TTD: వీఆర్‌ఎస్సా.. బదిలీనా!
ABN , Publish Date - Dec 10 , 2025 | 04:24 AM
టీటీడీలో అన్యమత ఉద్యోగుల విషయంలో తదుపరి చర్యలకు రంగం సిద్ధమైంది. హిందూయేతర ఉద్యోగులతో స్వచ్ఛంద పదవీ విరమణ చేయించాలని, లేదా వారిని ఇతర ప్రభుత్వ శాఖలకు...
టీటీడీలో అన్యమత ఉద్యోగులకు త్వరలో ఆప్షన్లు
పాలకమండలి ప్రతిపాదనలకు ప్రభుత్వం ఓకే
వీఆర్‌ఎ్‌సకు అంగీకరిస్తే మిగిలిన సర్వీసు కాలానికి
ఇవ్వాల్సిన జీతభత్యాలు ఒకేసారి చెల్లింపునకు సిద్ధం
లేకుంటే ఇతర ప్రభుత్వ శాఖలకు బదిలీకి నిర్ణయం
ఎప్పటినుంచో కొనసాగుతున్న వివాదానికి తెర
(తిరుపతి-ఆంధ్రజ్యోతి)
టీటీడీలో అన్యమత ఉద్యోగుల విషయంలో తదుపరి చర్యలకు రంగం సిద్ధమైంది. హిందూయేతర ఉద్యోగులతో స్వచ్ఛంద పదవీ విరమణ చేయించాలని, లేదా వారిని ఇతర ప్రభుత్వ శాఖలకు బదిలీ చేయాలని పాలక మండలి చేసిన ప్రతిపాదనలకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. దీంతో ఎప్పటినుంచో కొనసాగుతున్న ఈ వివాదానికి త్వరలో తెర పడనుంది. టీటీడీలో హిందూయేతర మతాలకు చెందిన ఉద్యోగులు కొనసాగుతుండటంపై హిందూ సంఘాలు ఎప్పటినుంచో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నాయి. కూటమి ప్రభుత్వంలో కొత్త బోర్డు ఏర్పాటు కాగానే ఈ అంశంపై దృష్టి సారించింది. హిందూయేతర ఉద్యోగులను ఎట్టి పరిస్థితుల్లోనూ దేవస్థానంలో కొనసాగించే ప్రసక్తే లేదని చైర్మన్ బీఆర్ నాయుడు బాధ్యతలు తీసుకున్న వెంటనే కుండబద్దలు కొట్టారు. ప్రస్తుత బోర్డు ఏర్పాటైన తర్వాత జరిగిన రెండో సమావేశంలోనే ఈ అంశాన్ని అజెండాలో చేర్చి చర్చించారు. ఇతర మతాలకు చెందిన ఉద్యోగులకు ఉద్వాసన పలికేందుకు రెండు ప్రత్యామ్నాయాలు నిర్ణయించారు. అందులో మొదటిది స్వచ్ఛంద పదవీ విరమణ(వీఆర్‌ఎస్). దీనికి ముందుకొచ్చే వారికి మిగిలిన సర్వీసు కాలానికి గానూ ఇవ్వాల్సిన జీతభత్యాలను ఒకేసారి చెల్లిస్తారు. అందుకు అంగీకరించని వారిని ప్రత్యామ్నాయంగా ఇతర ప్రభుత్వ శాఖలకు బదిలీ చేస్తారు. ఈ రెండింటినీ అన్యమత ఉద్యోగుల ఎదుట ఉంచి వారి అభీష్టం మేరకు అమలు చేయాలని పాలకమండలి నిర్ణయించింది. ఇందుకు అనుమతి కోరుతూ ప్రభుత్వానికి లేఖ రాసింది. దీనిపై కసరత్తు చేసిన ప్రభుత్వం తాజాగా టీటీడీ ప్రతిపాదనలు అమలు చేయడానికి అనుమతిచ్చింది. ఈ మేరకు దేవదాయ శాఖ ముఖ్య కార్యదర్శి నుంచి గత శనివారం టీటీడీకి ఉత్తర్వులు అందాయి.
ఎస్‌ఆర్‌లో మతం పేర్కొంది 40 మందే
ప్రభుత్వం నుంచి అనుమతి రావడంతో అన్యమత ఉద్యోగుల తొలగింపుపై టీటీడీ కసరత్తు ప్రారంభించింది. టీటీడీలో ఇతర మతాలకు చెందినవారిని నియమించరాదంటూ నిబంధనలు అమల్లోకి రాకముందే పలువు రు ఉద్యోగాల్లో చేరారు. అలాంటి వారు సర్వీసు రిజిస్టర్లలో తమ మతాలను స్పష్టం గా పేర్కొన్నారు. వారిలో చాలామంది ఇప్పటి కే రిటైరయ్యారు. ఇప్పటికీ సర్వీసులో ఉన్న ఈ తరహా ఉద్యోగులు 40 మంది మాత్రమేనని సమాచారం. తొలుత వీరికి స్వచ్ఛంద పదవీ విరమణకు అవకాశం ఇస్తూ సర్క్యులర్ జారీ చేయనున్నారు. వీఆర్‌ఎస్ ప్రతిపాదనకు అంగీకరించని ఉద్యోగుల జాబితాను దేవదాయ శాఖ ద్వారా రాష్ట్ర మైనారిటీ సంక్షే మ శాఖకు టీటీడీ పంపనుంది. ఆ శాఖ అం దుబాటులో ఉన్న ఖాళీలకు అనుగుణంగా వారిని ఆయా పోస్టులకు బదిలీ చేయనుంది. ఈ ప్రక్రియ త్వరలో ముగియనుంది.
వివాదం అంతా వారితోనే
సర్వీసు రిజిస్టర్లలో హిందువులుగా పేర్కొ ని కూడా.. ఇతర మతాలను అనుసరిస్తున్న ఉద్యోగులు టీటీడీలో పెద్దసంఖ్యలోనే ఉన్న ట్టు ఆరోపణలున్నాయి. అలాంటి వారిపై టీటీడీకి, విజిలెన్స్ విభాగానికి తరచూ ఆధారాలతో సహా ఫిర్యాదులు అందుతూనే ఉన్నా యి. ఇకపై ఇలాంటి ఫిర్యాదులు వస్తే టీటీ డీ సీరియ్‌సగా పరిగణించనుంది. అలాంటి వారిపై విజిలెన్స్ విచారణకు ఆదేశించనుంది. విచారణలో పక్కా ఆధారాలు లభిస్తే వారిని సర్వీసు నుంచి తొలగించనుంది. ఈ నెల 1న జరిగిన టీటీడీ అధికారుల సమావేశంలో దీనిపై సమీక్షించినట్టు సమాచారం. విజిలెన్స్ నివేదికల ఆధారంగా సస్పెండైన 9మంది అధికారులు, ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలు చేపట్టాలని నిర్ణయించినట్టు తెలిసింది. వారి పై లోతుగా విచారించి సమగ్ర నివేదిక ఇవ్వాలని విజిలెన్స్‌ను పాలకమండలి ఆదేశించినట్టు సమాచారం. అరకొర ఆధారాలతో చర్యలు తీసుకుంటే న్యాయపరమైన చిక్కులు వస్తాయని, న్యాయస్థానాల్లో టీటీడీ వైపు నుంచి కేసులు బలంగా నిలిచేలా పక్కా ఆధారాలు సేకరించాలని విజిలెన్స్ అధికారులను బోర్డు ఆదేశించినట్టు తెలిసింది.