ సంస్కృతి’ పుస్తకాన్ని, శ్రీవారు, అమ్మవారి ఫొటోలతో కూడిన వేదాశీర్వచన పత్రికను పంపుతున్నారు. కొత్త జంటలకు శ్రీవారి ఆశీస్సులు అందించడానికి తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనంలో ఉన్న తపాలా విభాగం సిబ్బంది నిరంతరాయంగా శ్రమిస్తున్నారు. దీనికోసం వధూవరులు తమ పూర్తి చిరునామాతో ‘కార్యనిర్వాహణాధికారి, టీటీడీ పరిపాలన భవనం, కేటీ రోడ్డు, తిరుపతి 517501’ పేరుతో వివాహ పత్రికను పంపాలి. మరిన్ని వివరాలకు కాల్ సెంటర్ నం.155257లో భక్తులు సంప్రదించవచ్చు.