Share News

TTD: నాణ్యమైన ‘పట్టు’ కోసం టీటీడీ ప్రయత్నాలు

ABN , Publish Date - Dec 12 , 2025 | 06:14 AM

శ్రీవారి భక్తులకు కప్పే పట్టువస్త్రాలు నాణ్యమైనవి కొనుగోలు చేయడంపై టీటీడీ దృష్టిసారించింది.

TTD: నాణ్యమైన ‘పట్టు’ కోసం టీటీడీ ప్రయత్నాలు

  • స్టాక్‌ పూర్తికాకముందే వస్ర్తాలు కొనేందుకు చర్యలు

  • రూ.400కే సరఫరా చేసేందుకు కొన్ని సముఖత

తిరుమల, డిసెంబరు 11 (ఆంధ్రజ్యోతి): శ్రీవారి భక్తులకు కప్పే పట్టువస్త్రాలు నాణ్యమైనవి కొనుగోలు చేయడంపై టీటీడీ దృష్టిసారించింది. తక్కువ ధరకు కొనేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. గత పదేళ్లుగా వీఆర్‌ఎస్‌ ఎక్స్‌పోర్టు సంస్థ, దాని అనుబంధ సంస్థలు సరఫరా చేస్తున్న పట్టువస్ర్తాలు పట్టువి కాదని, పాలిస్టర్‌ వస్ర్తాలను అధిక ధరకు విక్రయిస్తున్నట్టు టీటీడీ బోర్డు, విజిలెన్స్‌ విభాగాలు తేల్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రూ.1,389 చొప్పున 15 వేల వస్ర్తాల కొనుగోలుకు ఆ సంస్థకు ఇచ్చిన కాంట్రాక్ట్‌ను అక్టోబరులో టీటీడీ రద్దుచేసింది. సాధారణంగా ప్రతిరోజు వీఐపీ బ్రేక్‌తో పాటు వేదాశీర్వచనం టికెట్‌ కొనుగోలు చేసే భక్తులకు ఈ పట్టువస్ర్తాలను కప్పడం ఆనవాయితీ. నిత్యం 80 నుంచి 100 వస్ర్తాలను వినియోగిస్తారు. సరఫరా సంస్థ కాంట్రాక్ట్‌ను రద్దు చేయడంతో ఇప్పటికే కొన్న స్టాక్‌ నుంచే సర్దుబాటు చేస్తూ వస్తున్నారు. ప్రస్తుతం ఎలాంటి లోటు లేకపోయినప్పటికీ త్వరలో కొత్తవి కొనకపోతే లోటు ఏర్పడే పరిస్థితి వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో నాణ్యమైన పట్టువస్ర్తాల కొనుగోలు అంశంపై టీటీడీ దృష్టిసారించింది. టెండర్‌ నిబంధనల మేరకు తక్కువ ధరకు సరఫరా చేసే పలు సంస్థలతో టీటీడీ ఇప్పటికే సంప్రదింపులు చేసినట్టు సమాచారం. మంగళగిరి, గుంటూరు వంటి వివిధ ప్రాంతాల్లోని నాణ్యమైన పట్టువస్ర్తాలను టీటీడీ అవసరాలకు తగ్గట్టు సరఫరా చేసే సంస్థలు ఏవైనా ఉన్నాయా అనే కోణంలో టీటీడీ పరిశీలిస్తోంది. రూ.400 ధరకే నాణ్యమైన పట్టువస్ర్తాలు సరఫరా చేసేందుకు కొన్ని సంస్థలు ముందుకొచ్చినట్టు తెలిసింది. వీలైనంత త్వరగా మేలురకం వస్ర్తాలను అధిక మొత్తంలో కొనుగోలు చేసేలా అధికారులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

Updated Date - Dec 12 , 2025 | 06:15 AM